విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 838 ఓట్లు ఉన్నాయి. వైసీపీకి 598 ఓట్లు ఉన్నాయి. టిడిపి కూటమికి 240 ఓట్లు ఉన్నాయి. నిజాయితీగా ఎన్నిక జరిగితే వైసిపి పక్కాగా ఎమ్మెల్సీ గెలుస్తుంది. అందుకే ఆ ధైర్యంతోనే జగన్ బొత్స సత్యనారాయణ ను అభ్యర్థిగా నిలబెట్టారు. తన రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం, తమ పార్టీ మొన్నటి ఓటమితో కుంగిపోలేదని స్పష్టంగా తెలియజేయడం కోసం ఆరు నూరైనా ఈ ఎమ్మెల్సీ గెలిచి తీరాల్సిందేనని జగన్ సత్తిబాబుకు పెద్ద బాధ్యత అప్పగించారు.
కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీ ఏ మధ్యంతర ఎన్నికల్లో అయినా గెలవడం అనేది రివాజ్ మారిపోయింది. అవసరమైతే డబ్బు పడేయడం, లీడర్లను కొనేయడం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణంగా జరిగేది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ని కొట్టాల్సిందే అని మొదట అనుకున్నారు. కానీ ఆయనకు తెలియకుండానే తెర వెనక చాలా జరిగి పోయాయి. ముందు జాగ్రత్తగా జగన్ తన ఓటర్లను అందర్నీ బెంగళూరు తరలించారు. అలాగే మరికొందరిని శ్రీలంక పంపించేశారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన క్యాంపు లను ఏర్పాటు చేశారు. తాను స్వయంగా ప్రతి ఓటర్ను అడ్రస్ చేశారు.
మరోవైపు టిడిపి లీడర్లు అభ్యర్థులను సిద్ధం చేశారు. సీఎం రమేష్, గంటా శ్రీనివాసరావు ఈ బాధ్యత భుజాల కు ఎత్తుకున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బైరా దిలీప్ ను సిద్ధం చేసి, ఆర్థిక వనరులను అన్నిటిని సమీకరించారు. ఒక ఓటర్ కు కనీసం పది లక్షల రూపాయలు ఇచ్చిన కూడా మొత్తం 40 నుంచి 50 కోట్లు ఖర్చు అవుతుంది. ఎమ్మెల్సీ దక్కించుకోవడానికి ఇంత ఖర్చు చేయాల్సి రావడం పెద్ద తెగింపే. కానీ ఇరు పార్టీలు పోటీకి సిద్ధం అయిపోయాయి. వైసిపి అధినేత జగన్ తన నేతలు అందరికీ చెప్పాల్సిన జాగ్రత్తలు అని చెప్పి ఆర్థికంగా కూడా వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పారు. విజయవాడ వచ్చిన వాళ్లను, తలా నాలుగు జతలు బట్టలు కొనిచ్చి నేరుగా బెంగళూరు తరలించారు. కానీ జగన్ అంచనాలను తలకిందులు చేస్తూ టిడిపి అధినేత చంద్రబాబు పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు.
ఈ కీలక నిర్ణయం వెనక బొత్స సత్యనారాయణ వేసిన పకడ్బందీ వ్యూహం ఉంది. బొత్స చిరంజీవికి బాగా సన్నిహితులు. ఇద్దరూ కాపు సామాజిక వర్గం వాళ్లే కావడంతో ఇద్దరి మధ్య బలమైన బంధం కూడా ఉంది. ఇద్దరూ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు సన్నిహితంగా కూడా ఉండేవారు. అదే సాన్నిహిత్యంతో బొత్స చిరంజీవిని కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి విరమించుకోవాలని పవన్ కళ్యాణ్ కు నచ్చజెప్పేలా చిరంజీవిని ఒప్పించారు. నిజానికి 200 మంది ఓటర్లను కొంటే ఎమ్మెల్సీ సీటు గెలవచేమో గాని… చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఇద్దరికీ నైతికంగా చెడ్డ పేరు వస్తుందని ఆయన కి వివరించారు .
