Nara Lokesh: టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. గత ఎన్నికల్లో లోకేశ్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నారు. ఓడిపోయింది తక్కువ ఓట్లతోనే అయినా.. ఓ పార్టీ అధినేత కుమారుడు.. ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు ఎన్నికల్లో ఓడిపోవడం వైసీపీకి ఆయుధంగా మారింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. లోకేశ్ మీద విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది వైసీపీ.
లోకేశ్ రాజకీయాలకు పనికిరారంటూ.. ఓ సమయంలో ఘాటుగానే విమర్శించారు ఫ్యాన్ పార్టీ నేతలు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని సైకిల్ పార్టీ కసి మీద కనిపిస్తోంది. అందుకే మంగళగిరి నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకుంది టీడీపీ. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత.. ఆ నియోజకవర్గంపై లోకేశ్ ప్రత్యేక దృష్టిసారించారు. ప్రతీ క్షణం జనాలకు అందుబాటులో ఉన్నారు. యుగగళానికి ముందు ఎక్కువ సమయం లోకేశ్ గడిపింది కూడా మంగళగిరిలోనే . దీంతో గతంతో పోలిస్తే.. ప్రస్తుతం మంగళగిరిలో టీడీపీ గ్రాఫ్ బాగానే పెరిగినట్లు కనిపిస్తోంది.
నియోజకవర్గంలో పర్యటిస్తూ జనాల సమస్యలను తీర్చడంలో లోకేశ్ తనదైన ముద్ర వేశారు. దీంతో లోకేశ్ పై మంగళగిరి జనాల్లో సానుకూలత గట్టిగానే ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల మీద రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయ్. జనాల సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదని.. భూ అక్రమణకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయ్. ఇవన్నీ టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఒకరకంగా మంగళగిరిలో మెజారిటీ జనాలు.. లోకేశ్ వైపు చూస్తున్నారన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఇదే టెంపో కంటిన్యూ అయితే.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కేవలం ఐదు వేల ఓట్ల తేడాతోనే లోకేశ్ మీద ఆళ్ల విజయం సాధించారు.
పొత్తులో భాగంగా మంగళగిరిని సీపీఐకి కేటాయించింది జనసేన. సీపీఐ అభ్యర్థికి 10వేలకు పైగా ఓట్లు వచ్చాయ్. ఐతే ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ జత కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కూడా మంగళగిరిలో టీడీపీని విజయానికి దగ్గర చేసే అవకాశాలు ఉన్నాయ్. పొగొట్టుకున్న చోటే విజయాన్ని వెతుక్కోవాలి అన్నట్లుగా నాలుగేళ్లుగా లోకేశ్ అనుసరించిన వ్యూహాలు.. మంగళగిరిలో వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తోంది.