రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ప్రపంచం ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న సమయంలో రష్యా ఒక్కసారిగా బాంబు పేల్చింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హతమార్చేందుకు ఉక్రెయిన్ కుట్ర చేసిందని రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. క్రెమ్లిన్‌పై దాడి చేయడానికి ప్రయత్నించిన రెండు డ్రోన్లను విజయవంతంగా కూల్చివేసినట్టు రష్యా ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాణాలు తీసేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రగా రష్యా న్యూస్ ఏజెన్సీ చెబుతోంది. దీని వెనుక ఉక్రెయిన్ ఉందని తేల్చింది. డ్రోన్ల దాడిలో పుతిన్‌తో సహా ఎవరూ గాయపడలేదని రష్యా చెబుతోంది.
విక్టరీ డేని ఉక్రెయిన్ టార్గెట్ చేసుకుందా ?
ప్రతి సంవత్సరం మే 9ని విక్టరీ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది రష్యా. జర్మనీ నాజీ సైన్యంపై సోవియట్ ప్రభుత్వం సాధించిన విజయానికి గుర్తుగా విక్టరీ డేను జరుపుకుంటారు. మరో ఆరు రోజుల్లో జరగనున్న ఈ వేడుకల కోసం రష్యా వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే విక్టరీ డే జరిగేలోపే పుతిన్‌ను హతమార్చాలన్న ఆలోచనలో ఉక్రెయిన్ ఉన్నట్టు క్రెమ్లిన్ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే డ్రోన్లతో దాడులకు పాల్పడినట్టు చెబుతోంది. డ్రోన్లతో దాడికి ప్రయత్నించిన సమయంలో అధ్యక్ష భవనంలో పుతిన్ లేరని అయితే ఉక్రెయిన్‌పై ప్రతి దాడులు తప్పవంటూ హెచ్చరించింది.
ఇంతకీ రష్యా చెబుతున్నది నిజమేనా ?
పుతిన్‌ను హత్య చేసేందుకు డ్రోన్ అటాక్ చేశారన్న రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ కొట్టిపడేసింది. క్రెమ్లిన్‌పై తిరిగిన డ్రోన్లకు ఉక్రెయిన్‌తో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. తమ దేశంపై మరోసారి భారీ స్థాయిలో యుద్ధం ప్రకటించేందుకు రష్యా నాటకమాడుతోందని విమర్శించింది. రష్యా కంబంధ హస్తాల నుంచి తమ భూభాగాన్ని రక్షించుకునే పనిలో ఉన్నామని.. ఇతర దేశాలపై దాడులు చేసి అధ్యక్షుడ్ని చంపే తీరిక తమకు లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రతినిధి ప్రకటించారు.
మాటలకందని నష్టం
యుద్ధం ఎవరి మధ్య జరిగినా…ఏ రూపంలో జరిగినా.. చివరకు మిగిలేది నష్టమే. యుద్ధం వల్ల దేశాలు విధ్వంసం కావడం తప్ప ప్రత్యేకంగా సాధించేది ఏమీ ఉండదు. రష్యా దాడులను ఉక్రెయిన్ ఎప్పటికప్పుడు ప్రతిఘటిస్తూనే ఉన్నా… 15 నెలలుగా ఉక్రెయిన్ తన అస్థిత్వాన్ని కోల్పోయింది. రాజధాని కివ్ తో పాటు ఎన్నో చారిత్రక నగరాలను రష్యా బాంబుల దాడుల్లో నేలకొరిగాయి. రెండు దేశాల వైపు నుంచి ప్రాణనష్టం కూడా పెద్ద స్థాయిలోనే ఉంది. గడిచిన ఐదు నెలల్లో ఉక్రెయన్ యుద్ధంలో పాల్గొన్న 20 వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు అమెరికా ఓ అంచనాకు వచ్చింది. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం మానవ జాతి చరిత్రలోనే అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎప్పుడూ లేనంతగా ఉక్రెయిన్ ప్రజలను శరణార్థులుగా మార్చేసింది. దాదాపు 80 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలు నిలువ నీడ లేక శరణార్థులుగా ఇతర దేశాలకు వలసబాట పట్టారు.
యుద్ధానికి ముగింపు లేదా ?
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టి 433 రోజులు గడిచిపోయింది. గతేడాది ఫిబ్రవరి 24న రష్యా ఒక్కసారిగా క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా సహా పశ్చిమ దేశాలతో చేతులు కలిపి తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ఉక్రెయిన్ వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ పుతిన్ వార్ డిక్లెయిర్ చేశారు. అప్పటి నుంచి యుక్రెయన్ పై రష్యా బాంబు దాడులు కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా భారీ స్థాయిలో ఆయుధాలు సరఫరా చేస్తే… సుధీర్ఘమైన పోరాటం చేయడం ద్వారా రష్యా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ ఆర్థిక ఆంక్షలు విధించినా… పుతిన్ మాత్రం వెనుకడగు వేయడం లేదు.
మరో భీకర యుద్ధాన్ని చూడబోతున్నామా ?
15 నెలలుగా యుద్ధం జరుగుతున్నా ఇప్పటి వరకు అధ్యక్షుల హత్యకు కుట్ర జరగలేదు. పుతిన్‌ని హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారని రష్యా చేసిన ప్రకటనలో ఎంత వాస్తవముందో తెలియదు గానీ…ఈ ప్రకటన ద్వారా రష్యా ఉక్రెయిన్ పై మరోసారి భీకర యుద్ధానికి సన్నాహాలు చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రజాభిప్రాయం పేరుతో ఉక్రెయిన్ లోని కొంత భాగాన్ని తమ దేశంలో కలిపేసుకున్న రష్యా.. ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుందన్నది అంతుపట్టడం లేదు. రెండు దేశాల మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర స్థాయిలోకి వెళితే.. ప్రపంచం మరో సంక్షోభాన్ని చూడాల్సి వస్తుంది.