Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, బెయిల్ విషయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో జడ్జి తీర్పు వెల్లడించనున్న నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు కోసం పోలీసులు రెండు కాన్వాయ్‌లు సిద్ధం చేశారు. ఎలాంటి తీర్పు వచ్చినా అమలు చేసేందుకు, ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు తలెత్తకుండా చూసేందుకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు.
రెండు కాన్వాయ్‌లలో ఒకటి చంద్రబాబు సొంత కాన్వాయ్. చంద్రబాబుకు బెయిల్ వస్తే ఈ కాన్వాయ్‌లో ఆయనను సురక్షిత ప్రదేశానికి, లేదా టీడీపీ కార్యాలయానికి, ఆయన కోరుకున్న చోటుకు తరలిస్తారు. మరొకటి పోలీసుల కాన్వాయ్. ఒకవేళ చంద్రబాబను అరెస్టు చేయాల్సి వస్తే.. ఆయనను తగిన భద్రత మధ్య సంబంధిత జైలుకు తరలించేందుకు రూపొందించింది. తీర్పును బట్టి ఏ కాన్వాయ్ వాడాలో నిర్ణయిస్తారు. కోర్టు వద్ద ప్రస్తుతం ఉత్కంఠ వాతావారణం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఎలాంటి తీర్పు వచ్చినా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు వెలువడకుండా భద్రతా ఏర్పాట్లను విజయవాడ సీపీ కాంతి రాణా టాటా పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు, పారా మిలిటరీ బలగాలు భారీగా మోహరించారు. కోర్టు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని టీడీపీ భావిస్తోంది.