జనం కూటమికి 164 సీట్ల సూపర్ మాండేటు ఇచ్చిన తర్వాత ఈ ఒక్క ఎమ్మెల్సీ కోసం కక్కుర్తి పడితే, పవన్ కళ్యాణ్ పరువే పోతుందని…. ఇమేజ్ దెబ్బతింటుందని చిరంజీవికి వివరించారట. ఇదే కాదు జగన్ ఎమ్మెల్సీ సీట్లో ఓడిపోతే కనుక… చంద్రబాబును రాజకీయంగా అల్లాడిస్తారని, వీధి వీధిలో చంద్రబాబు చేసిన దారుణాన్ని వివరిస్తారని, పదేళ్ల నాటి ఓటుకు నోటు కేసు గురించి కూడా మళ్లీ మళ్లీ గుర్తు చేస్తారని….. ఓటర్లను కొనడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని బొత్స చిరంజీవికి వివరించారట. ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో పవన్ కళ్యాణ్ కు నచ్చ చెప్పాలని కూడా కోరారట. చిరంజీవి పవన్ కళ్యాణ్ కు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తే గౌరవంగా ఉంటుందని….. తమది కానీ ఎమ్మెల్సీ సీటు కోసం ఎందుకు డబ్బులతో రాజకీయం చేసి అభాసుపాలు అవ్వాలని చిరంజీవి చెప్పారట. చిరు చెప్పిన దానికి అంగీకరించిన పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో కూర్చుని ఇదే విషయాన్ని ఆయనకి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సీటు కోసం 200 మంది ఓటర్లను కోట్లు పోసి కొనడం వల్ల ఏం ఉపయోగం ?అని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు చెప్పారంట.
మొదట అభ్యర్థిని పెట్టాలి అనుకున్న చంద్రబాబు ఆలోచనలో పడ్డారు.164 సీట్ల చారిత్రాత్మక గెలుపు తర్వాత ఒక కక్కుర్తి పని చేసి ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా ? ఆ ఒక్క ఎమ్మెల్సీ… అది కూడా కూడేళ్ల పాటు ఉండే ఎమ్మెల్సీ కోసం ఎందుకు దిగజారాలి అనే చర్చ కూడా వచ్చింది. అంతేకాదు నైతికంగా మనది కాని సీటు కోసం పోటీపడి , వైసిపి చెలరేగిపోవడానికి కూడా తామే అవకాశం ఇచ్చినట్లు అవుతుందని గ్రహించారు. పవన్ కళ్యాణ్ మాటను మన్నించి పోటీ కి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించేశారు చంద్రబాబు. తద్వారా ఒక పెద్ద రాజకీయ ఘర్షణకు అవకాశం లేకుండా చేశారు. చంద్రబాబు ముందు చూపుతో వెనకడుగు వేసి తెలివిగా వ్యవహరించారు. అలాగే జగన్ మొదటి రోజు నుంచి తన ఓటర్లను కాపాడుకుంటూ, ప్రత్యర్థి కూటమిని ఎండగడుతూ గెలుపు తనదేనని విషయాన్ని అందరికీ స్పష్టంగా చెప్పగలిగారు.
మొత్తం మీద బొత్స సత్యనారాయణ రహస్య మధ్యవర్తిత్వం ఇలా పనిచేసింది. ఎటువంటి వివాదాలు విభేదాలు లేకుండా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి సత్తిబాబునే వరించింది. బొత్స లాంటి సీనియర్ నాయకులు పార్టీకి ఉంటే దానివల్ల ఎంత అడ్వాంటేజ్ అనేది జగన్ లాంటి వాళ్ల కి కూడా తెలిసి వచ్చింది. ఏపీ కౌన్సిల్లో ఎక్కువమంది బలం ఉండడంవల్ల బొత్స కు ప్రతిపక్ష నేత హోదా దక్కబోతోంది. బొత్స కి క్యాబినెట్ మంత్రికి ఇచ్చే అన్ని సౌకర్యాలు లభిస్తాయి. ఇది కదా అదృష్టం అంటే. ఓడిపోయిన రెండు నెలల్లో తిరిగి ఎమ్మెల్సీ కావడం, ప్రతిపక్ష నేత హోదా దక్కించుకోవడం గొప్ప విషయం. జగన్ కి దక్కని ప్రతిపక్ష నేత హోదా అనూహ్యంగా బొత్స కి దక్కబోతోంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో మౌనమునిగా తెర వెనకే మిగిలిపోయారు చిరంజీవి.