Chandrababu Naidu: చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదన్న టీడీపీ.. జైలు ఏమైనా అత్తారిల్లా అంటున్న వైసీపీ..!

చంద్రబాబు ఆరోగ్యం సరిగ్గా లేదని, జైలులో వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భువనేశ్వరి అన్నారు.

  • Written By:
  • Publish Date - October 13, 2023 / 08:37 PM IST

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు నాయుడు గురువారం అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అంతకుముందు కూడా ఆయన డీహైడ్రేషన్‌తో బాధపడ్డారు. తాజాగా చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం సరిగ్గా లేదని, జైలులో వసతులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆరోపించారు. తన భర్త ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరువు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భువనేశ్వరి అన్నారు. జైల్లో తన భర్తకు అత్యవసరంగా వైద్యాన్ని సకాలంలో అందించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైoదని విమర్శించారు.

మరోవైపు చంద్రబాబుకు జైలులో ముప్పు ఉందని ఆయన తనయుడు నారా లోకేష్ కూడా ఆరోపించారు. అటు నందమూరి బాలకృష‌్ణతోపాటు పలువురు టీడీపీ నేతలు చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుని అనారోగ్యం పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని బాలకృష్ణ ఆరోపించారు. ఈ అంశంపై అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ అంశంపై టీడీపీ నేతలకు వైసీపీ నేతలు ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు. చంద్రబాబు జైలులో బాగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యంపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు విషయంలో టీడీపీ చేస్తుందంతా తప్పుడు ప్రచారమే అని మండి పడ్డారు. జైలులో చంద్రబాబుకు ఏసీ వంటి సౌకర్యాలు కల్పించటానికి అదేమన్నా అత్తారిల్లా..? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. “జైల్లో ఉండే మిగతా ఖైదీలకు ఉక్కపోత ఉండదా..? ఆయన బరువు తగ్గిపోయారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన ఒక కేజీ బరువు పెరిగారు. ఆయన కోసం ప్రత్యేకించి డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉన్నారు. చంద్రబాబు ఇంటి నుంచి తెచ్చిన భోజనమే తింటున్నారు.

జైలు అధికారులు కూడా ఇంటి భోజనాన్ని పరిశీలించాకే అనుమతిస్తున్నారు. అర్జెంటుగా చంద్రబాబును బయటకు తీసుకొచ్చేందుకే ఇదంతా చేస్తున్నారు” అని సజ్జల వ్యాఖ్యానించారు. జైళ్ల శాఖ డీఐజీ కూడా చంద్రబాబు అంశంపై స్పందించారు. చంద్రబాబు జైలులో ఆరోగ్యంగానే ఉన్నారని వెల్లడించారు. ఆయనకు రోజూ మూడుసార్లు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఏదేమైనా.. చంద్రబాబుకు జైలులో ముప్పు ఉందని, ఆయన ఆరోగ్యం బాగా లేదని జరుగుతున్న ప్రచారం మాత్రం ఇరు పార్టీల మధ్య మాటలయుద్ధానికి తెరతీసింది.