దేశంలో ఎటు చూసినా రాజకీయ యాత్రల సీజన్ కొనసాగుతుంది. ప్రజల కష‌్ట, నష్టాలు తెలుసుకోవడం కోసం ప్రతిఒక్కరికీ పాదయాత్ర అనేది అస్త్రంగా మారింది. తెలంగాణలో వై ఎస్ షర్మిల, బండి సంజయ్ లు ఇప్పటికే ఈ పాదయాత్రల రేసులో ముందంజలో ఉన్నారు. ఇప్పుడు ఈ రేస్ లోకి మరో రాజకీయ నాయకుడు పాల్గొంటున్నారు. ఆయనే కాంగ్రెస్ ఎంపీ,టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్, బిజెపిల ఓటమే ప్రధాన లక్ష్యంగా ఈ యాత్రను భద్రాచలం రాములోరి సన్నిధి నుంచి తొలి అడుగు వేయనున్నారు. ఇంతకీ.. పాదయాత్రకు రేవంత్‌రెడ్డి భద్రాచలాన్నే ఎందుకు ఎంచుకున్నారు అనేది అందరికీ ఆశ్చర్యం కలిగించే అంశం. బీఆర్ఎస్, బీజేపీపై ఎన్నికల దండయాత్రకు రేవంత్ సెంటిమెంట్ అస్త్రాలను బలంగానే ఎక్కుపెట్టారని చెప్పాలి.
భద్రాచలం అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడిచిన పుణ్యభూమి. దీనిని ఇల వైకుఠంగా దక్షిణ అయోధ్యగా ప్రాధాన్యం సంతరించుకున్న వైష్ణవ పుణ్యక్షేత్రం. కోట్లాది మంది భక్తులు నిత్యం కీర్తించే దేవాలయం. అలాంటి పుణ్యక్షేత్రాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక భద్రాద్రిని చిన్న చూపు చూశారని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహంగా వ్యక్తం చేశాయి. సీఎంగా 2015లో తొలిసారి సీతారాముల కళ్యాణానికి హాజరైన కేసీఆర్.. అప్పటినుంచి ఏడేళ్లుగా రామాలయం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం.. తానీషా కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ ఇది కొనసాగింది. అయితే.. కేసీఆర్ ఆ ఆనవాయితీకి స్వస్థి చెప్పారు. అంతేకాకుండా వంద కోట్లతో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామన్న వాగ్ధానానికి తిలోదకాలిచ్చారు. కేసీఆర్ పాలనలో పాలక మండలి నియామకం కూడా లేక పాలన గాడి తప్పింది. దీంతో.. భద్రాద్రి రాముని పట్ల కేసీఆర్ వ్యవహార శైలిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా సెంటిమెంట్ అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రజలికిచ్చిన మాట కాదు.. సాక్ష్యాత్ ఆ దేవుడికిచ్చిన మాట కూడా తప్పిన కేసీఆర్‌ను ఎలా నమ్ముతారనే అంశాన్ని సెంటిమెంట్‌గా ప్రయోగించబోతున్నట్లు తెలుస్తుంది. యాదాద్రి విషయంలో ఒకలా.. భద్రాద్రి విషయంలో మరోలా ఉన్నారంటూ.. కేసీఆర్‌ని ఇరుకున పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నారయి. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు భద్రాచలాన్ని ఎంచుకోవడంలో మరో ముఖ్య కారణం కూడా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి సీట్లు గెలిపించిన జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం నిలిచింది. భద్రాద్రి జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. భద్రాచలంలో పొదెం వీరయ్య, పినపాకలో రేగా కాంతారావు, ఇల్లందులో హరిప్రియ, కొత్తగూడెంలో వనమా కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. అశ్వరావుపేటలో కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు గెలిచారు. టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకుండా జనం కాంగ్రెస్‌ను గెలిపించారు. అయితే.. కాంగ్రెస్ తరపున గెలిచిన ముగ్గురిని, టీడీపీ నుంచి గెలిచిన ఒకరిని బీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసి వారి పార్టీలోకి లాక్కున్న సంగతి మనకు తెలిసిందే. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాత్రం కాంగ్రెస్ నే నమ్ముకొని ఉన్నారు.
పాదయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించడానికి మరో కారణం ఈ జిల్లా పూర్తి ఏజెన్సీ ప్రాంతం. ప్రధానంగా పోడు భూముల రగడ సర్కార్ కి పెద్ద తలనొప్పిగా మారింది. పోడు రైతులకు పట్టాలు ఇస్తామన్న వాగ్దానాన్ని కేసీఆర్ ఇప్పటికీ నెరవేర్చలేదు. స్వయంగా కేసీఆర్ పలుమార్లు పోడు పట్టాలు ఇస్తామని ప్రకటించినా ఆ మాటకు విలువ లేకుండా పోయింది. ఇదిచాలదన్నట్లు.. హరితహారం పేరుతో పోడు భూముల్లోని పంటలను ధ్వంసం చేయడం, ఆదివాసీ గిరిజన పోడు రైతులపై లాఠీచార్జీలు, అక్రమ కేసులతో అడవికి దూరం చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి.. కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, అణచివేతపై విసుగు చెందిన ఆదివాసీ రైతులు ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావును హత్య చేయడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో.. పోడు రైతులు, ఫారెస్ట్ సిబ్బందికి పంచాయతీ పెట్టిన పెద్దన్నగా ప్రభుత్వం మారింది. పోడు భూముల వ్యవహారం పెను తుఫానులా మారినా.. ప్రభుత్వం పరిష్కారం చేయకుండా కమిటీలు సర్వేల పేరుతో కాలం వెల్లబెడుతుంది. పోడు సమస్యతోపాటు సింగరేణి కార్మికుల సమస్యలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత బందు అందరికీ అందకపోవడం.. ఇలా ఎన్నో సమస్యలు బీఆర్ఎస్‌ను వెంటాడుతున్నాయి. ప్రభుత్వంపై పెద్దయెత్తున వ్యవతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో దాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు రేవంత్ భారీ స్కెచ్ వేశారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కేసీఆర్‌పైనున్న వ్యతిరేకతే.. భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్‌కు బాగా కలిసొచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక బీజేపీని టార్గెట్ చేసేందుకు వారి హిందుత్వవాదానికి ధీటుగా దేవుని సెంటిమెంట్ ను రాబట్టగలిగేలా భద్రాదీశుడి దీవెనలతో తొలి అడుగు పెడుతున్నా అని చెప్పకనే చెబుతూ రామబాణం ఎక్కుపెట్టాడు. ఈ రెండు పార్టీలను మట్టుపెట్టేలా ఎజెండా ఫిక్స్ చేసుకొని రేవంత్‌రెడ్డి భద్రాచలాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న బీజేపీ.. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం.. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే రామ జపం చేస్తున్నారని కమలనాథులను టార్గెట్ చేసే అవకాశం ఉంది. దీంతోపాటు.. కర్నాటక కేసీఆర్ సుఫారీ అంశం.. రేవంత్ పాదయాత్రకు పొలిటికల్ వెపన్‌గా మారనుంది. కర్నాటకలో కాంగ్రెస్‌ను ఓడించడానికి కేసీఆర్.. మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు 500 కోట్లు ఆఫర్ చేశారని కన్నడ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్.. బీజేపీకి మద్దతు ఇస్తున్నారని దీనికి కర్నాటక సుఫారీ అంశమే నిదర్శనమని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేవంత్ బృందం వ్యూహాలు రచిస్తున్నాట్లు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్‌లో కవిత పట్ల బీజేపీ ఉదాశీనంగా వ్యవహరిస్తుందనే అంశాన్ని రేవంత్ ఆయుధంగా మార్చుకుని.. బీజేపీ.. బీఆర్ఎస్ ఒక్కటేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. కర్నాటక సుఫారీ అంశం, కవిత లిక్కర్ స్కామ్‌ను ఎండగడుతూ.. ఒకే దెబ్బకు రెండుపిట్టలు అనే మాదిరిగా బీజేపీ, బీఆర్ఎస్‌ను ఓడించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
భద్రాద్రి మున్సిపాలిటీ రగడ విషయంలో కేసీఆర్ భయపడుతుంటే రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తూ రాజకీయ రావణాసురులను ఎన్నికల యుద్దంలో వధించేందుకు సిద్దం అయ్యారు. అందులో భాగంగానే ఈ పాదయాత్ర నిర్ణయాన్ని భద్రాచలం నుంచి తీసుకున్నారని చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఆ విజయాన్ని సోనియమ్మకు ఓ కానుకలా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇలా కనుక జరిగితే రేవంత్ తనను తాను నిరూపించుకున్నాట్లు అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ లో సీనియర్ లకు ఉన్నత పదవులు ఇవ్వకుండా తాజాగా వచ్చిన వారికి ఇస్తున్నారనే వాటికి చరమగీతం పాడచ్చు. అధికారంలో తెచ్చే కెపాసిటీ రేవంత్ కు ఉందని గుర్తించినందుకే టిపిసి ఛీప్ గా భాద్యతలు అప్పిగించామని చెప్పుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక కీ దోరుకుతుంది. రేవంత్ రెడ్డికి మరి శ్రీరాముని కటాక్షం ఏ మేరకు కలిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పట్టాభిషేకం చేయిస్తుందో ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు.