Steel Plant Politics: రాజకీయాల సుడిగుండంలో విశాఖ స్టీల్ ప్లాంట్!

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అయితే దీన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు, పలు ప్రజాసంఘాలు ఏడాదికి పైగా ఉద్యమిస్తున్నాయి. అయినా వాళ్ల గోడు పట్టించుకునేవారే లేరు.

  • Written By:
  • Publish Date - April 10, 2023 / 08:10 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అయితే దీన్ని ప్రైవేటీకరించొద్దంటూ కార్మికులు, పలు ప్రజాసంఘాలు ఏడాదికి పైగా ఉద్యమిస్తున్నాయి. అయినా వాళ్ల గోడు పట్టించుకునేవారే లేరు. ఏపీలో పార్టీలన్నీ కేంద్రంలోని బీజేపీ మోచేతి నీళ్లు తాగుతున్నాయి. దీంతో కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడేంత సాహసం ఎవరూ చేయరు. వాళ్లకంత ధైర్యం కూడా లేదు. అందుకే బీజేపీ రెచ్చిపోతోంది. తాము ఏదనుకుంటే అది అమలు చేసేస్తోంది.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ఫ్యాక్టరీని సాధించుకున్నారు తెలుగువాళ్లు. అయితే ఇది ఇప్పుడు కొందరు స్వార్థపరుల చేష్టలకు బలి కాబోతోంది. తమ ప్రజలకు, కార్మికులకు అన్యాయం జరుగుతోందన్నప్పుడు గొంతెత్తి ఉద్యమించాల్సిన పార్టీలు కిమ్మనకుండా తమ స్వప్రయోజనాలకోసం పాకులాడుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీదీ ఇదే తీరు. తనను తాను రక్షించుకునేందుకు జగన్ స్టీల్ ప్లాంట్ ఊసే ఎత్తట్లేదు. బీజేపీని ఎదిరిస్తే ఏం జరుగుతుందోనని చంద్రబాబు భయం. ఇక పవన్ కల్యాణ్ అడపాదడపా కార్మికుల పక్షాన నిలబడినా నిర్మాణాత్మకంగా ఫైట్ చేసిన సందర్భాలు లేవు. పైగా బీజేపీతో అంటకాగుతున్నారు. అరుపులు, కేకలు తప్ప బీజేపీని గట్టిగా నిలదీసే పరిస్థితి లేదు.

ఆంధ్రప్రదేశ్ పార్టీల చేతకానితనాన్ని గమనించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు సందట్లో సడేమియాలా దూసుకొస్తున్నారు. కేంద్రంలోని బీజేపీని ఇరుకున పెట్టేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తానని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను కైవసం చేసుకునేందుకు బిడ్ లో కూడా పార్టిసిపేట్ చేయాలని నిర్ణయించారు. దీని వల్ల కేసీఆర్ కూడా కొన్ని ప్రయోజనాలు ఆశిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే బీజేపీని ఎదుర్కొనే సత్తా తనకుందని నిరూపించుకోవచ్చు. అదే సమయంలో ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలా వీళ్లందరి మధ్యలో స్టీల్ ప్లాంట్ మాత్రం బలైపోతోంది.