Utter Pradesh: యూపీలో గెలిస్తే దేశాన్ని గెలిచినట్టేనా..2024 పార్లమెంట్‌ఎన్నికలకు బీజేపీ వ్యూహం ఇదేనా ?

లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరో ఏడాదిలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. 2014, 2019 విజయభేరిని కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయంపై భారతీయ జనతా పార్టీ కన్నేసింది. మరోసారి విజయంతో మూడోసారి దేశ ప్రధానిగా కొనసాగాలని మోదీ భావిస్తున్నారు. ఆయనకున్న వ్యక్తి గత చరిష్మా, బీజేపీ అమలు చేసే పోల్ స్ట్రాటజీతో విజయం తమ పార్టీనే వరిస్తుందని కమలనాథులు గంపెడు ఆశలతో ఉన్నారు.

బీజేపీ విధానాలపై ఎంత వ్యతిరేకత ఉన్నా బలంగా ఢీకొట్టే ప్రతిపక్షం లేకపోవడంతో 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీకి గ్రాండ్ విక్టరీ తప్పదని పోల్ పండితులు కూడా భావించారు. అయితే కర్ణాటక ఎన్నికల ఒక్కసారిగా ఇండియన్ పొలిటికల్ పిక్చర్‌ను మార్చేశాయి. కాంగ్రెస్ ముక్త భారత్ సక్సెస్ చేశామని సంబరపడిపోతున్న బీజేపీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా పుంజుకోవడమే కాదు.. కర్ణాటకలో ఏ పార్టీ మద్దతు లేకుండానే హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో బీజేపీని వ్యతిరేకించే అన్ని ప్రతిపక్ష పార్టీలకు కొత్త ఊపు వచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు చేతులుకలుపుతున్నాయి.

నితీశ్ కుమార్ స్వయంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కర్ణాటక తరహా ఫలితాలు దేశవ్యాప్తంగా వస్తే అది పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్‌కు గండి కొడుతుంది. అందుకే కాంగ్రెస్ సహా విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మరోసారి విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ను యూపీ నుంచి ప్రారంభించింది.

బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఎందుకు కీలకం ?
దేశంలో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మాత్రమే. యూపీలో ఉన్న 80 లోక్‌సభ నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు మెరుగుపడతాయి. అందుకే అన్ని పార్టీలు యూపీని సవాల్‌గా తీసుకుంటాయి. ఉత్తరభారతంలో ముఖ్యంగా హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పట్టే ఉంది. ఉత్తరప్రదేశ్ కూడా అందులో ఒకటి. ఇప్పటికే 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వంపై వ్యతిరేక ఓట్ల రూపంలో కనిపించకుండా ఉండాలంటే తమకు పట్టున్న రాష్ట్రాల్లో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కచ్చితంగా గెలిచి తీరాలి. యూపీలో యోగీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వమే ఉండటంతో ఆ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కమలనాథులు

ప్రతి నియోజకవర్గంలో మూడు నెలలకొక సర్వే
ఉత్తరప్రదేశ్‌లో మెజార్టీ లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకెళుతుంది. లోక్‌సభ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో బలపడేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. దీని కోసం ప్రతి ఎంపీ స్థానంలో ప్రతి మూడు నెలలకొకసారి పూర్తిస్థాయిలో సర్వే చేయిస్తోంది. యూపీ రాష్ట్ర బీజేపీతో పాటు ఆ పార్టీ అగ్రనాయకత్వానికి కూడా ఈ మూడునెలల రిపోర్టు చేరుతుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి పోలింగ్ జరిగే వరకూ ఇలా ప్రతి మూడు నెలలకు సర్వే చేయిస్తూనే ఉండాలని బీజేపీ నిర్ణయించింది.

సర్వే ద్వారా బీజేపీ ఏం తెలుసుకుంటోంది ?
ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో సర్వే చేయించడం ద్వారా ప్రధానంగా మూడు విషయాల్లో ఓటరు అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ హైకమాండ్. గ్రౌండ్ లెవల్‌లో బీజేపీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ? పార్టీ పరిస్థితి ఎలా ఉంది ? ఆయా లోక్‌సభ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తన్న స్థానిక , రాజకీయ అంశాలు ఏంటి ? ఇతర పార్టీల ప్రభావం ఏస్థాయిలో ఉంది..వాటిని ఎదుర్కోవడం ఎలా..? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుకునే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు. యూపీతో పాటు కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉంది ? బీజేపీ ఎంపీల పనితీరు ఎలా ఉంది వంటి ప్రశ్నలకు కూడా సమాధానాలు రాబడుతున్నారు. స్థానికంగా ఉన్న ఏ నేతకు టిక్కెట్ ఇస్తే పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని సర్వేల ద్వారా అంచనా వేస్తున్నారు.

మిషన్ పర్‌ఫెక్ట్ 80
ఈ ఏడాది జనవరిలో యూపీలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని ఎలా గెలిపించాలన్న దానిపై సుధీర్ఘంగా చర్చించారు. 80కి 80 సీట్లలోనూ బేజేపీ జెండా ఎగరాల్సిందేనని కేంద్ర నాయకత్వం రాష్ట్ర పార్టీకి స్పష్టం చేసింది. మిషన్ పర్‌ఫెక్ట్ 80 పేరుతో టార్గెట్ కూడా విధించారు. 2019 లోక్‌సభఎన్నికల్లో బీజేపీ 62 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతకంటే ఎక్కువ స్థాయిలో కష్టపడి… యూపీ లోక్‌సభ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది బీజేపీ హైకమాండ్.

సర్వేలు వర్సెస్ సర్వేలు
యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో పాగావేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కేవలం కొన్ని సర్వేలపై మాత్రమే ఆధారపడం లేదు. ప్రతి మూడు నెలలకొకసారి సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చిన బీజేపీ నేతలు.. లోక్‌సభ ఎన్నికలకు కచ్చితంగా రెండు నెలల ముందు మెగా సర్వే నిర్వహించబోతున్నారు. పార్టీ కార్యకర్తల ద్వారా ఈ సర్వే నిర్వహించి క్వార్టర్లీ నిర్వహించిన సర్వేలతో పోల్చుకోనున్నారు. దాని ప్రకారం టిక్కెట్ల కేటాయింపు చేయాలని పార్టీ భావిస్తోంది. యూపీలో బీజేపీ టార్గెట్ 80ని సాధిస్తే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అయితే కాంగ్రెస్ పుంజుకుంటున్న సమయంలో.. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తున్న సమయంలో ఇది సాధ్యమవుతుందా లేదా అన్నది చూడాలి.