తిరుమల డిక్లరేషన్ అంటే ఏంటీ…? ఫాం ఎక్కడ సమర్పించాలి…?

తిరుమల వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. లడ్డులో కల్తీ జరిగిందని వచ్చిన వార్తలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. గతంలో ఎన్నడు లేని విధంగా... ఒక ప్రాంతీయ పార్టీపై జాతీయ స్థాయిలో నిరసనలు జరిగాయి.

  • Written By:
  • Updated On - September 26, 2024 / 11:58 AM IST

తిరుమల వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. లడ్డులో కల్తీ జరిగిందని వచ్చిన వార్తలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. గతంలో ఎన్నడు లేని విధంగా… ఒక ప్రాంతీయ పార్టీపై జాతీయ స్థాయిలో నిరసనలు జరిగాయి. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటూ రాజకీయ పార్టీల అధినేతలు సైతం స్పందించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నిరసనలకు దిగాయి హిందూ సంస్థలు. ఈ విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి వాస్తవాలను బయటకు తీయాలని డిమాండ్ లు వినిపించాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక దీనిపై ఇప్పుడు వైసీపీ నష్ట నివారణ చర్యలకు దిగుతోంది. ఈ నెల 28 న రాష్ట్ర వ్యాప్తంగా పూజలకు పిలుపునిచ్చింది వైసీపీ. మాజీ సిఎం వైఎస్ జగన్ కూడా ఈ నిరసనల్లో పాల్గొంటారు. ఇక కాలి నడకన ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు జగన్. ఈ నేపధ్యంలో శ్రీవారి దర్శనం చేసుకునే ముందు ఆయన సంతకం చేస్తారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీనిపై బిజెపి నేతలు డిమాండ్ లు చేస్తున్నారు.

డిక్లరేషన్ పై సంతకం చేసిన తర్వాతే జగన్ కొండపైకి వెళ్ళాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి అసలు ఈ డిక్లరేషన్ అంటే ఏంటీ అనేది ఒకసారి చూద్దాం. 2006లో చేసిన చట్ట సవరణలో భాగంగా హిందువులు కానివారు దేవాలయంలోకి ప్రవేశించే ముందు డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి… శ్రీవారిపై తమకు నమ్మకం, గౌరవం, విశ్వాసం ఉందని దర్శనానికి తమను అనుమతించాలి అని వ్రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ప్రవేశించేముందు ఈ డిక్లరేషన్ సమర్పించాలి. ఏపీ రెవెన్యూ ఎండోమెంట్స్ -1 లోని జీఓ ఎంఎస్ నెంబర్ 311 (1990) ప్రకారం ఈ నిబంధనలు విధించారు. గతంలో జగన్ ఎప్పుడు తిరుమల వెళ్ళినా ఈ ఫారంపై సంతకం చేయలేదు.