Telangana BJP: తెలంగాణలో బీజేపీకి మళ్లీ పాత రోజులు వచ్చినట్లే కనిపిస్తోంది. రెండు, మూడేళ్లుగా పార్టీలో వచ్చిన జోష్ ఇప్పుడు కనిపించడం లేదు. మొన్నటిదాకా బీజేపీ ఊపు చూసి, ఆ పార్టీలో చేరిన నేతలు ఇప్పుడు నెమ్మదిగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందా అనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత.. తెలంగాణకు బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక బీజేపీకి మంచి ఊపొచ్చింది. అధికార బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ వివిధ అంశాలపై పోరాటం ప్రారంభించింది. హిందూత్వ అంశం కూడా కలిసొచ్చింది. దీంతో బీజేపీలో జోష్ పెరిగింది. కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది.
అటు కేంద్రంలో మోదీ హవా.. ఇటు తెలంగాణలో బీజేపీ దూకుడు చూసి ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీవైపు చూడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చాలా మంది బీజేపీలో చేరారు. అధికార బీఆర్ఎస్ నుంచి కూడా కొందరు బీజేపీకి జై కొట్టారు. వీరిలో కోమటిరెడ్డి రాజేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి వంటి నేతలున్నారు. బీఆర్ఎస్‌ను ఎదుర్కోగల సత్తా బీజేపీకే ఉందని భావించారు. రాబోయేది తమ ప్రభుత్వమే అనుకున్నారు. కానీ, కర్ణాటక ఫలితాలతో మొత్తం తారుమారైంది. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు జోష్ వచ్చింది. ఈ ప్రభావం తెలంగాణలోనూ మొదలైంది.
దీంతో మొన్నటిదాకా బీఆర్ఎస్‌ను ఎదుర్కునే సత్తా బీజేపీకే ఉందని భావించిన నేతలకు ఇప్పుడు ఆ పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. పైగా చాలా మందికి ఈ పార్టీ అధినాయకత్వం తీరుపై అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీలో ఉండటం తమ రాజకీయ భవిష్యత్తుకు ఎంతమాత్రం మంచిది కాదని నేతలు భావిస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇలాంటివాళ్లందరికీ ఉన్న ఏకైక ఆప్షన్.. కాంగ్రెస్. అధికార బీఆర్ఎస్‌లో ఎలాగూ హౌజ్ ఫుల్ ఉంది. అందుకే వీళ్లంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. చాలా మంది నేతలు నెమ్మదిగా బీజేపీకి టాటా చెప్పి కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు.
వచ్చిన నేతలంతా వెనక్కే..
మొన్నటిదాకా ఇతర పార్టీల నుంచి ఇలా చాలా మంది బీజేపీలో చేరారు. ఇప్పుడు వీళ్లంతా దాదాపు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలంతా తిరిగి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కోమటిరెడ్డి, ఈటల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి వంటి నేతలు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ఇక తెలంగాణలో బీజేపీ కోలుకోవడం చాలా కష్టం. ఎందుకంటే బీజేపీకి బలమైన నేతలు తెలంగాణలో లేరు. పది, ఇరవై మంది కీలక నేతలు కూడా ఆ పార్టీలో కనిపించరు. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అలాంటిది వచ్చిన నేతలు.. వచ్చినట్లే వెళ్లిపోతుంటే ఇక బీజేపీలో ఎవరుంటారు? బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే అతికొద్ది మంది మాత్రమే ఈ పార్టీలో మిగిలే అవకాశం ఉంది. ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రాజా సింగ్, విజయ శాంతి వంటి కొద్ది మంది మాత్రమే ఆ పార్టీకి కట్టుబడి ఉండే అవకాశం ఉంది. మిగతా నేతలు చాలా మంది అవసరానికి అనుగుణంగా పార్టీలు మారిపోయేవాళ్లే. మిగిలిన నేతలతో అధికారంలోకి రావడం కాదు కదా.. కనీస సీట్లు కూడా గెలవలేని పరిస్థితి. దీంతో ఇప్పుడు బీజేపీ పరిస్తితి ఎటూ పాలుపోవడం లేదు.
ఎన్నికల వేళ ఎదురుదెబ్బ?
వచ్చే డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. మరో ఆరు నెలలే ఉన్న పరిస్థితుల్లో కీలక నేతలంతా పార్టీని వీడితే బీజేపీకి ఓటమి తప్పదు. అసలే అధిష్టానం తెలంగాణ విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకుంది. కొంచెం శ్రమిస్తే తెలంగాణలో అధికారంలోకి రావొచ్చని నమ్మింది. కానీ, ఇప్పుడా పరిస్థితులు కనిపించడం లేదు. తెలంగాణ అనే కాదు.. చాలా చోట్ల బీజేపీకి గడ్డు పరిస్థితులే ఎదురవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్ల పరాజయం తెచ్చిన ఫలితం ఇది. ఇప్పటికైనా బీజేపీ నేతలు తమ తప్పులు సరిదిద్దుకుని పార్టీకి మునుపటి ఊపు తీసుకురాలేకపోతే తెలంగాణపై ఆ పార్టీ అధిష్టానం ఆశలు వదులుకోవాల్సిందే.