Vijayashanthi: బీజేపీకి రాములమ్మ దూరం.. సొంత పార్టీ నేతలపై ఫైర్ అయిన విజయశాంతి..

కొంతకాలంగా బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలోని చాలా మంది నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. వారిలో విజయశాంతి ఒకరు. ఇటీవల జరిగిన వివిధ పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. పదవుల్లో కూడా విజయశాంతి పేరు పరిగణనలోకి తీసుకోలేదు.

  • Written By:
  • Publish Date - September 21, 2023 / 04:50 PM IST

Vijayashanthi: తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ముద్రపడిన విజయశాంతి త్వరలో బీజేపీకి గుడ్‌ బై చెప్పబోతున్నారంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా రాములమ్మ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారం వెనుక కొంతమంది బీజేపీ నేతలే ఉన్నారని, వాళ్లు పనిగట్టుకుని, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. “చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు.

పార్టీకి ఏది ముఖ్యమో.. ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16న జరిగిన ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియచేయశా. ఆ విషయాలు బయటకు లీకేజ్‌ల పేరుతో ఇయ్యడానికి నేను వ్యతిరేకిని. ఇదంతా తెలిసి కూడా కొంతమంది మా పార్టీలోని నేతలు పనిగట్టుకుని బీజేపీకి రాములమ్మ దూరం అంటూ నాపై సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రచారం తప్పక ఖండించదగ్గది” అని విజయశాంతి తన ఎక్స్ అకౌంట్ ద్వారా తెలిపారు. కొంతకాలంగా బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీలోని చాలా మంది నేతలు తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అసంతృప్తితో ఉన్నారు. వారిలో విజయశాంతి ఒకరు. ఇటీవల జరిగిన వివిధ పార్టీ కార్యక్రమాల్లో ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. పదవుల్లో కూడా విజయశాంతి పేరు పరిగణనలోకి తీసుకోలేదు.

ఆమె కంటే తర్వాత పార్టీలో చేరిన డీకే అరుణ లాంటి వారికి పదవులొచ్చాయి. కానీ, విజయశాంతి విషయంలో పార్టీ నాయకత్వం మొండిచేయి చూపింది. సినీ నటిగా ఆమెకు ఉన్న ఇమేజ్‌ను కూడా బీజేపీ వాడుకోవడం లేదు. ఈ కారణంగానే బండి సంజయ్, కిషన్ రెడ్డి సహా నేతలతో ఆమెకు విబేధాలున్నాయి. పైగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారుతారు అంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరుతారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని విజయశాంతి ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నా.. ఈ ప్రచారం ఆగడం లేదు. దీని వెనుక కూడా కొందరు బీజేపీ నేతలే ఉన్నారని ఆమె వాదిస్తోంది. తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న సొంత పార్టీ నేతలపైనే ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.