Vijaya Shanthi: బీజేపీకి రాములమ్మ గుడ్‌బై.. అదే బాటలో జిట్టా.. కాంగ్రెస్‌లో చేరబోతున్నారా..?

విజయశాంతి బీజేపీని వీడాలని దాదాపు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే బీజేపీపై వరుసగా విమర్శలు చేస్తోంది. వచ్చే నెలలోనే ఆమె బీజేపీని వీడి, కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేతలతో రాములమ్మ చర్చలు జరుపుతోంది.

  • Written By:
  • Publish Date - July 26, 2023 / 09:49 AM IST

Vijaya Shanthi: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చినప్పటికీ పార్టీలో ఇంకా ముసలం కొనసాగుతూనే ఉన్నట్లు కనిపిస్తోంది. చాలా మంది ఇంకా పార్టీ తీరుపై అసంతృప్తితోనే ఉన్నారు. వారిలో బీజేపీ సీనియర్ లీడర్, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి కూడా ఉన్నారు. విజయశాంతి గతంలో బండి సంజయ్ సహా అధినాయకత్వం తీరుపై అసంతృప్తితోనే ఉన్నారు. బండిని తొలగించినప్పటికీ ఆమెలో వైఖరిలో మార్పు రాలేదని ఇటీవలి ఘటనతో తేలిపోయింది.

కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే సమయంలో ఈ కార్యక్రమానికి ఏపీకి చెందిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. తెలంగాణను వ్యతిరేకించిన ఆయనను కార్యక్రమానికి పిలవడాన్ని నిరసిస్తూ ఆమె అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి రావడాన్ని అంత తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అంశం కాదని చాలా మంది పార్టీ నేతల అభిప్రాయం. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉన్నారు. అలాంటిది ఈ అంశంపై విమర్శలు చేయడం ద్వారా బీజేపీపై విజయశాంతి ఇంకా అలకతోనే ఉన్నట్లు అర్థమవుతోంది. పార్టీలో కూడా తనకు పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. ఆమె తర్వాత పార్టీలో చేరిన డీకే అరుణకు పదవొచ్చింది. ఆమెను మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో విజయశాంతి బీజేపీని వీడాలని దాదాపు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకోసమే బీజేపీపై వరుసగా విమర్శలు చేస్తోంది.

వచ్చే నెలలోనే ఆమె బీజేపీని వీడి, కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ అగ్ర నేతలతో రాములమ్మ చర్చలు జరుపుతోంది. అన్నీ అనుకూలిస్తే ఆమె కమలాన్ని వదిలిపెట్టి, కాంగ్రెస్ చేయి పట్టుకోవడం ఖాయం. బీజేపీలో అసంతృప్తితో ఉన్న మరో నేత జిట్టా బాలక్రిష్ణా రెడ్డి. ఇటీవలి కాలంలో జిట్టా బీజేపీ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మంగళవారం కూడా భువనగిరిలో బీజేపీని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్.. రెండూ ఒకటేనన్నారు. బీజేపీకి తాను మానసికంగా ఎప్పటినుంచో దూరంగా ఉంటున్నట్లు, ప్రస్తుతం సాధారణ కార్యకర్తగానే ఉంటున్నట్లు చెప్పారు. బీజేపీ తెలంగాణ కలల్ని సాకారం చేస్తుందనే ఉద్దేశంతోనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పారు. అయితే, బీజేపీ ఈ విషయంలో మోసం చేసిందని విమర్శించారు. 16 నెలలుగా పార్టీలో ఉంటున్నా తనకు ప్రాధాన్యం దక్కడం లేదని, బీజేపీ ఆశిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కారు తెలంగాణలో సాధ్యం కాదన్నారు. కేసీఆర్‌‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కే ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి త్వరలోనే జిట్టా కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పి, కాంగ్రెస్‌లో చేరడం ఖాయం అనిపిస్తోంది.