Thummala Nageswara Rao: పాలేరు అసెంబ్లీ టికెట్ నిరాకరణతో బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజమైన తుమ్మల అడుగులు ఎటువైపు పడతాయనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. 40 ఏళ్లుగా ఖమ్మం రాజకీయాల్లో కీలక శక్తిగా వ్యవహరించిన తుమ్మల తదుపరి నిర్ణయం ఏమిటనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే తుమ్మలకు స్నేహ హస్తం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. తమ పార్టీలోకి చేరితే పాలేరు లేదా ఖమ్మం నుంచి అసెంబ్లీ బరిలోకి దింపుతామని కాంగ్రెస్ నేతలు ఆఫర్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. తుమ్మల కూడా ఆ వైపే అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. అయితే తన పొలిటికల్ కెరీర్‌లో తుమ్మల ఎన్నడూ కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూడలేదు. మరి తాజా పరిణామాలు ఆయనను హస్తం పార్టీకి జై కొట్టేలా చేస్తాయా అనే డౌట్స్ కూడా రేకెత్తుతున్నాయి.
భావజాలంపరంగా తుమ్మలకు బీజేపీ సూట్ కాదని పలువురు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పైగా కమలదళానికి ఉమ్మడి ఖమ్మంలో బలమైన క్యాడర్ కూడా లేదు. అందుకే బీజేపీతో ఆయన చేతులు కలిపే ఛాన్సులు చాలా తక్కువనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్‌కు ఖమ్మంలో మంచి పట్టు ఉంది. అందులో చేరితేనే మంచి ఫ్యూచర్ ఉంటుందని కొందరు అనుచరులు తుమ్మలకు సలహా ఇస్తున్నారట. ఈ వారంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి తుమ్మల అనుచరులు భారీ ర్యాలీగా హైదరాబాద్ వెళ్లి తుమ్మలను కలవనున్నట్లు తెలుస్తోంది. చివరి ప్రయత్నంగా.. మరోసారి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చేలా కేసీఆర్ నుంచి హామీ లభిస్తుందనే ఆశతో తుమ్మల ఎదురు చూస్తున్నారని సమాచారం.
కేసీఆర్ ఇచ్చే భరోసాపై ఆధారపడి తుమ్మల నుంచి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. 2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో తుమ్మల ప్రభావం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పట్టుకోల్పోలేదు. పైగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేసి ప్రతికూల పరిస్థితుల్లోనూ తన క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్, కేటీఆర్‌కు తుమ్మలను దూరం చేశారని తుమ్మల అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఈసారి తుమ్మలకు కేసీఆర్ ఛాన్స్ ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్టులో తుమ్మల పేరు ప్రకటించకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన కందాల ఉపేందర్‌రెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ కేటాయించడంతో పాలేరు టికెట్‌పై ఆశపెట్టుకున్న తుమ్మల భవితవ్యం ఏంటా అన్న చర్చ జరుగుతోంది.