Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నద్దా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తెలుగు ప్రముఖులతో భేటీ అవుతున్నారు. మొదట ఎన్టీఆర్, ఆ తర్వాత నితిన్, పుల్లెల గోపీచంద్, మిథాలీ రాజ్.. ఇలా పలువురు ప్రముఖులతో అమిత్ షా, నద్దా భేటీ అయ్యారు. ఇప్పుడు ఏబీఎన్ ఎండీ రాధాకృష‌్ణ, దర్శకుడు రాజమౌళిని కూడా అమిత్ షా కలవబోతున్నారు. అయితే, ఎందుకు ఇలా తెలుగు వాళ్లను కలుస్తున్నారు అనే విషయంలో స్పష్టత లేదు.
బీజేపీ పెద్దలు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా తెలుగు ప్రముఖులతో సమావేశమవుతున్నారు. వారితో ఏ అంశాలు చర్చిస్తున్నారో తెలియదు. పోనీ బీజేపీ నేతలు కలిసే ప్రముఖులకు రాజకీయాలపై ఆసక్తి ఉందా.. పార్టీకి సేవలందిస్తారా.. అంటే అదీ లేదు. వారి నేపథ్యం వేరు. ఒకవేళ బీజేపీ ఆహ్వానించినా ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చేసి.. గెలిచేసి.. ఏదో అద్భుతం చేసే అవకాశం కూడా లేదు. అలాగే వారికి రాజకీయాల మీద అవగాహనా, ఆసక్తులు కూడా పెద్దగా లేవు. అలాంటిది తెలుగు సెలబ్రిటీలతో బీజేపీ పెద్దలు ఎందుకు వరుసగా భేటీ అవుతున్నారన్నది అంతు చిక్కని ప్రశ్న. ఈ భేటీలలో ఏం చర్చించారో వాళ్లూ చెప్పరు. వీళ్లూ చెప్పలేరు. ఈ విషయం బీజేపీ రాష్ట్రస్థాయి నేతలకు కూడా అంతుచిక్కడం లేదు.
ప్రచారం కోసమా.. దీర్ఘకాలిక వ్యూహమా..?
ఈ భేటీ వల్ల ఏం లాభం ఉందో తెలియదు కానీ.. కావాల్సినంత ప్రచారం మాత్రం లభిస్తోంది. తెలుగు ప్రముఖులకు బీజేపీ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అయితే, కేవలం ప్రచారం కోసమే ఇలా చేస్తోందా.. లేక దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా భేటీలు నిర్వహిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే బీజేపీ తాత్కాలిక, తక్షణ లక్ష్యాల కోసం పనిచేయదు. దీర్ఘకాలిక వ్యూహాల్ని రచిస్తుంది. ఇప్పటికిప్పుడు ఫలితం లేకపోయినా.. భవిష్యత్తులో పార్టీకి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే భేటీ అవుతున్న సెలబ్రిటీలకు రాజకీయాలపై ఆసక్తి ఉందా.. ఉంటే వారి సేవల్ని భవిష్యత్తులో ఎలా వినియోగించుకోవచ్చు.. వంటి అంశాల్ని ఆరా తీస్తుండొచ్చు అని కొందరి అభిప్రాయం. సెలబ్రిటీలు చెప్పే అభిప్రాయాలకు అనుగుణంగా బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వారికి ఆసక్తి ఉంటే భవిష్యత్తులో అయినా వారి సేవల్ని వినియోగించుకునేలా ప్లాన్ చేయొచ్చు. మరోటి.. వాళ్ల ద్వారా రాష్ట్ర పరిస్థితులు, రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారేమో అనే వాదన కూడా ఉంది. ప్రముఖులను కలవడం ద్వారా వాళ్లంతా తమవాళ్లే అని చెప్పుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది అనే ఇంకో వాదన కూడా ఉంది.
రాజమౌళి.. రాధాకృష్ణతో
దర్శక ధీరుడు రాజమౌళితోపాటు, ఏబీఎన్ రాధాకృష్ణతో గురువారం అమిత్ షా భేటీ అవుతారు. రాధాకృష్ణతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి చర్చించవచ్చు. ఆయన మీడియా సంస్థ అధినేత కాబట్టి.. రాజకీయాలపై అవగాహన ఉంటుంది. అయితే, రాజమౌళితో ఏం చర్చిస్తారనే ఆసక్తి ఉంది. బీజేపీ, హిందూత్వ సిద్ధాంతాలకు అనుగుణంగా సినిమాలు తీసే అంశంపై చర్చించవచ్చని ప్రచారం జరుగుతోంది.