భారత రాజకీయ చరిత్రలో అయోధ్య అంటే అద్వానీ. అద్వానీ అంటే అయోధ్య (Advani -Ayodhya). అయోధ్య అంశానికి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు తెచ్చిన నాయకుడు భారత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ. ఈరోజు అయోధ్యలో రామాలయం వెలిసింది అంటే ఆ కృషి అంతా 96 ఏళ్ల అద్వానీదే. 80ల నుంచి అయోధ్య అంశాన్ని దేశ రాజకీయాల్లో ప్రధాన అంశంగా చేసి అందుకోసం ఉద్యమించి రథయాత్రలు చేసి… ఆందోళనలు చేసి… న్యాయస్థానాల్లో పోరాడి ,నిరంతరం శ్రమించిన నాయకుడు ఎల్ కే అద్వానీ.
జనవరి 22న చారిత్రాత్మక అయోధ్య రామాలయంలో బాలరాముని ప్రాణప్రతిష్టకు దురదృష్టవశాత్తు అద్వానీ హాజరుకాలేకపోయారు. రాముడి తర్వాత అయోధ్యలో అంత పేరున్న అద్వానీ రాముడి ప్రాణ ప్రతిష్టకు రాలేకపోవడం.. ఆ సమయంలో అక్కడ లేకపోవడం అందరినీ బాధించింది. కానీ ఇప్పుడున్న నాయకులకు భయపడి, ప్రలోభాలకు లోబడి మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, నాయకులు కానీ సెలబ్రిటీలు గానీ… అద్వానీ ఎక్కడ అని అడగలేదు. ఆయన గురించి బహిరంగంగా ప్రస్తావించనూ లేదు. అద్వానీ గురించి మాట్లాడితే… ఏం కొంపలు మునిగితాయో అన్న భయంతో అందరూ గుట్టు చప్పుడు కాకుండా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని బయటపడ్డారు. వయోభారం వల్ల, చలివల్ల అద్వానీ అయోధ్యకు రాలేకపోయారు అని ఎవరికి వాళ్లే చెప్పుకున్నారు తప్ప…ఆయన ఎందుకు రాలేదు… ఎవరు రానీయలేదు… అన్నది అందరికీ తెలుసు. కానీ రాముడి కోసం, రామాలయం కోసం మొదటి నుంచి పరితపించి ఉద్యమించి పోరాడిన ఆ కురువృద్ధున్ని, ఆయన సాహసాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే.
ప్రస్తుతం అద్వానీ వయసు 96యేళ్ళు. అసలు సిసలైన హిందుత్వవాది. భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున లోక్ సభలో అడుగుపెట్టిన తొలి ఎంపీ.1998, 99 ఎన్డీఏ ప్రభుత్వాల్లో కీలక పాత్రధారి…. సూత్రధారి కూడా. అయోధ్యలో రామాలయం కోసం 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు చారిత్రాత్మక రథయాత్ర తలపెట్టారు అద్వానీ. కొద్ది రోజులకే ఆ యాత్రను అడ్డుకొని అద్వానీని అరెస్ట్ చేసింది వీపీ సింగ్ ప్రభుత్వం. కానీ అద్వానీ రథయాత్ర దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులకు దారితీసింది. జనంలో అయోధ్య రాముడిపై అపారమైన ప్రేమను పెంచింది.
