New Secretariat: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయంలో వర్షపు నీరు కురుస్తోంది. ఆదివారం కురిసిన వర్షానికి సచివాలయం లోపల వర్షపు నీరు లీకైంది. దీంతో ఈ బిల్డింగు నాణ్యతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో అధునాతనంగా నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ వాటర్ లీకేజీకి ఏ సమాధానం చెబుతుందో చూడాలి. పైకి మెరుస్తూ.. అందంగా కనిపిస్తున్న సచివాలయం.. లోపల మాత్రం అంతా డొల్లేనా అంటున్నారు విమర్శకులు. వేసవి కాలం ఒకట్రెండు రోజులు కురిసిన వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే.. వర్షాకాలం భారీ వానలకు సచివాలయం ఏమవుతుందో అంటున్నారు ప్రతిపక్ష నేతలు. నిజంగా సచివాలయం పైన పటారం.. లోన లొటారమేనా?
తక్కువ కాలంలోనే సచివాలయాన్ని గొప్పగా నిర్మించామని చెప్పుకొంటుంది ప్రభుత్వం. దేశంలోనే ఇలాంటి నిర్మాణం లేదని, అత్యంత అధునాతనంగా, సుందరంగా నిర్మించామని ప్రచారం చేసుకుంది. పర్యావరణ హితంగా దీన్ని రూపొందించినట్లు, దీనికి గ్రీన్ బిల్డింగ్ ఇండియా సర్టిఫికెట్ కూడా లభించినట్లు చెప్పింది. దేశంలోనే తొలి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా నిలిచిందని వెల్లడించింది. ఇంత గొప్పగా చెప్పుకొంటున్న నూతన సచివాలయం బిల్డింగులోని డొల్లతనం తాజాగా బయటపడింది. బిల్డింగు లోపల అనేక చోట్ల వర్షపు నీరు లీకవుతోంది. ఈ విషయం మీడియాకు తెలియకుండా ఆంక్షలు విధించినప్పటికీ విషయం బయటకు రాకుండా దాచలేకపోయింది ప్రభుత్వం. చివరకు మీడియా సెంటర్‌లో వాటర్ లీక్ కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సచివాలయం ప్రారంభమైన రోజే వర్షపు నీరు లీక్ కావడంతో ఈ బిల్డింగ్ నాణ్యతపై సందేహాలు తలెత్తుతున్నాయి.
తొలి రోజే వర్షపు నీళ్లు లీక్!
ఆదివారం సచివాలయం ప్రారంభమైంది. అధికారులు, మంత్రులు తమ సీట్లలో ఆసీనులయ్యారు. ఘనంగా సంబరాలు జరుపుకొన్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలో వర్షం కురిసింది. అంతే.. ఆ వర్షానికి నీళ్లు కొత్త బిల్డింగ్ లోపలికి వచ్చాయి. సచివాలయం బిల్డింగులోని మీడియా సెంటర్‌లోనే వాటర్ లీక్ అయింది. శ్లాబ్ మీద నుంచి నీళ్లు హాల్‌లోకి చేరాయి. పిల్లర్ పగుళ్ళు, దానికి తోడు శ్లాబ్ నుంచి నీరు చెమ్మగా చేరడం మాత్రమే కాక చుక్కలు చుక్కలుగా కారి ఫ్లోర్ మీదకు చేరి, మొత్తం తడిగా మారింది. దీంతో మీడియా ప్రతినిధులకే ఈ పరిస్థితి ఎదురైంది. మీడియా ప్రతినిధులు అక్కడ ఉండలేనంతగా వర్షపు నీళ్లు చేరాయి. అయితే, అక్కడ మాత్రమే వర్షపు నీళ్లు లీకయ్యాయా.. లేక ఇతర బ్లాకుల్లో కూడా లీకవుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు సచివాలయం ప్రారంభమైన రోజునే ఒక పిల్లర్‌కు పగుళ్లు కనిపించాయి. అంతకుముందు మొదటి ఫ్లోర్‌లో కూడా ఇలాగే వాటర్ లీకైనట్లు తెలుస్తోంది.
నాసిరకం పనులే కారణమా?
కోట్లాది రూపాయలు వెచ్చించినప్పటికీ ఇన్ని లోపాలు కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సామాన్య ప్రజలు ఇళ్లు కట్టుకునేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్లకున్న పరిమిత నిధులతోనే ఇలాంటి లోపాలు లేకుండా నిర్మించుకుంటారు. మరి అలాంటిది.. అపరిమిత నిధులు ఉండి, ఆధునిక సాంకేతికతను వాడుకోగలిగి, అత్యున్నతస్థాయి ఇంజనీర్ల వ్యవస్థ ఉండి కూడా ప్రభుత్వం నాణ్యమైన నిర్మాణం ఎందుకు చేపట్టలేకపోయింది? ఇది ప్రభుత్వ చేతకాని తనం కాదా? నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కాదా? నాసిరకం పనులతో నిర్మాణ పనులు చేపడుతుంటే ప్రభుత్వం, దీని బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఏం చేస్తున్నట్లు? ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తారా? ఈ బిల్డింగుకు మరమ్మతులు చేపట్టాలంటే అదనపు ఖర్చు. ఈ భారం కూడా ప్రజల మీదే. నిర్మాణం త్వరగా పూర్తవ్వాలన్న తొందరలో కానిచ్చేశారు తప్ప.. బిల్డింగు నాణ్యతగా ఉండాలని ప్రభుత్వం భావించినట్లు లేదు. తక్కువ సమయంలోనే, అద్భుతంగా నిర్మించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఈ నాసిరకం పనులకు ఏం సమాధానం చెబుతుంది? నిర్మాణ సంస్థ దీనికి బాధ్యత వహిస్తుందా? ప్రతిపక్షాల ఆరోపణలకు ఏం బదులిస్తుంది? ఏదేమైనా.. పైకి గొప్పగా కనిపిస్తున్న సచివాలయం లోపలి నిర్మాణం తీరు చూసి షాకవ్వడం తెలంగాణ ప్రజల వంతైంది.