ట్రంప్ ఏం చేసినా సంచలనమే.. తాజాగా మరో సంచలనానికి తెర తీశారు ఈ మాజీ ప్రెసిడెంట్. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న ఆయన.. తనను అరెస్ట్ చేయబోతున్నారని ప్రకటించారు. తనను అరెస్టు చేయాలంటూ ఆయనే కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. నిజమే ట్రంప్‌ను అరెస్ట్ చేసేందుకు మన్‌హటన్ డిస్ట్రిక్ అటార్ని రంగం సిద్ధం చేసింది. అయితే దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయోనన్నదే ఇప్పుడు అందరిలో టెన్షన్. తనను అరెస్ట్ చేస్తే అడ్డుకోవాలని మద్దతుదారులకు పిలుపునివ్వడం ద్వారా మరోసారి హింస తప్పదని సంకేతాలు ఇచ్చారు ఈ మాజీ అధినేత. నిరసనలు చేపట్టండి దేశాన్ని కాపాడండి అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు ఈ మాజీ ప్రెసిడెంట్.
2020 ఎన్నికల ఫలితాలను తిరస్కరించడం ద్వారా హింసకు ప్రేరేపించినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దానిపై విచారణ జరుగుతోంది. దీంతో పాటు పదవి నుంచి దిగిపోయాక కొన్ని రహస్య డాక్యుమెంట్లను తనతో తీసుకెళ్లారు. ఆ తర్వాత తనిఖీల్లో అవి బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ట్రంప్ అరెస్టుకు కారణమవుతోంది ఆ కేసులేమీ కాదు. 2016లో అధ్యక్ష ఎన్నికలకు ముందు అడల్ట్ మూవీ స్టార్ స్టామీ డేనియల్స్‌తో తనకున్న సంబంధాన్ని బయటపెట్టకుండా దాచడం. అందుకోసం లక్షా 30వేల డాలర్లు చెల్లించి ఆమె నోరు తెరవకుండా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇది చట్టాలను ఉల్లంఘించడమే. అయితే ట్రంప్ మాత్రం తాను ఎలాంటి తప్పూ చేయలేదంటున్నారు. ఆయన విచారణకు కూడా హాజరుకాలేదు. అభియోగాలు రుజువైతే అమెరికా చరిత్రలోనే అటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ అధ్యక్షుడిగా చరిత్రలో నిలిచిపోతారు.
ఈ కేసులో ట్రంప్‌ను దోషిగా తేల్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే దేశంలో హింస చెలరేగే అవకాశాలున్నాయని ట్రంప్ లాయర్లు హెచ్చరిస్తున్నారు. దీనికంటే ముందే ట్రంప్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తను గతంలో పదవుల్లో కూర్చోబెట్టిన అధికారులను రెచ్చగొట్టి తనకు అనుకూలంగా పనిచేసేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగా ఆ కేసులో తీర్పు ఇవ్వబోతున్న న్యాయమూర్తిపై ఇప్పటికే ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ కేసులో అరెస్టైతేనే మంచిదనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు కనిపిస్తోంది. దీని ద్వారా అమెరికా ప్రభుత్వం తన వ్యతిరేకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందనే ఆరోపణలతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. అరెస్టైతే మరోసారి తాను కచ్చితంగా అధ్యక్షుడిగా ఎన్నికవుతానని ట్రంప్ నమ్ముతున్నట్లే కనిపిస్తోంది.
ఒకవేళ ఆరోపణలు రుజువైతే ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేయవచ్చా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. అయితే సాంకేతికంగా ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అయితే ట్రంప్ అరెస్టైతే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళుతుందన్న వారూ లేకపోలేదు. అయితే ట్రంప్ మాత్రం వివాదమే తన విజయానికి సోపానమని భావిస్తున్నారు. అయితే ట్రంప్ న్యాయపరమైన చిక్కులు ఈ ఒక్క ఎపిసోడ్‌తో తీరిపోయేలా లేవు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాన్ని మార్చాలంటూ జార్జియా అధికారులపై ఒత్తిడి తెచ్చిన కేసు విచారణ కూడా త్వరలోనే ముగియనుంది. మరి ఇన్ని వరుస కేసులను ఎదుర్కొంటూ ట్రంప్ తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంపై ఎలా దృష్టి పెట్టగలరో చూడాలి.