Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో దాదాపు ఏడున్నర గంటలపాటు సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ కేసులో ప్రధానంగా మారిన అంశం.. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేకుండా సెక్షన్ 409 కింద కేసు నమోదు చేయడం. ఈ స్కామ్‌లో చంద్రబాబు పాత్రను ప్రత్యక్షంగా నిరూపించే ఆధారాలను సీఐడీ చూపలేకపోయిందని తెలుస్తోంది. ఈ కేసులో వాదనలు మొత్తం ఒకవైపు అయితే.. కేవలం ఐపీసీ సెక్షన్ 409 అంశం ఇంకో ఎత్తు.
ఈ సెక్షన్ విషయంలో దాదాపు రెండున్నర గంటలు వాదన జరిగింది. దీంతో అసలు సెక్షన్ 409 అంటే ఏంటి అనే చర్చ మొదలైంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 409 ప్రకారం ప్రభుత్వ ఆస్తి కాపాడాల్సిన సేవకులు ప్రజలను మోసం చేస్తే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఎవరైనా ఏదైనా పద్ధతిలో ఆస్తిని అప్పగిస్తే లేదా పబ్లిక్ సర్వెంట్ హోదాలో లేదా బ్యాంకర్, వ్యాపారి, బ్రోకర్, న్యాయవాదిగా అతని వ్యాపారంలో ఆస్తిపై ఏదైనా ఆధిపత్యం లేదా ఏజెంట్, ఆ ఆస్తికి సంబంధించి నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు పాల్పడితే సెక్షన్ 409 కింద వాళ్లు శిక్షార్హులు. ఈ కేసులో బెయిల్ కూడా దొరకదు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే పదేళ్లవరకూ జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే చాన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో 10 ఏళ్ల జైలు శిక్ష.. జీవితఖైదుగా మారే అవకాశం కూడా ఉంది.
కేసు తీవ్రతను బట్టి ఈ మార్పులుంటాయి. ఇప్పుడు చంద్రబాబు మీద కూడా ఇదే కేసు నమోదు చేశారు. అయితే ఈ సెక్షన్ చంద్రబాబుకు వర్తించదు అని చెప్పేందుకు ఉన్న అన్ని ఆధారాలను సమర్పించి వాధించారు అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా. ఈ సెక్షన్ 409తోపాటు 17ఏ సెక్షన్ మినహా చంద్రబాబుపై మోపిన అభియోగాలన్నీ బెయిల్‌కు అర్హమైనవే. వీటిలో 409 సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని లూథ్రా వాదించారు. ఆయన వాదనలకు కోర్టు అంగీకరిస్తే బెయిల్ వచ్చే అవకాశం ఉంది.