Uttam Kumar Reddy: కాంగ్రెస్‌లో వివాదాలు ఆగవా..? ఉత్తమ్‌పై కుట్ర చేస్తోందెవరు..? మరోసారి పార్టీలో కల్లోలం

కొంతకాలంగా ఉత్తమ్ కమార్ రెడ్డి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం ఇటీవల ఊపందుకున్న సంగతి తెలిసిందే. దీని వెనుక తన పార్టీకే చెందిన ముఖ్య నాయకుడు ఒకరు ఉన్నారని, ఆయనే తనపై కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 03:55 PM IST

Uttam Kumar Reddy: కాంగ్రెస్ పార్టీ అంటేనే వివాదాలు అన్నట్లు ఉండేది నిన్నామొన్నటి వరకు. కానీ, ఇటీవలి కాలంలో పరిస్తితిలో మార్పు వచ్చినట్లు కనిపించినా అదంతా తాత్కాలికమే అని మరోసారి రుజువైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కొంతకాలంగా ఉత్తమ్ కమార్ రెడ్డి, ఆయన సతీమణి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం ఇటీవల ఊపందుకున్న సంగతి తెలిసిందే.

దీని వెనుక తన పార్టీకే చెందిన ముఖ్య నాయకుడు ఒకరు ఉన్నారని, ఆయనే తనపై కుట్ర చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తన ప్రతిష్ట దిగజార్చేందుకే ఇలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ అంశంపై ఉత్తమ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని, పార్టీ కీలక నేత గురించి ప్రస్తావిస్తూ ఈ ప్రకటన ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ ప్రకటన చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చాలా కాలంగా రేవంత్ రెడ్డికి, పార్టీలోని సీనియర్ నేతలకు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. కొత్తగా వచ్చిన రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడంపై చాలా మంది నుంచి అసంతృప్తి, విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర రాజనర్సింహా, జగ్గారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క వంటి నేతలు రేవంత్‌పై బహిరంగంగానే విమర్శలు చేశారు.

వీరిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా రేవంత్‌ను విమర్శించి, పార్టీనుంచి బయటకు వెళ్లారు. బీజేపీలో చేరారు. రేవంత్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఆయనపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కానీ, రేవంత్ తన వ్యూహాలతో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కోవడంతో అధిష్టానం ఆయనపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. రేవంత్‌కు స్వేచ్ఛ ఇచ్చింది. అంతేకాదు.. అప్పట్లో కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న మాణికం ఠాకూర్ కూడా రేవంత్‌కే మద్దతుగా ఉండేవాళ్లు. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు కాస్త నెమ్మదించారు. అయినప్పటికీ రేవంత్ విషయంలో ఇప్పటికీ చాలా మంది నేతల్లో అసంతృప్తి ఉంది. తాజాగా ఉత్తమ్ గురించి ప్రచారం జరగడం వెనుక ఆయనకు కాంగ్రెస్‌లో సన్నిహితుడిగా ఉన్న అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారడమే కారణమని తెలుస్తోంది. ఇటీవలి కాలం వరకు అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు.

కానీ, ఈ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి సీనియర్ కావడంతో ఆయన మాట కాదనలేని పరిస్థితి. దీంతో ఇక్కడ బీసీకే టిక్కెట్ వచ్చే అవకాశం ఉండటంతో అనిల్ కాంగ్రెస్‌ను వీడి, బీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆయనకు సన్నిహితుడైన ఉత్తమ్ కూడా బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. ఏదేమైనా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేతల మధ్య ఉన్న అంతర్గత విబేధాలు కాంగ్రెస్‌కు నష‌్టం కలిగిస్తున్నాయి.