Visakhapatnam: విశాఖ నుంచి పాలన.. ఈసారి సెప్టెంబర్‌కు వాయిదా? ఈసారైనా విశాఖ వస్తారా సారూ!

త్వరలోనే విశాఖ రాజధానిగా పాలన ప్రారంభిస్తాం అంటూ గతంలో చెప్పారు ఏపీ సీఎం జగన్. మొన్న ఉగాది నుంచే సీఎం జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత జూలై నుంచే పాలన మొదలు అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ మత్రం సెప్టెంబర్‌లో విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తాం అని చెప్పారు.

  • Written By:
  • Publish Date - April 19, 2023 / 04:25 PM IST

Visakhapatnam: ఇదిగో విశాఖకు వచ్చేస్తున్నాం.. అదిగో వైజాగ్ వెళ్లిపోతున్నాం.. రాజధానిని విశాఖకు తరలిస్తున్నాం.. అంటూ వైసీపీ నేతలు ఇప్పటికి చాలాసార్లు ప్రకటనలు గుప్పించారు. త్వరలోనే విశాఖ రాజధానిగా పాలన ప్రారంభిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. కానీ, ఇది ఇప్పటికి అనేక సార్లు వాయిదా పడింది. మొన్న ఉగాది నుంచే సీఎం జగన్ విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తారని చెప్పారు. తర్వాత జూలై నుంచే పాలన మొదలు అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ మత్రం సెప్టెంబర్‌లో విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తాం అని చెప్పారు. ఎంతకాలం ఇలా చెప్పుకొంటారు? ఒకపక్క రాజధాని అంశం కోర్టులో ఉంది. ఇలాంటి తరుణంలో అసలు ఎందుకిలా ప్రకటనలు చేస్తున్నారు. తెలిసే చేస్తున్నారా.. లేక తెలియకా? ఉత్తరాంధ్ర వాసులను మభ్య పెట్టేందుకే ఇలాంటి స్టేట్‌మెంట్‌లతో కాలం గడిపేస్తున్నారా? నిజంగా ఏపీకి రాజధాని అంటూ ఏర్పడుతుందా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?
వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏపీకి అమరావతిని రాజధానిగా సమర్ధించారు. టీడీపీ నిర్ణయానికి మద్దతు తెలిపారు. టీడీపీ ప్రతిపాదించినదాని కంటే మరింత గొప్పగా అమరావతిని అభివృద్ధి చేయాలని సూచించారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చారు. అమరావతి రాజధానిగా వద్దన్నారు. ఏపీకి మూడు రాజధానులు కావాలంటూ కొత్త పల్లవి అందుకున్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే మూడు రాజధానులు ఉండాల్సిందే అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, పాలన, శాసన వ్యవస్థ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇదే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. అంతే.. అప్పటి నుంచి ఏపీకి రాజధాని లేకుండా పోయింది. ప్రభుత్వ నిర్ణయం రాజకీయ రంగు పులుముకుంది. అమరావతి ప్రాంత ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. చివరికి ఇది కోర్టు వరకు చేరింది. ఇప్పుడు కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది.
మూడు రాజధానులు ఎటుపోయే..
మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఒకపక్క చెబుతూనే.. మరోపక్క విశాఖపట్నం నుంచే పాలన అందిస్తామని వైసీపీ ప్రకటించింది. మరైతే ముందే చెప్పినట్లు మూడు రాజధానుల అంశం ఏమైంది? నిజానికి ప్రభుత్వ నిర్ణయానికి ఎన్నో అడ్డంకులున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ బిల్లును రద్దు చేసింది. అలాగే మూడు రాజధానుల బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టింది. అయితే, ఈ నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో సీఆర్డీఏ బిల్లు, మూడు రాజధానుల బిల్లును సభ నుంచి ఉపసంహరించుకున్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ త్వరలోనే ఈ బిల్లుల్లో మార్పులు చేసి, మరింత సమగ్రంగా అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లుకన్నా.. కోర్టు ఇచ్చే తీర్పుపైనే మూడు రాజధానుల అంశం ఆధారపడి ఉంటుంది. అంతవరకు సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు.


