Vijayashanthi: తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ లేనంత హాట్‌గా కనిపిస్తున్నాయ్. బలం పెంచుకునేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఐతే కర్ణాటక ఫలితాల తర్వాత సీన్ మొత్తం తేడా కొట్టింది. బీజేపీలోకి ఎవరూ రాకపోగా.. ఉన్న వాళ్లు కమలానికి హ్యాండ్ ఇచ్చి హస్తం పార్టీ వైపు చూస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి పేర్లు వినిపిస్తోంది ఆ కోవాలోనే ! పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల ప్రయత్నించగా అది ఫలించలేదు. పైగా ఆ ఇద్దరు ఈటలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిణామాల మధ్య టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. బీజేపీ నేతలకు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. వెళ్లిన వాళ్లు రావొచ్చు.. వాళ్లతో కొత్త వాళ్లు రావొచ్చు.. గాంధీభవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. దీనికి తగినట్లు బీజేపీ నేతలకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానాలు కూడా అందుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఆ లిస్టులో విజయశాంతి పేరు కూడా వినిపిస్తోంది.
కొద్దిరోజులుగా పార్టీలో వ్యవహారాలపై విజయశాంతి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఆమెకు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. కీలకమైన సభలు, సమావేశాలకు ఆహ్వానం అందలేదనే అసంతృప్తితో రాములమ్మ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం కొద్దిరోజులుగా జోరుగా వినిపిస్తోంది. ఐతే దీనిపై రాములమ్మ కూడా రియాక్ట్ అయ్యారు. పార్టీ మార్పుపై ఇచ్చీ ఇవ్వనట్లు ఆన్సర్ ఇచ్చారు రాములమ్మ.
తాను పార్టీ మారుతున్నానని, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోందని.. తాను పార్టీ మారుతున్నానో లేదో ఆ ప్రచారం చేసే వారికి తెలియాలని.. తాను మాత్రం మహాశివుని కాశీ మహా పుణ్యక్షేత్రంలో ఉన్నానంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఐతే పార్టీ మారుతున్నానన్న వార్తలపై విజయశాంతి నుంచి సరైన రియాక్షన్ రాలేదు. అవును అనలేదు… అలా అని కాదు అనలేదు. దీంతో ఆమె పార్టీ మారతారనే ప్రచారంలో కచ్చితంగా నిజం ఉండి తీరుతుందని కొత్త చర్చ మొదలైంది. అటు కాంగ్రెస్ నుంచి కూడా రాములమ్మకు ఆహ్వానాలు అందుతున్నట్లు తెలుస్తోంది. తిరిగి తమ పార్టీలో చేరితే.. తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆహ్వానాలు పంపిస్తున్నారట. విజయశాంతి ఇప్పటికే చాలాసార్లు పార్టీలు మారారు. బిజెపిలోకి మూడుసార్లు, కాంగ్రెస్ లోకి రెండుసార్లు వెళ్లారు.మరోసారి ఆమె కాంగ్రెస్ లో చేరినా, ఆశ్చర్యపోనవసరం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.