T BJP: తెలంగాణలో అధికారం చేపట్టాలని భావిస్తున్న రాష‌్ర బీజేపీ నేతల ఆశలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నీళ్లుచల్లారు. రాష్ట్రంలో అధికారం చేపట్టడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కే అవకాశం లేదన్నారు. “రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మేం బలంగా మారుతాం. ప్రధాన ప్రతిపక్ష స్థాయికి ఎదుగుతాం. అన్నీ అనుకూలిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు సాధిస్తాం” అని వ్యాఖ్యానించారు.
దీని ద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని, ప్రతిపక్ష హోదాకే పరిమితమవుతామని చెప్పినట్లైంది. పెద్దగా ఇతర రాష్ట్రాల రాజకీయాలపై దృష్టిసారించని గడ్కరీ తెలంగాణపై ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలంగాణకు సంబంధించి బీజేపీ అధిష్టానానికి ఈ విషయంలో ఒక స్పష్టత ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గడ్కరీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంటే గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు మోదీ, అమిత్ షా తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవాలని కృషి చేస్తున్నారు. ఈ నెల నుంచి బీజేపీ పెద్దల ఆధ్వర్యంలో భారీ సభలకు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో గడ్కరీ వ్యాఖ్యలు పార్టీని దెబ్బతీస్తాయని, నేతల్లో ఆత్మస్థైర్యం తగ్గిపోతుందని బీజేపీ తెలంగాణ నేతలు బాధపడుతున్నారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, గడ్కరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని వ్యాఖ్యానిస్తున్నారు. గతంతో పోలిస్తే తెలంగాణలో బీజేపీ ఇమేజ్ భారీగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా బండి సంజయ్‌పై పార్టీకి చెందిన చాలా మంది సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి వంటి నేతలు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ధర్మపురి అరవింద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎప్పుడూ మీడియాలో కనిపించే రఘునందన్ రావు కూడా సైలెంట్ అయ్యారు. తాజాగా ఆయన కూడా తన నిరసన గళం వినిపించారు. అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి నష్టం కలుగుతుండగా, గడ్కరీ వ్యాఖ్యలు మరింత నష్టం కలిగించేలా ఉన్నాయి.