Chandrababu Naidu: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌.. కేసులో ఏ నిమిషం ఏం జరిగింది..?

చంద్రబాబుపై పెట్టిన సెక్షన్ల విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎఫ్ఐఆర్‌ నమోదైన టైంలో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. పేరు లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ లూథ్రా ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - September 10, 2023 / 07:19 PM IST

Chandrababu Naidu: సీబీఐ కోర్టులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసు ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించింది. వాదోవాదాలు వాడి వేడిగా జరిగినకొద్దీ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు చంద్రబాబుకు బెయిల్‌ వస్తుందా.. రాదా.. అనే సస్పెన్స్‌ సాయంత్రం వరకూ కొనసాగింది. నిన్న చంద్రబాబును సిట్‌ కార్యాలయంలో ప్రశ్నించిన అధికారులు.. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టారు. చంద్రబాబు తరపున అడ్వొకేట్‌ సిద్ధార్థ్‌ లూథ్రా, సీఐడీ తరపున అడ్వకేట్‌ జనరల్‌ సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

చంద్రబాబుపై పెట్టిన సెక్షన్ల విషయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎఫ్ఐఆర్‌ నమోదైన టైంలో ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. పేరు లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారంటూ లూథ్రా ప్రశ్నించారు. ఆ తర్వా చంద్రబాబు పేరును చేర్చేందుకు మెమో దాఖలు చేసినట్టు సుధాకర్‌ రెడ్డి న్యాయమూర్తికి వివరించారు. రెండు సంవత్సరాల నుంచి కేసును విచారిస్తూ, ఇప్పుడు చంద్రబాబును రిమాండ్‌కు కోరడం విడ్డూరంగా ఉందంటూ వాదించారు లూథ్రా. అయితే తమకు సరైన సాక్ష్యాలు ఇప్పుడు దొరికాయని, అందుకే చంద్రబాబును రిమాండ్‌కు అడుగుతున్నామంటూ చెప్పారు సుధాకర్‌ రెడ్డి. కానీ, చంద్రబాబు ఇన్వాల్వ్‌మెంట్‌ గురించి ఎలాంటి ఆధారాలు దొరికాయన్న ప్రశ్నకు మాత్రం సీఐడీ సమాధానం చెప్పలేకపోయింది.

ఎప్పుడో ముగిసిపోయిన కేసును ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో మళ్లీ రీఓపెన్‌ చేశారంటూ లూథ్రా బలంగా వాదించారు. మధ్యాహ్నం లంచ్‌ సమయం అయినప్పటికీ వాదనలు ఇంకా పూర్తవ్వలేదు. లంచ్‌ తరువాత కూడా ఇద్దరు అడ్వొకేట్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్‌కు సమాచారం ఇవ్వకుండా చంద్రబాబును అరెస్ట్‌ చేశారని, అది చట్టవిరుద్ధమని వాదించారు లూథ్రా. అయితే బాబు అరెస్ట్‌ కోసం గవర్నర్‌ అనుమతి అవసరం లేదని, అసెంబ్లీ స్పీకర్‌ అనుమతి ఉంటే చాలని చెప్పారు సుధాకర్‌ రెడ్డి. ఆయన అనుమతి తీసుకున్న తరువాతే బాబును అదుపులోకి సీఐడీ తీసుకుందని చెప్పారు. ఇలాంటి కేసులో వారం ముందే నోటీసులు ఇవ్వాలన్న నియమాన్ని కూడా తిప్పి కొట్టారు.

హై ప్రొఫైల్‌ కేసుల్లో వెంటనే నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకునే వెసులుబాటు ఉందని.. దాని ఆధారంగానే బాబును అరెస్ట్ చేశామని చెప్పారు. ఈ మొత్తం కేసుల్లో ఐపీసీ సెక్షన్‌ 409 అత్యంత కీలకంగా మారింది. ఇది నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌ కావడంతో దీనిమీదే దాదాపు 2 గంటలు వాదనలు కొనసాగాయి. సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ, రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించాలని అధికారులను ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబును తరలించేందుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు హైకోర్టులో చంద్రబాబు తరఫు లాయర్‌ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. సీబీఐ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేయబోతున్నారు. దీంతో తరువాత ఏం జరగబోతోందా అనే సస్పెన్స్‌ నెలకొంది.