కోర్టు పరిధిలో ఉన్నా..
ప్రస్తుతం మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది. కోర్టు మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు ఇస్తే వైసీపీ ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకెళ్లొచ్చు. లేదంటే మూడు రాజధానులపై చిక్కులు తప్పవు. మరోవైపు కేంద్రం కూడా వైసీపీ నిర్ణయాన్ని స్వాగతించడం లేదు. తాము అమరావతినే ఏపీకి ఏకైక రాజధాని అనే అంశానికి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం తేల్చి చెప్పింది. ఇప్పుడు మూడు రాజధానుల అంశానికి కేంద్రం మద్దతు లేకపోవడంతోపాటు, కోర్టు పరిధిలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగానే ముందుకెళ్లడం ఆశ్చర్యకరం. ప్రభుత్వం తమ నిర్ణయంలో భాగంగా విశాఖకు రాజధానిని తరలించేందుకు ప్రయత్నిస్తోంది. మరి కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తుందో తెలీదు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రానికి నష్టం చేస్తుందని గ్రహించరా?
ఉత్తరాంధ్రను మభ్యపెట్టేందుకా?
ఏపీకి విశాఖే రాజధాని అని గత ఏడాది సీఎం జగన్ ప్రకటించారు. అంతకుముందు మూడు రాజధానులు అని చెప్పి తర్వాత విశాఖే రాజధాని అని చెప్పారు. త్వరలోనే రాజధానిని విశాఖకు తరలిస్తామని, విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తామని చెప్పారు. అసలు కోర్టులో కేసు నడుస్తుంటే ఇలా ఎలా ప్రకటిస్తారు? కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మెప్పించేందుకేనా? ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్లు విశాఖ నుంచి ఇప్పటికీ పాలన ప్రారంభం కాలేదు. త్వరలోనే అని చెప్పి చాలా కాలం అవుతోంది. గతంలో ఈ ఏడాది ఉగాది నుంచి పాలన ప్రారంభిస్తామన్నారు. సీఎం జగన్ విశాఖకే షిఫ్ట్ అవ్వబోతున్నట్లు చెప్పారు. ఉగాది గడిచి నెల అవుతోంది. ఇప్పట్లో రాజధాని విశాఖ వచ్చే అవకాశం లేదు. అప్పట్లో జూలైలో విశాఖ‌ నుంచి పాలన ప్రారంభమవ్వబోతున్నట్లు ఏపీ మంత్రులు చెప్పారు.

తాజాగా సీఎం జగన్ మరో కొత్త డేట్ చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ నుంచి విశాఖలో పాలన ప్రారంభిస్తామన్నారు. ఇన్నిసార్లు ప్రభుత్వం మాట మార్చడమేంటి? నిజంగా విశాఖ వచ్చే ఉద్దేశం ఉందా.. లేదా? నిజంగా వచ్చే ఉద్దేశం ఉంటే సరైన ప్రణాళికతో, చెప్పిన టైమ్‌కే షిఫ్ట్ అవ్వొచ్చు కదా. కానీ, అలా చేయడం లేదు. ప్రతిసారీ ఇలా ఒక టైమ్ చెప్పి మాట తప్పడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు? కేవలం ఉత్తరాంధ్ర ప్రజల మెప్పుకోసమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ రాజధాని అయితే, ఉత్తరాంధ్ర ప్రజల జీవితాలు మారిపోతాయి అన్నట్లు ప్రభుత్వం చెప్పుకొస్తుంది. నిజంగా విశాఖ రాజధాని అయితే, ఈ ప్రాంతంలో ఎలాంటి మార్పు వస్తుందో తెలీదు కానీ.. ప్రభుత్వం మాత్రం ప్రజల్ని మభ్యపెడుతూనే ఉంది. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.


తత్వం బోధపడిందా?
వైసీపీ మూడు రాజధానుల విషయంలో అనేక పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నిర్ణయం వల్ల నాలుగేళ్లుగా ఏపీకి రాజధాని లేకుండా పోయింది. దీంతో ఏపీకి చాలా నష్టం జరిగింది. పరిశ్రమలు, మల్టీ నేషనల్ కంపెనీలు వంటివి ఏపీకి రావడానికి ఆసక్తి చూపలేదు. దీని వల్ల ఉద్యోగ, ఉపాధి కల్పన జరగలేదు. ఏపీకి రాజధాని ఏదీ అంటే ప్రభుత్వమే చెప్పుకోలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని మరింత జాప్యం చేస్తే, ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని సీఎం జగన్ గ్రహించినట్లుంది. అందుకే ఉన్నట్లుండి విశాఖ రాజధాని అని ఢిల్లీ వేదికగా ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా ఏపీ రాజధాని విషయంలో ఉన్న సందేహాలు తొలగిపోతాయని ఆయన భావించినట్లుంది. దీంతో ఏపీకి పరిశ్రమలు వస్తాయని ఆయన భావించారు. పైగా పారిశ్రామిక సదస్సు నేపథ్యంలో రాజధాని లేదనే అంశానికి ప్రాధాన్యం లభిస్తే అది ఏపీ ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేస్తుంది. అందుకే విశాఖను రాజధానిగా ప్రకటించేసినట్లు అనిపిస్తోంది. ఆ తర్వాత దీనికి కట్టుబడి ఉండేందుకు ఇదిగో వచ్చేస్తున్నాం.. అదిగో వచ్చేస్తున్నాం అని కాలం వెళ్లదీస్తున్నట్లు కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.