ఆ తర్వాత జరిగిన మతకల్లోల్లో వందల మంది చనిపోయారు. ఒక వర్గం అద్వానీనే బాధ్యుడిని చేసి నానా తిట్లు తిట్టింది. 1992 డిసెంబర్ 6న లక్షల మంది సమక్షంలో కరసేవకులు అద్వానీ నాయకత్వంలో బాబ్రీ మసీదును కూల్చేశారు. బాబ్రీ మసీదును పడగొట్టాలని చెప్పి… పట్టుదలతో ఉన్న అద్వానీ తన చిరకాల వాంఛను తీర్చుకున్నారు. ఆ తర్వాత ముంబై పేలుళ్లు, మతకల్లోలాలు చలరేగాయి. పరోక్షంగా వీటన్నిటికీ అద్వానీయే బాధ్యుడని ఆ వర్గం శపించింది. ఆయన అన్నీ భరించాడు. మరోవైపు కోర్టులో అయోధ్య కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు. 2004 ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది. అయినా కూడా అయోధ్య కోసం అద్వానీ పోరుసలుపుతూనే ఉన్నాడు. ఇప్పుడు లేచిన అయోధ్య గోడల కింద అద్వానీ జరిపిన పోరాటం దాగి ఉంది. 1992లో ఆయన తెగించి కర సేవకులను స్వయంగా దగ్గరుండి నడిపించి బాబ్రీ మసీదు కూలగొట్టి ఉండకపోతే ఈరోజు అయోధ్య ఆలయమే లేదు. డ్రామా రాజకీయాలు, రకరకాల ప్రచార వ్యూహాలు తెలియని అద్వానీ… అసలు సిసలైన జాతీయవాది. దేశ విభజనలో పాకిస్తాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన హిందుత్వవాది ఎల్కే అద్వానీ. ఒకానొక సందర్భంలో జిన్నాను దేశభక్తుడు అంటూ ప్రశంసించి పార్టీలోనే చాలామందికి వ్యతిరేకి అయ్యారు. RSS కూడా అప్పటి నుంచి అద్వానీని కాస్త దూరం పెడుతూ వచ్చింది. రోజులు మారిపోయాయి. 2014లో నరేంద్ర మోడీ (Narendra Modi) లాంటి శక్తివంతమైన నాయకుడు బిజెపి తరఫున దేశానికి ప్రధాన అయ్యారు. అక్కడి నుంచి దేశమే మారిపోయింది. అయోధ్యకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం, చక చక ఆలయనిర్మాణానికి ఏర్పాట్లు కూడా చూస్తుండగానే జరిగిపోయాయి. 96 ఏళ్ల వయసులో పూర్తిగా ఇంటికే పరిమితమైన అద్వానీని బిజెపి అధిష్టానం కూడా పట్టించుకోవడం మానేసింది. ఆ మహానేత చేసిన త్యాగాలను కనుమరుగయ్యేలా చేసింది.
అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) క్రెడిట్ మరొకరికి దక్కకుండా చేసిన వ్యూహంలో భాగంగా మొదట అద్వానీని, మురళీ మనోహర్ జోషిని అయోధ్య కార్యక్రమానికి పిలవలేదు. ఆ తర్వాత ఆహ్వానించారు. వయోభారంతో ఉన్న తాను చలికి తట్టుకోలేనని, అయోధ్యకు రాలేనని అద్వానీ చెప్పినట్లు సమాచారం బయటకు వచ్చింది. జీవిత కల సాఫల్యం అవుతున్న వేళ… అద్వానీ అయోధ్యకు రాకుండా ఉంటారా…. మారిన కాలం, వ్యక్తులు, మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయనే అయోధ్యకు దూరంగా ఉన్నారా అనే సందేహం చాలా మందికి ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా రామాలయ ఆలయం ప్రారంభం జరగాలని రాసి ఉంది… విధి ఆయనకు అవకాశం ఇచ్చింది అని అనడం ద్వారా అద్వానీలో పరిణితి చెందిన నేత కనిపిస్తాడు. అయోధ్య రామాలయం ఫ్రేమ్ లో ఈరోజు అద్వానీ కనిపించకపోవచ్చు. కానీ ఆ ఆలయం కోసం అద్వానీ పడిన శ్రమ, చేసిన పోరాటాన్ని మాత్రం జనం మర్చిపోరు. రాజకీయాలు అలాంటి గొప్ప నేతకు అయోధ్య క్రెడిట్ దక్కకుండా చేయవచ్చేమో కానీ… జన హృదయంలో మాత్రం అయోధ్య అంటే అద్వానీ, అద్వానీ అంటే అయోధ్య…అనేది మాత్రం చెరగని ముద్రగా ఉంది. అయోధ్య రామాలయం రూపు దిద్దుకోడానికి కారకుడైన అద్వానీ పేరు రామాలయం గోడలపై లేకపోవచ్చు… కానీ జనంలో మాత్రం ఎప్పటికీ ఉంటుంది.