ఏదైనా జరిగితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందనడం.. ఎన్నికల్లో ఓడిపోతే కుట్ర జరిగిందని ఓ మాట అనేయడం.. రాజకీయ నాయకులకు అలవాటే ! ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తోంది అదే. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకుంది. 11సీట్లకు పరిమితమై.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. జగన్‌ను, వైసీపీని ఈ ఫలితాలు దారుణంగా దెబ్బతీశాయ్. ఫలితాలు రాగానే.. జగన్ చాలా డల్‌గా మీడియా ముందుకు వచ్చారు.
ఆ ప్రేమలు ఏమయ్యాయో, ఆ ఆప్యాయతలు ఏమయ్యాయో అంటూ తన బాధను బయటపెట్టుకుంటూనే.. తప్పు జరిగిందని తెలుసు కానీ.. తప్పును నిరూపించడానికి ఆధారాలు లేవు అంటూ.. పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంటే ఇన్‌డైరెక్ట్‌గా ఈవీఎంల్లో ఏదో తప్పు జరిగిందని.. కుట్ర చేశారని చెప్పకనే చెప్పారు. ఐతే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు సీఎం అయ్యారు. రాజకీయం నార్మల్ అవుతోంది. ఓడిపోయిన వైసీపీ నేతలంతా ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి.. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
ఈ లిస్ట్‌లో రోజా ముందు వరుసలో ఉన్నారు. నగరిలో ఘోర పరభవాన్ని మూటగట్టుకునే రోజా.. చాలారోజుల తర్వాత తన ఓటమిపై ఓ వీడియో రిలీజ్ చేశారు. ఫలితాలపై జగన్ ఎలా మాట్లాడారో.. అచ్చు రోజా నుంచి అలాంటి మాటలే వినిపించాయ్. అసెంబ్లీ ఎన్నికలు సునామీలా జరిగాయని.. ఇది జనాలు ప్రజలు ఓడించిన ఓటమి కాదు అంటూ భారీ డైలాగ్‌లు వదిలారు. నిజాలు నెమ్మదిగా బయటకు వస్తాయని.. ఘోరంగా ఓడిపోయేంత తప్పులు వైసీపీ చేయలేదని చెప్పుకొచ్చారు. ఇవే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్.
రోజా మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలి… ఎన్నికలు సరిగా జరగలేదని అంటున్నారా.. ఎన్నికల సంఘం ఎలక్షన్స్ సరిగా జరిపించలేదనీ, వచ్చిన ఫలితాలు వాస్తవమైనవి కాదని అంటున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. రోజా మాటలు వింటే.. జగన్ గుర్తుకొస్తున్నారని.. అందరిదీ సేమ్ సిలబస్సా మేడమ్ అంటూ.. నెటిజన్లు ఆడుకుంటున్నారు. కొత్తగా చెప్పండి మేడమ్.. కొత్తది చెప్పండి మేడమ్ అంటూ.. ఓ ఆట ఆడుకుంటున్నారు. నిజానికి అప్పుడు జగన్, ఇప్పుడు రోజా అనే కాదు.. గతంలో చంద్రబాబు కూడా ఇలానే మాట్లాడారు. 2019లో ఓటమి తర్వాత ఈవీఎంల పనితీరు తప్పుపట్టారు. ఏమైనా రోజా మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.