AP TDP : ఈ యుద్ధం లో నిలబడితే టీడీపీకి ఇక.. తిరుగే ఉండదు..!

ప్రభుత్వానికి.. టీడీపీకి మధ్య జరుగుతున్న యుద్దంలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పటికే చంద్రబాబును జైలుకు పంపారు. ఇదే కోవలో టీడీపీ యువ నేత లోకేష్‌ సహా.. ఇంకొందరు ముఖ్య నేతలను కూడా ప్రభుత్వం టార్గెట్‌ చేసినట్టే కన్పిస్తోంది

వైసీపీ తదుపరి టార్గెట్ వాళ్లేనా.. ?

ప్రభుత్వానికి.. టీడీపీకి మధ్య జరుగుతున్న యుద్దంలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎవ్వరూ ఊహించలేని పరిస్థితి కన్పిస్తోంది. ఇప్పటికే చంద్రబాబును జైలుకు పంపారు. ఇదే కోవలో టీడీపీ యువ నేత లోకేష్‌ సహా.. ఇంకొందరు ముఖ్య నేతలను కూడా ప్రభుత్వం టార్గెట్‌ చేసినట్టే కన్పిస్తోంది. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నారాయణ, పుల్లారావు, ధూళిపాళ నరేంద్ర ఇలాంటి వారి పేర్లు ఇప్పటికే వివిధ సందర్భాల్లో తెర మీదకు వస్తూనే ఉన్నాయి. వీరిని కూడా జగన్‌ ప్రభుత్వం టార్గెట్‌ చేసే సూచనలు కన్పిస్తోంది. దీన్ని కూడా ఏ విధంగా ఎదుర్కొవాలనే అంశంపై కసరత్తు చేయడంతో పాటు.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు లీడ్‌ చేస్తారనేది అంశంలో చర్చ జరుగుతున్న సందర్భాల్లో నారా-నందమూరి కుటుంబాలకు చెందిన వ్యక్తులతో పాటు.. పార్టీ సీనియర్లెవరైనా లీడ్‌ రోల్‌ తీసుకోగలరా..? తీసుకుని నడిపించగలరా..? అనేదే చర్చ.

చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత రాజమండ్రిలో లోకేష్‌..

పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేత యనమల కూర్చొని సమన్వయంతో పని చేసుకుంటున్నారు. అయితే లోకేష్‌ ఇప్పటికే ప్రభుత్వం టార్గెట్‌లో ఉన్నారు. జైలుకు పంపుతామని వైసీపీ నేతలు ఇప్పటికే చెప్పేస్తున్నారు. దీంతో సీనియర్ల పరంగా పార్టీని ఎవరు లీడ్ చేయగలరు..? ఒకవేళ చంద్రబాబు.. లోకేష్‌ జైలు లోపలున్నా.. వారు తిరిగి వచ్చే వరకు పార్టీని కంటికి రెప్పలా కాపాడి వారు తిరిగి వచ్చాక వారి చేతుల్లో పెట్టే సత్తా ఎవరికి ఉంది..? అనేది తాజా చర్చ. పార్టీలో సీనియర్లుగా ఉన్న యనమల, సోమిరెడ్డి, కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు, పయ్యావుల, ధూళిపాళ, నక్కా ఆనందబాబు వంటి వారు చొరవ తీసుకుని వ్యవహరాలు చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అశోక్ గజపతి రాజు వంటి నేతలు సీనియర్లుగా ఉన్నా.. వారు చాలా కాలంగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉంటూనే ఉన్నారు.

చంద్రబాబు సరే.. మరి నెక్స్ట్ ఎవరు.. ?

ఇక పార్టీలో చంద్రబాబు, లోకేష్‌లు కాకుండా.. మిగిలిన సీనియర్‌ లీడర్ల మధ్య సఖ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఏ ఇద్దరి మధ్య పెద్దగా పొసగని పరిస్థితి. ఎవరికి బాధ్యతలు అప్పజెప్పినా.. మిగిలిన వారు అలగడమో.. లేక కెలకడమో చేస్తారని అంటున్నారు. ఈ క్రమంలో పార్టీని రెగ్యులర్‌ యాక్టివిటీలోకి తేవాలంటే కచ్చితంగా ఓ టీం ఉండాలని అంటున్నారు. ఎన్నికల వరకు చంద్రబాబు, లోకేష్‌లను ఎలాగైనా సరే జైలుకే పరిమితం చేసి వ్యవహరం నడిపిద్దామని వైసీపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న పరిస్థితి. ఒకవేళ అదే జరిగితే ఎన్నికలను ఎవరు లీడ్‌ చేస్తారు. ఏ సీనియర్‌ నడుం బిగిస్తారనేది..? ఇక్కడి చర్చ. అయితే ఈ చర్చ అంతా ఎన్నికల వరకు చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకుంటే.. లోకేష్‌ కూడా జైలుకు వెళ్తే ఎలా అనే దగ్గర మొదలైంది. అలా కాకుండా.. టీడీపీ లీగల్‌ టీమ్‌ ప్రయత్నాలు ఫలించి చంద్రబాబు బయటకు వస్తే.. నాయకత్వం గురించి.. నెక్స్ట్‌  ఎవరనే అంశం మీద జరుగుతున్న చర్చకు ఫుల్‌ స్టాప్‌ పడుతుంది.