తెలంగాణలో అతి త్వరలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 55 మంది ఎంపీలు రాజ్యసభ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిటైర్డ్ అవుతున్నారు. అందులో తెలంగాణకు చెందిన వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీకాలం ఏప్రిల్ 2తో ముగుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో బలా బలాలు మారాయి. ఇప్పుడీ 3 సీట్లు ఏ పార్టీకి వస్తాయన్నది చర్చగా మారింది.
55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలంలో ఏప్రిల్ తో అయిపోతుండటంతో వచ్చే మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణకు చెందిన ముగ్గురు BRS ఎంపీలు రిటైర్డ్ అవుతున్నా… మళ్ళీ ఆ పార్టీకి దక్కేది ఒక్క ఎంపీ మాత్రమే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 119 మంది శాసనసభ్యులు ఉండగా… ఒక్కో ఎంపీని ఎన్నుకోడానికి 39.6 సభ్యులు అవసరం అవుతారు. ఈ కోటాలో ఏ పార్టీ కూడా 2 లేదా 3 ఎంపీ సీట్లు గెలిచే ఛాన్స్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 64 మంది ఉన్నారు. మిత్రపక్షం సీపీఐకి ఒకరు. అలాగే BRS కు 39 మంది, బీజేపీకి 8 మంది, మజ్లిస్ కు ఏడుగురు సభ్యుల బలం ఉంది.
39.6 సభ్యుల బలంతో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ సీటు గ్యారంటీ. ఇంకా పాతిక ఓట్లు మిగులుతాయి. బీఆర్ఎస్ కి ఉన్న 39 మంది సభ్యులతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురి సపోర్ట్ తో ఒక రాజ్యసభ స్థానం గెలుచుకుంటుంది. ఇంకా మిగిలేది 6 ఓట్లు. వాటితో రెండోస్థానం గెలవడం కష్టం. రాజ్యసభకు తమ అభ్యర్థిని పోటీలోకి దింపాలంటే పార్టీకి కనీసం 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీజేపీకి ఉన్నది 8 మందే కాబట్టి… ఆపార్టీ అసలు పోటీలో నిలిపే అవకాశమే లేదు.
ఇప్పుడు 3 రాజ్యసభ సీట్లల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరొకటి మాత్రమే గెలిచే ఛాన్సుంది. అది కూడా పోటీకి అభ్యర్థులను నిలబెడితే…. అలా కాకుండా… రెండు పార్టీలు కలిపి కేవలం ముగ్గుర్ని మాత్రమే పోటీకి దింపితే… అప్పుడు పోలింగ్, సంఖ్యా బలం లాంటి ఈక్వేషన్స్ ఏవీ లేకుండానే ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయ్యి… కాంగ్రెస్ ఇద్దరు, బీఆర్ఎస్ ఒకర్ని బరిలోకి దింపితే తెలంగాణ నుంచి మళ్ళీ ముగ్గురు రాజ్యసభ ఎంపీలు అయ్యే ఛాన్సుంది. రెండు పార్టీలు ప్రతిష్టకు పోతే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.