Vallabhaneni Vamsi: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో టిక్కెట్ల కోసం నేతల మధ్య లుకలుకలు బయటపడుతున్నాయి. నిన్నటి వరకు కోనసీమ జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి వేణు మధ్య వివాదం తలెత్తగా.. ఇప్పుడు కృష్ణా జిల్లా గన్నవరంలో టిక్కెట్ల పంచాయితీ మొదలైంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి వల్లభనేని వంశీ మోహన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వంశీ 2019లో టీడీపీ నుంచి గెలిచినప్పటికీ, ఆ పార్టీకి దూరంగా ఉంటూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
అయితే, ఇప్పటివరకు గన్నవరం వైసీపీ ఇంఛార్జిగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. వంశీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల్లో యార్లగడ్డ వైసీపీ తరఫున గన్నవరం నుంచి పోటీ చేసి వంశీ చేతిలోనే ఓడిపోయారు. అలాంటిది ఎన్నికల తర్వాత వంశీ.. వైసీపీలోకి రావడంపై యార్లగడ్డ ఆగ్రహంగా ఉన్నారు. దీంతో వైసీపీలో ఇటు వంశీ వర్గం, అటు యార్లగడ్డ వర్గం.. రెండూ వేర్వేరుగా పని చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ వస్తున్నప్పటికీ.. రాబోయేది ఎన్నికల సమయం కావడంతో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన తరుణం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో తనకే వైసీపీ టిక్కెట్ ఇస్తుందని యార్లగడ్డ చెప్పుకొంటున్నారు. మరోవైపు వంశీ కూడా వైసీపీ టిక్కెట్ తనకే దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పుడు ఇద్దరు నేతలు ఎవరికి వారు వైసీపీ టిక్కెట్ తమకే వస్తుందని చెప్పుకొంటుండటంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. గన్నవరం నుంచి మళ్లీ పోటీ చేసే అంశంపై యార్లగడ్డ పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గానికి చెందిన వైసీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావుతో యార్లగడ్డ ఇటీవలే సమావేశమయ్యారు. ఆయన కూడా వంశీని వ్యతిరేకిస్తారు. యార్లగడ్డ, దుట్టా భేటీ అవ్వడం గన్నవరంలో రాజకీయ వేడి రగిల్చింది. తాను అమెరికా వెళ్లిపోతాని వంశీ దుష్ప్రచారం చేయిస్తున్నారని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేశారు. గన్నవరం వదిలి వెళ్లిపోనని, ఇక్కడి నుంచే పోటీ చేస్తానని పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ పెద్దలు మాత్రం వంశీకి టిక్కెట్ ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
టీడీపీని ఇరుకునపెట్టాలంటే వంశీ వైసీపీలో ఉండాలని, వంశీని గెలిపించుకోవాలనే పట్టుదలతో వైసీపీ ఉంది. ఒకవేళ వంశీకే వైసీపీ టిక్కెట్ ఇస్తే.. యార్లగడ్డ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే టీడీపీ లేదా జనసేన నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత వచ్చేఅవకాశం ఉంది.