Rahul Gandhi: రాహుల్ పార్లమెంటుకు వస్తారా..? స్పీకర్ నిర్ణయంపైనే ఉత్కంఠ

రాహుల్ గాంధీకి విధించిన శిక్ష రద్దు కావడంతో రాహుల్ తిరిగి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవచ్చు. దీంతో కోర్టు ఆదేశాల్ని కాంగ్రెస్ లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేసింది.

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 09:58 AM IST

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరవుతారా..? లేదా..? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ నిర్ణయంపైనే రాహుల్ హాజరు ఆధారపడి ఉంటుంది. మోదీపై వ్యాఖ్యల కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్ సెక్రటరీ నిర్ణయం తీసుకున్నారు. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జైలు శిక్షను రద్దు చేస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. గుజరాత్ కోర్టు తీర్పును కొట్టివేసింది. రాహుల్ గాంధీకి విధించిన శిక్ష రద్దు కావడంతో రాహుల్ తిరిగి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవచ్చు. దీంతో కోర్టు ఆదేశాల్ని కాంగ్రెస్ లోక్‌సభ స్పీకర్‌కు తెలియజేసింది. దీని ప్రకారం.. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని స్పీకర్ పునరుద్ధరించాలి. తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంటుకు హాజరవుతారు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. రాహుల్ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంటారా.. లేదా ఇంకేదైనా కారణంతో తిరస్కరిస్తారా.. అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేసినా.. రాహుల్ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించకపోయినా.. తిరిగి కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ రోజు సాయంత్రంలోపు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. స్పీకర్ నిర్ణయంతో ఆయన సభ్యత్వం రద్దైంది. ఇప్పుడు తిరిగొచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగితే పార్లమెంటుకు హాజరవ్వడమే కాకుండా.. తిరిగి ఎన్నికల్లో కూడా పోటీ చేస్తారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 11 వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. ఆలోపు రాహుల్‌ గాంధీకి అనుకూలంగా స్పీకర్ నిర్ణ‍యం ఉంటే సభకు వెళ్తారు. త్వరలో మణిపూర్‌పై చర్చ జరిగే అవకాశం ఉన్నదృష్ట్యా రాహుల్ హాజరవ్వడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం. ప్రధానిపై, బీజేపీపై విమర్శలు చేసేందుకు రాహుల్ ఉపయోగపడతారని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో చర్చ జరుగుతుంది. అక్కడ వైసీపీ మద్దతుతో ఈ బిల్లును కేంద్రం ఆమోదింపజేసుకుంటుంది. దీంతోపాటు మణిపూర్ అవిశ్వాస తీర్మానంపై కూడా చర్చ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.