Revanth Reddy: రైతులకు ఉచిత్ విద్యుత్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలిగించాయి. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా రేవంత్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ శ్రేణులు మరికాస్త వక్రీకరిస్తూ జనాల్లోకి తీసుకెళ్లాయి. వీలైనంతగా కాంగ్రెస్, రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించి విజయం సాధించింది. ఈ విషయంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది. అయితే, మధ్యలో రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయాడు. కాంగ్రెస్‌కూ నష్టం చేశాడు. నిజంగా రేవంత్ వ్యాఖ్యల ఉద్దేశం వేరే అయి ఉండొచ్చు. ఆయనేం చెప్పాలనుకున్నారో కానీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో కాంగ్రెస్ గాలి ఒక్కసారి తీసేసినట్లైంది.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఒక సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. రైతులకు నిజానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదని, విద్యుత్ సంస్థల కమీషన్ల కోసమే కేసీఆర్ ఉచిత్ విద్యుత్ ఇస్తున్నారని అన్నాడు. మూడెకరాలు ఉన్న రైతుకు 24 గంటల విద్యుత్ అవసరం ఎందుకుంటుందని, మూడు గంటలు సరిపోతుందని వ్యాఖ్యానించాడు. రేవంత్ వ్యాఖ్యల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్‌ను రద్దు చేస్తామని, మూడు గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తామని స్పష్టంగా చెప్పినట్లు లేదు. కానీ, రేవంత్ వ్యాఖ్యలు అదే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారని ప్రచారం మాత్రం జరిగిపోయింది. అంతే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలే విద్యుత్ ఇస్తారని, ఉచిత విద్యుత్ రద్దవుతుందని, ఇది కాంగ్రెస్ నిజ స్వరూపం అని బీఆర్ఎస్ పార్టీ విరుచుకుపడుతోంది. ఆ పార్టీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో దీనిపై విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గతంలోలాగా విద్యుత్ కోస పడిగాపులు పడాల్సి వస్తుందని, రాత్రుళ్లు పొలాల దగ్గరే ఉండాల్సి వస్తుందని బీఆర్ఎస్ ప్రచారం చేసింది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రైతుల్ని కూడా ముందుండి నడపించింది. మొత్తానికి రేవంత్, కాంగ్రెస్ లక్ష్యంగా.. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేస్తారనే బీఆర్ఎస్ ప్రచారం మాత్రం సక్సెస్ అయింది.
కాంగ్రెస్‌కు తీరని డ్యామేజ్
రేవంత్ వ్యాఖ్యల అసలు ఉద్దేశం ఏదైనా ఉచిత విద్యుత్‌కు కాంగ్రెస్ వ్యతిరేకమనే ప్రచారం మాత్రం జనాల్లోకి వెళ్లింది. బీఆర్ఎస్ నేతలు ఎప్పట్లానే రేవంత్‌పై, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు తిప్పలు తప్పవని వివరించారు. ముఖ్యంగా రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. కొంతకాలంగా వచ్చిన పాజిటివ్ ఇమేజ్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ముఖ్యంగా ఇటీవల రాహుల్ గాంధీ సభతో వచ్చిన పాజిటివ్ ఇమేజ్ కూడా దెబ్బతింది. ఈ విషయంలో ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియని స్థితిలోకి కాంగ్రెస్ వెళ్లింది. పార్టీకి వచ్చిన ఊపు ఒక్కసారిగా తగ్గిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ తన వ్యాఖ్యలతో బీఆర్ఎస్‌కు భారీ అస్త్ర్రాన్ని అందించారు. దీన్ని ఆ పార్టీ సరిగ్గా వాడుకుంది.
కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా కారణమే..
నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో డ్యామేజ్ జరిగేందుకు ఆ పార్టీ సీనియర్ నేతలు కూడా కారణమే. ఏ పార్టీ అయినా పొరపాట్లు చేసినప్పుడు ఆ పార్టీ నేతలు కప్పిపుచ్చేందుకు, సర్దిపుచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ వ్యాఖ్యల్ని వక్రీకరించారనో, కుట్ర అనో చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రత్యర్థి పార్టీపై ఎదురుదాడి చేస్తారు. దీనివల్ల కొంత డ్యామేజ్ కంట్రోల్ జరుగుతుంది. కానీ, కాంగ్రెస్ తరఫునుంచి ఈ తరహా ప్రయత్నం పెద్దగా జరగలేదు. కారణం.. రేవంత్ రెడ్డి. పార్టీ సీనియర్ నేతలకు, రేవంత్ రెడ్డికి మధ్య విబేధాలున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌తోపాటు కాంగ్రెస్ నేతలు కూడా రేవంత్ ఎక్కడ దొరుకుతాడా అని ఎదురుచూశారు. విద్యుత్ విషయంలో చేసిన వ్యాఖ్యలతో రేవంత్ అటు బీఆర్ఎస్‌కు, ఇటు సొంత పార్టీ నేతలకు చిక్కారు. రేవంత్‌పై, కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ విరుచుకుపడుతున్నా తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరుగుతున్నా పెద్దగా పట్టించుకోలేదు. అది పూర్తిగా రేవంత్ మీదకు వెళ్తుందనుకుంటే.. చివరకు కాంగ్రెస్ పార్టీకి చిక్కు తెచ్చిపెట్టింది. తర్వాత కొందరు నేతలు మెల్లిగా రంగంలోకి దిగి, బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నించారు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరించారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. డ్యామేజ్ కంట్రోల‌్‌కు ప్రయత్నించారు. కానీ, ఆలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీ ఇమేజ్ దెబ్బతింది. ఈ విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గట్టిగా ప్రయత్నించి ఉంటే ఇంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదు.
మొదటికొచ్చిన కాంగ్రెస్ పని
రేవంత్ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ ఇమేజ్ మళ్లీ మునుపటి స్థితికి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై వివరణ ఇస్తూ, జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మళ్లీ రేసులో నిలబడుతుంది. ఈ అంశం ద్వారా రుజువైన అంశం మరొకటుంది. అదే ఇంకా పార్టీలో అసమ్మతి, అసంతృప్తి చల్లారలేదని. ఎవరికివారే అన్నట్లుగా ఉంటున్నారని. రేవంత్ వ్యాఖ్యలపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించేందుకు ఒక్క కీలకనేత కూడా ముందుకురాలేదంటే రేవంత్‌పై సీనియర్లకు ఇంకా ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీకి ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరికి వారే అన్నట్లు ఉండే కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకోవడం కష్టమే.