Vladimir Putin: పుతిన్‌కు ఎదురుదెబ్బ.. వాగ్నర్ సైన్యం తిరుగుబాటు.. రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు..?

పుతిన్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రైవేటు సైన్యమే వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ (వాగ్నర్ పీఎంసీ). రష్యాతోపాటు అనేక ఆఫ్రికా దేశాల్లోనూ ఈ సైన్యం పని చేస్తుంది. అధికారికంగా ఐదు వేల మందే పని చేస్తారని చెప్పినప్పటికీ దీనికి ఎన్నోరెట్ల సైన్యం పీఎంసీలో పని చేస్తున్నట్లు బ్రిటన్ అంచనా.

  • Written By:
  • Updated On - June 24, 2023 / 05:03 PM IST

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లూ పుతిన్‌కు అండగా ఉన్న వాగ్నర్ సైన్యం తిరుగుబాటు బావుటా ఎగరేసింది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తలెత్తిన పరిణామాలే దీనికి కారణం. ఇంతకీ వాగ్నర్ సైన్యం అంటే ఏంటి..? పుతిన్‌పై ఎందుకు తిరుగబాటు చేస్తోంది..?
పుతిన్ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్రైవేటు సైన్యమే వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ (వాగ్నర్ పీఎంసీ). రష్యాతోపాటు అనేక ఆఫ్రికా దేశాల్లోనూ ఈ సైన్యం పని చేస్తుంది. అధికారికంగా ఐదు వేల మందే పని చేస్తారని చెప్పినప్పటికీ దీనికి ఎన్నోరెట్ల సైన్యం పీఎంసీలో పని చేస్తున్నట్లు బ్రిటన్ అంచనా. వాగ్నర్ గ్రూప్‌నకు యెవ్‌గెనీ ప్రిగోజిన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ గ్రూప్ పని చేస్తుంది. ఇది రష్యా పారామిలిటరీ సంస్థ. అక్కడి చట్టాలకు అనుగుణంగానే పని చేస్తుంది. అయితే, ఇది ప్రైవేటు సైన్యం. పుతిన్‌కు రష్యా సైన్యం కన్నా.. ఈ సైన్యమే ప్రధాన అండ. పుతిన్ కోసమే ఈ సంస్థ పని చేస్తుంది. పుతిన్ ఏ పని అప్పగించినా పూర్తి చేస్తుంది. ఈ సైన్యం ఉందనే అండతోనే పుతిన్ రాజకీయంగా చెలరేగిపోతుంటాడు. అలాంటి సైన్యం ఇప్పుడు పుతిన్‌పై తిరుగుబాటు చేస్తోంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ కూడా విడుదలైంది. తమ పని ప్రారంభించినట్లు.. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుని పోతామంటూ ఆ ఆడియోలో ప్రిగోరిన్ హెచ్చరించాడు.
ఎందుకీ తిరుగుబాటు
గత ఏడాది ప్రారంభమైన యుక్రెయిన్ యుద్ధంలో రష్యాదే పైచేయి అనే సంగతి తెలిసిందే. అనేక చోట్ల యుక్రెయిన్‌పై రష్యా విజయం సాధిస్తూ వచ్చింది. దీనికి తమ సైన్యమే కారణమంటూ పీఎంసీ పలుమార్లు ప్రకటించింది. తాము లేకపోతే రష్యా సైన్యం విజయం సాధించేది కాదంటూ పీఎంసీ తరఫున ప్రిగోజిన్ చెప్పుకొంటూ వస్తున్నారు. ఇది రష్యా సైన్యానికి, పీఎంసీకి మధ్య విబేధాలకు దారి తీసింది. ఈ ఏడాది జనవరి నుంచి రష్యా సైన్యం, పీఎంసీ మధ్య గొడవ మొదలైంది. పీఎంసీ ప్రకటనను రష్యా సైన్యం ఖండించింది. తమకు పేరు రాకుండా పీఎంసీ కుట్ర పన్నుతోందని వ్యాఖ్యానించింది. దీంతోపాటు కలిసి పని చేసే విషయంలో రష్యా సైన్యం, పీఎంసీ మధ్య గొడవలు జరుగుతున్నాయి. పీఎంసీ తమకు ఆయుధాలు కూడా ఇవ్వడం లేదని రష్యా సైన్యం ఆరోపించింది. మరోవైపు రష్యా సైన్యాన్ని తిడుతూ పీఎంసీ సైనికులు వీడియోలు విడుదల చేశారు. రష్యా సైన్యం తమను అవమానిస్తోందని, తమ సేవల్ని వాడుకుంటూ, తమపైనే దాడులు చేస్తోందని పీఎంసీ ఆరోపించింది. యుద్ధం పేరుతో రష్యా సైన్యం.. తమ గ్రూపులోని చాలా మందిని చంపేసిందని ప్రిగోజిన్ ఆరోపించారు. రష్యా సైన్యానికి పుతిన్ అండగా ఉంటూ.. పీఎంసీకి ప్రిగోజిన్ నాయకత్వం వహిస్తున్నాడు. దీంతో ఈ అంశం ఇద్దరిమధ్యా గొడవలకు దారితీసింది. దీంతో తాము రష్యా సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నట్లు ప్రిగోరిన్ ప్రకటించారు.
రష్యాలో అంతర్యుద్దం
ఇన్నాళ్లూ పుతిన్‌కు నమ్మిన బంటులా ఉన్న ప్రిగోరిన్ ఇలా తిరుగుబాటు చేయడం సంచలనంగా మారింది. ఈ పరిణామం పుతిన్‌ను, రష్యాను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పీఎంసీకి, సైన్యానికి మధ్య జరుగుతున్న గొడవ రష్యాలో అంతర్యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రష్యా సైన్యం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా ప్రధాన ప్రాంతాల్లో భారీ సైన్యాన్ని మోహరించింది. రాజధాని మాస్కోతోపాటు ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యల్ని అధికారులు ప్రారంభించారు. ప్రజలు అసవరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని చెబుతున్నారు. అయితే, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించే ఉద్దేశం తమకు లేదని వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది. రష్యా సైనిక నాయకత్వాన్ని మార్చడం, అక్కడి అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ ముందుకు సాగుతోంది. అధ్యక్షుడి అధికారాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, పోలీసులు, రష్యా గార్డ్స్ విధులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ప్రిగోరిన్ చెప్పిన మాటలే దీనికి నిదర్శనంగా అనిపిస్తున్నాయి. వాగ్నర్ గ్రూప్.. నేరుగా పుతిన్‌పై తిరుగుబాటు చేయకపోయినప్పటికీ.. ఈ పరిణామాలు కచ్చితంగా పుతిన్‌ను ఇబ్బంది పెట్టేవే.
దేశద్రోహమే: పుతిన్
వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చర్యను రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా పరిగణించారు. ఇది దేశద్రోహ చర్యగా అభివర్ణించారు. తన దేశాన్ని కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. దేశ ప్రజల్ని కాపాడేందుకు ఏమైనా చేస్తామని హెచ్చరించారు. సొంతలాభం కోసమే ప్రిగోరిన్ తిరుగబాటు చేశారని, దీనికోసం ఆయుధాలు చేపట్టిన వారిపై చర్యలకు సిద్ధమని ప్రకటించారు. వాగ్నర్ గ్రూపు సైన్యానికి ఒక సూచన చేశారు. వాగ్నర్ గ్రూప్ మోసానికి గురైందని, సైనికులంతా ఒక నేరంలోకి నెట్టివేయబడ్డారని, సైనికులంతా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని, వారికి ఎలాంటి హాని చేయబోమని చెప్పారు. ప్రస్తుతం అనుసరించాల్సిన వ్యూహంపై పుతిన్.. అక్కడి అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో పుతిన్ ఏ చర్యలు తీసుకుంటారు..? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి వంటి అంశాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ప్రిగోజిన్‌కు స్టోమ్ జడ్ మద్దతు
వార్నర్ గ్రూపు సైన్యానికి స్టోమ్ జడ్ సంస్థ మద్దతు ప్రకటించింది. ప్రిగోజిన్ తిరుగుబాటు నేపథ్యంలో ఆయన వెంట కలుస్తామని చెప్పింది. రష్యన్ జైళ్ల నుంచి బలవంతంగా నిర్బంధించిన ఖైదీల సమూహమే స్టోమ్ జడ్. రష్యా రక్షణ శాఖ దీన్ని ఏర్పాటు చేసింది. పుతిన్ నియమించిన క్రిమియా గవర్నర్.. పుతిన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. లుహాన్స్క్, డోనెట్స్స్ నేతలు కూడా పుతిన్ వెంటే ఉంటామని చెప్పారు. ఇది పుతిన్‌కు ఊరటనిచ్చే విషయమే. రష్యాకు చెందిన ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థ ప్రిగోజిన్‌పై క్రిమినల్ కేసు పెట్టింది. అతడిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. వాగ్నర్ గ్రూప్ సైన్యం.. ప్రిగోజిన్ ఆదేశాల్ని పాటించవద్దని సూచించింది.
రష్యాకు కొత్త అధ్యక్షుడు..?
పుతిన్ తమపై తీసుకుంటున్న చర్యలను వాగ్నర్ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. పుతిన్ పెద్ద పొరపాటు చేశారని అభిప్రాయపడింది. రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు వస్తాడంటూ ఆ గ్రూప్ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము దేశ ద్రోహులం కాదని, దేశ భక్తులమని ఆ గ్రూప్ వాదిస్తోంది.