Top story: మహారాష్ట్ర బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతేనా ? ఎన్నికల వేళ పార్టీని పట్టించుకునే వారే లేరా ?

అంతన్నారు...ఇంతన్నారు...వరుస ప్రెస్ మీట్లు, బహిరంగ సభలతో ఊదరగొట్టారు. గులాబీ జెండాను ఢిల్లీలో ఎగరేస్తామన్నారు. బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా, ముంబై, పంజాబ్, ఢిల్లీకి వెళ్లారు. ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను కలిశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా...

  • Written By:
  • Publish Date - October 18, 2024 / 06:46 PM IST

అంతన్నారు…ఇంతన్నారు…వరుస ప్రెస్ మీట్లు, బహిరంగ సభలతో ఊదరగొట్టారు. గులాబీ జెండాను ఢిల్లీలో ఎగరేస్తామన్నారు. బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా, ముంబై, పంజాబ్, ఢిల్లీకి వెళ్లారు. ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను కలిశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా…బీఆర్ఎస్ నుంచి ఉలుకు లేదు..పలుకు లేదు. ఇంతకీ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ ఉందా ? లేదా ? ఉంటే ఎందుకు అభ్యర్థులను ప్రకటించలేదు ?

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వరుసగా గెలుపొందింది. కల్లకుంట్ల చంద్రశేఖరరావు…రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో గులాబీ బాస్ కు కాన్ఫిడెన్స్ పెరిగింది. ముఖ్యమంత్రి పదవిపై బోర్ కొట్టిందేమో…! ఇంకా తెలంగాణలో ఎందుకు…మనదిక నేషనల్ లెవల్ అనుకున్నారు. మన సేవలు ఇక ఢిల్లీ స్థాయిలోనే అని ప్రకటించారు. పార్టీ శ్రేణులు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. తమ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదని…జాతీయ పార్టీ అని సంబరపడిపోయారు. జాతీయ రాజకీయాల కోసమే పార్టీ పేరును మార్చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. 2022 అక్టోబరు 5న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును…భారత్ రాష్ట్ర సమితిగా మార్చేశారు. వరుసబెట్టి ప్రాంతీయ పార్టీల నేతలను కలిశారు. కూటమి కడదామని…కలిసి రావాలని కోరారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.

బీఆర్ఎస్ పార్టీని విస్తరించే క్రమంలో…గులాబీ బాస్ కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించారు. కొందరు నేతలను కూడగట్టారు. పనిలో పనిగా హైదరాబాద్ నుంచి నాందేడ్ కు కార్లతో ర్యాలీ తీశారు. నాందేడ్ సభలో హామీల వర్షం కురిపించారు. బహిరంగ సభకు వచ్చిన వారిని చూసి…మరింత రెచ్చిపోయారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మహారాష్ట్రలోని కొందరు నేతలను పార్టీలోకి చేర్చుకున్నారు. బీఆర్ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహారాష్ట్రలోనూ అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. పార్టీ నిధులను భారీగా ఖర్చు చేశారు. మహారాష్ట్రలో పార్టీని సమన్వయం కోసం ఇన్ చార్జ్ లను నియమించారు. వారికి నెలనెల అయ్యే ఖర్చులను పెట్టుకున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 22న ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్‌ 20న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్నాయి. దాదాపు పది కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినా…గులాబీ పార్టీ నుంచి ఉలుకు లేదు…పలుకు లేదు. అసలు ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఊసెత్తడం లేదు. మాజీ సీఎం కేసీఆర్…ఎపుడు ప్రజలకు కనిపిస్తారో ఎవరికి అర్థం కాదు. ఎన్నికల్లో పోటీ చేస్తామన్న గులాబీ దళపతి…నాయకులకు కూడా అందుబాటులో ఉండటం లేదు. పార్టీ కార్యక్రమాలన్నీ మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ చూసుకుంటున్నారు. కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి ఏంటి ? అనే ప్రశ్నలు వస్తే…ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నాడనే సమాధానం వస్తుంది. మిగిలిన నేతలైనా అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారా అంటే అది లేదు. వారికి తెలంగాణ రాజకీయ వ్యవహారాలను చూసుకోవడమే సరిపోతోంది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఆలోచించే టైం ఎక్కడుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఇచ్చిన ఫలితాల నుంచి గులాబీ శ్రేణులు తేరుకోవడం లేదు.

రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్…మూడోసారి సీఎం అవుతానని అనుకున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత…రాష్ట్ర బాధ్యతలను కుమారుడికి అప్పగిద్దామని భావించారు. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు…బీఆర్ఎస్ విస్తరణపై పెద్ద ఎత్తున హడావిడి చేశారు. పార్టీ పేరును మార్చిన తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో….బీఆర్ఎస్ బొక్క బోర్లా పడింది. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో గులాబీ బాస్ కేసీఆర్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అయితే…మరీ దారుణం. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది బీఆర్ఎస్. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన శాసనసభ్యులు…హస్తం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గురించి ఆలోచించే టైం బీఆర్ఎస్ నేతలకు లేదు. ముందు సొంత రాష్ట్రంలో పార్టీని కాపాడుకుంటే చాలనే స్థితిలో ఉన్నారు. నేతలు పార్టీని వీడకుండా చూసుకోవడంతో పాటు అధికార పార్టీని డిఫెన్స్ పడేలా చేయడమే బీఆర్ఎస్ ముందున్న కర్తవ్యం. మహారాష్ట్రలో పార్టీ ఉంటే ఏంటి ? లేకపోతే ఏంటి ? ముందు తెలంగాణలో పార్టీ ఉనికిలో ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత పక్క రాష్ట్రాల గురించి ఆలోచించాలన్న స్థితికి వచ్చేశారు గులాబీ బాస్ కేసీఆర్. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుదామనుకున్న కేసీఆర్ వ్యూహాలు మొత్తం బెడసికొట్టాయి. దీనికి తోడు పార్లమెంట్ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీల నేతలు అటు బీజేపీ, ఇటే కాంగ్రెస్ పొత్తుల్లోకి వెళ్లిపోయాయి. కేసీఆర్ చేసేదేమీ లేక…ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితం అయ్యారు.