అవును.. వాళ్ళిద్దరూ.. ఏం మాట్లాడుకున్నారు? పరస్పరం పలకరింపుల తర్వాత పక్కకు వెళ్ళి ఏమని గుసగుసలాడుకున్నారు? రెండు నిమిషాల వ్యవధిలో ఎలాంటి రాజకీయం చేశారు? అసలు చంద్రబాబు-డీకే శివకుమార్ భేటీ యాదృచ్చికంగా జరిగిందా లేక ముందస్తు వ్యూహం ఉందా? ఆ షార్ట్ మీటింగ్‌పై ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే.
టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మధ్య జరిగిన పలకరింపుల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. మూడు రోజుల కుప్పం పర్యటనకు ప్లాన్ చేసుకున్నారు బాబు. అందుకోసం బెంగళూరు ఎయిర్ పోర్టులో దిగి అక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్నాక.. రోడ్ మార్గంలో కుప్పం వెళ్లాలన్నది ఆయన షెడ్యూల్. ఆ క్రమంలోనే.. బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రత్యేక విమానం నుంచి దిగగానే.. అక్కడే రన్‌వే పక్కన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఎదురయ్యారు. పరస్పరం పలకరించుకున్నాక.. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి డీకే శివకుమార్ ప్రత్యేకంగా ఓ రెండు నిమిషాల పాటు ముచ్చటించారు.
ఆ రెండు నిమిషాల మాటా మంతీ మీదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఆ కలయిక యాదృచ్చికమా లేక ప్లాన్ ప్రకారమే జరిగిందా? ఏం మాట్లాడుకుని ఉంటారన్నది చర్చనీయాంశమైంది. వాస్తవానికి చంద్రబాబు దిగే సమయంలోనే.. నాగ్ పూర్ వెళ్లేందుకు డీకే శివకుమార్ బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చారట. కాంగ్రెస్ ఆవిర్భావ సభ నాగ్‌పూర్‌లో జరిగింది. అందులో పాల్గొనేందుకు డీకే ఎయిర్ పోర్టుకు రావడం.. అదే సమయానికి చంద్రబాబు ఎదురు కావడంతో పరస్పరం పలకరించుకున్నారట. ఈ క్రమంలో ఓ రెండు నిమిషాలు మాట్లాడుకున్నారు తప్ప.. పెద్ద ప్లానేమీ లేదని అంటోంది టీడీపీ. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో కానీ.. ఆ పార్టీ నేతృత్వంలోని కూటమితో కానీ తాము అల్లంత దూరంలో ఉంటున్నామనీ, ఈ పరిస్థితుల్లో డీకేతో కలవాల్సిన అవసరం కానీ.. ప్రత్యేకంగా భేటీ కావాల్సిన పరిస్థితులు కానీ లేవనేది టీడీపీ వర్గాల మాట. అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో మాత్రం దాని మీదే విపరీతంగా చర్చ జరుగుతోంది.
వచ్చే ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపవద్దని, అలా అయితే తాము టీడీపీతో కలిసేందుకు సిద్దంగా ఉన్నామని ఇప్పటికే చెప్పారు సీపీఐ అగ్రనేత నారాయణ. దాని మీద టీడీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకున్నా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో సీపీఐ కూడా భాగస్వామిగా ఉండటంతో ఈ భేటీని ఆ కోణంలో కూడా చూస్తున్నారు కొందరు. బీజేపీతో కలిసి వెళ్ళే విషయమై టీడీపీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ కలయిక మెజార్టీ నేతలకు ఇష్టం లేదన్నది పార్టీ వర్గాల మాట. కలిసి పనిచేయడంపై ఇప్పటిదాకా ఇటు టీడీపీ నుంచి గానీ, అటు బీజేపీ నుంచి గాని ఎలాంటి నిర్దిష్ట ప్రకటన లేదు. ఇలాంటి వాతావరణంలో.. బెంగళూరు ఎయిర్ పోర్టులో బాబు, డీకే శివకుమార్ కాసేపు పక్కకు వెళ్ళి మాట్లాడుకోవడమే హాట్ టాపిక్ అయింది. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఆ ఇద్దరికీ తప్ప వేరే వారికి తెలిసే అవకాశం లేకున్నా.. బయట ప్రచారం మాత్రం విపరీతంగా జరిగిపోతోంది. ఉత్సాహం ఆపుకోలేక పార్టీల హెడ్డాఫీసుల్లో ఆరా తీసిన వాళ్ళకు మాత్రం స్పెషాలిటీ ఏం లేదు, ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైనప్పుడు సాధారణంగా జరిగే పలకరింపులేనన్న సమాధానం వస్తోందట.