రాజకీయాల్లో ఎదగాలంటే అదృష్టం ఉండాలి. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి కాలేదన్న బాధపడే వారు ఎంతోమంది ఉంటారు. అలాంటిది లక్ కలిసి వచ్చి.. ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయి మంత్రి అయిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో విడదల రజని ఒకరు. అతి తక్కువ కాలంలో రెండు పార్టీలు మార్చేసిన విడదల రజని.. చివరకు రెండు ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలను మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. చిలకలూరి పేట అసెంబ్లీ నుంచి గెలిచిన రజనిని.. ఈసారి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపింది వైసీపీ అధిష్టానం. ఆమె వ్యతిరేక గ్రూపు ఎక్కువగా ఉండటం, అసంతృప్తి పెరగడంతో ఆమెను నియోజకవర్గాన్ని మార్చాల్సి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ టీం సర్వేలలో విడుదల రజనికి ఈసారి చిలకలూరిపేట టిక్కెట్ ఇస్తే గెలుపు కష్టమని తేలింది. దీంతో జగన్ ఆమెను అక్కడి నుంచి మార్చాలని నిర్ణయించారు. నిజానికి తనకు వ్యతిరేకంగా గ్రూప్‌లు పెరగడానికి.. రజని వ్యవహారశైలే కారణం అనే కారణం ఉంది. సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్‌గా.. క్షేత్రస్థాయిలో రజని కనిపించరు అనే విమర్శ ఉంది. దీంతో ఆటోమెటిక్‌గా వ్యతిరేకత పెరిగింది. మొదటికే మోసం తెచ్చే పరిస్థితులు తీసుకువచ్చాయి. దీన్ని గ్రహించిన జగన్.. రజనిని చిలకలూరి పేట నుంచి గుంటూరు వెస్ట్‌కు పంపించారు. చిలకలూరిపేట నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జిగా రాజేష్ నాయుడుకు జగన్ అవకాశం ఇచ్చారు. అదే సమయంలో విడదల రజనికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కేటాయించారు. ఇక్కడ కూడా బీసీలు అధికంగా ఉండటంతో.. రజని గెలుపు ఈజీ అవుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తుంది. రజని కూడా కేడర్‌తో పాటు పార్టీ నేతలను కలుపుకుని పోతే భవిష్యత్ లో నియోజకవర్గాలు మార్చకుండా ఉండే పరిస్థితి ఉంటుందని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. లేదంటే ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గానికి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. విడదల రజనికి ఇది ఒక రాజకీయ హెచ్చరిక మాత్రమేననని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి.