Wagner Group: వాగ్నర్‌ గ్రూప్‌ ఎలా పుట్టింది..? అసలు ఈ యెవ్‌జెనీ ఎవరు..?

అసలు ఈ వాగ్నర్‌ గ్రూప్‌ ఏంటి? రష్యా సైన్యం ఉండగా ఈ ప్రైవేట్‌ సైన్యాన్ని పుతిన్ ఎందుకు ఏర్పాటు చేశాడు? ఈ యెవ్‌జెనీ ప్రిగోజిన్‌ ఎవరు? రష్యాలో ఇంత పవర్‌ఫుల్‌ మ్యాన్‌గా ఎలా ఎదిగాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 11:35 AM IST

Wagner Group: రష్యాకు ప్రైవేట్‌ ఆర్మీగా ఉండే వాగ్నర్‌ గ్రూప్‌ ఎదురు తిరిగింది. రష్యాలో సైనిక అధికారాన్ని కూలదోస్తామని వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌జెనీ ప్రిగోజిన్ శపథం చేశాడు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. వాగ్నర్‌ పేరు ప్రస్తావించకుండా ఈ గ్రూప్‌నకు వార్నింగ్‌ ఇచ్చాడు. కొందరు రష్యా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారని.. వాళ్లకు శిక్ష తప్పదని హెచ్చరించాడు. అయితే, బెలారస్ అధ్యక్షుడి జోక్యంతో వివాదం సద్దుమణిగింది. తిరుగుబాటు చర్యను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రిగోజిన్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఇష్యూ అంతర్జాతీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ వాగ్నర్‌ గ్రూప్‌నకు, రష్యా సైన్యానికి ఎక్కడ చెడింది అనే విషయం పక్కన పెడితే.. అసలు ఈ వాగ్నర్‌ గ్రూప్‌ ఏంటి? రష్యా సైన్యం ఉండగా ఈ ప్రైవేట్‌ సైన్యాన్ని పుతిన్ ఎందుకు ఏర్పాటు చేశాడు? ఈ యెవ్‌జెనీ ప్రిగోజిన్‌ ఎవరు? రష్యాలో ఇంత పవర్‌ఫుల్‌ మ్యాన్‌గా ఎలా ఎదిగాడు? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి. వాగ్నర్‌ గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న యెవ్‌జెనీ ప్రిగోజిన్‌ ఒకప్పుడు ఓ చిన్న రెస్టారెంట్ ఓనర్‌. కానీ యెవ్‌జెనీ జీవితం మాత్రం నేరాలతోనే మొదలయ్యింది. 1979లో దొంగతనం కేసులో మొదటిసారి జైలుకు వెళ్లాడు యెవ్‌జెనీ. 9 ఏళ్ల శిక్ష తరువాత తన స్వస్థలం సెయింట్‌ పీటర్‌బర్గ్‌లో ఓ చిన్న రెస్టారెంట్‌ పెట్టుకున్నాడు.

పుతిన్‌ పుట్టిన నగరం కూడా అదే. యెవ్‌జెనీ రెస్టారెంట్‌ నడుపుతున్న టైంలో పుతిన్‌ అదే నగరంలో మేయర్‌ ఆఫీస్‌లో పని చేసేవాడు. యెవ్‌జెనీ రెస్టారెంట్‌కు పుతిన్‌ రెగ్యులర్‌ కస్టమర్‌. అలా వాళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. బిజినెస్‌ బాగా సాగడంతో యెవ్‌జెనీ చాలా రెస్టారెంట్‌లు ఓపెన్‌ చేశాడు. పుతిన్‌ అధ్యక్షుడు అయ్యాక కూడా యెవ్‌జెనీ రెస్టారెంట్‌కు రెగ్యులర్‌గా వెళ్లేవాడు. ఫారెన్‌ గెస్ట్‌లను కూడా తీసుకెళ్లేవాడు. క్రెమ్లిన్‌లో జరిగే ప్రతీ గవర్నమెంట్‌ ప్రోగ్రాంకు యెవ్‌జెనీ కేటరింగ్‌ చేసేవాడు. పుతిన్‌కు, విదేశీ అతిథులకు స్వయంగా వడ్డించేవాడు. పుతిన్‌తో ఇంత స్నేహం ఉంది కాబట్టే యెవ్‌జెనీని ఎవరూ ఏమీ అనేవాళ్లు కాదు. 2014లో మొదటి సారి రష్యా రక్షణ నిమిత్తం వాగ్నర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. కానీ దీనికి సారథ్యం వహిస్తున్నది యెవ్‌జెనీ అని మాత్రం పుతిన్‌కు తప్ప ఎవరికీ తెలియదు. మొదట ఈ గ్రూప్‌ను రష్యా బయట రక్షణ కోసం, గూఢచర్యం కోసం ఉపయోగించేవారు. జైలు నుంచి విడుదలైన ఖైదీలే వీళ్ల సైనికులు. యుద్ధ భూమిలో పోరాడాలనే కసి సైనికుల క్వాలిఫికేషన్‌. వాగ్నర్‌ గ్రూపులో జీతాలు లక్షల్లో ఉంటాయి. యుద్ధంలో చనిపోతే 50 వేల డాలర్లు ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

మొదట యుక్రెయిన్‌లో తిరుగుబాటుదారులకు సహాయం అందించేందుకు ఈ గ్రూప్‌ను వాడుకున్నారు. తరువాత వివిధ ఆఫ్రికా దేశాల్లో, సిరియాలో వాగ్నర్‌ గ్రూప్‌ బలంగా మారింది. ప్రస్తుతం ఆ గ్రూప్‌లో 50 వేల మంది సైనికులు ఉన్నట్టు అంచనా. మొదటి నుంచి వాగ్నర్‌ గ్రూప్‌తో ఉన్న సంబంధాలను ఖండిస్తూ వచ్చాడు యెవ్‌జెనీ. కానీ 2022లో వాగ్నర్‌ గ్రూప్‌కు తానే సారథ్యం వహిస్తున్నట్టు చెప్పాడు. యుక్రెయిన్‌తో యుద్ధం సమయంలో వాగ్నర్‌ గ్రూప్‌ కీలక పాత్ర వహించింది. అయితే ముందు నుంచీ వాగ్నర్‌ గ్రూప్‌కు, రష్యా సైన్యానికి పడదు. సందర్భం వచ్చిన ప్రతీసారీ రష్యా సైన్యం మీద యెవ్‌జెనీ ఆరోపణలు చేశేవాడు. యుక్రెయిన్‌తో యుద్ధం సమయంలో రష్యా సైనికాధికారుల అణచివేత ఎక్కువైందని యెవ్‌జెనీ వాదన. అందుకే సైనికాధికారాన్ని కూలదోస్తామంటూ తిరుగుబాటు చేశారు. చివరకు సంధి కుదరడంతో ఈ తిరుగుబాటు ఆగిపోయింది.