బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏమయ్యారు…? రాష్ట్రంలో రాజకీయం రగులుతున్న వేళ ఎందుకు మౌనముద్ర పాటిస్తున్నారు…? అసలు కేసీఆర్ జనానికి కనిపించి ఎన్ని రోజులైంది…? పదవి కోసం కేసీఆర్ ను కేటీఆర్ ఏదో చేసి ఉంటారన్న కొండా సురేఖ వ్యాఖ్యల వెనక అర్థమేంటి,,,?
కేసీఆర్… బీఆర్ఎస్ అధినేత… కాకా దర్శనం జనానికి కరువైంది. ఆయన జనానికి కనిపించి చాలా రోజులైపోయింది. గత ఎన్నికల్లో హస్తం దెబ్బకు కారు పంక్చరైన తర్వాత కేసీఆర్ మీడియాకు మొహం చాటేశారు. అడపాదడపా పార్టీ నేతలతో భేటీ అయ్యేవారు. కానీ ఆ తర్వాత పార్టీ నేతలకు కూడా కనిపించడం లేదు. అప్పుడెప్పుడో కవిత జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కు వెళ్లి తండ్రి ఆశీర్వాదం తీసుకుంది. ఆ వీడియోలో మాత్రమే కేసీఆర్ కనిపించారు. ఆ తర్వాత ఆయన గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కేడర్ కు అందుబాటులో ఉన్నది తక్కువ. కానీ ప్రెస్ మీట్లు లేదా సభలు, ప్రకటనలు ఇలా ఏదో రూపంలో జనానికి కనిపించేవారు. వినిపించేవారు. కానీ ఈసారి మాత్రం బాగా గ్యాప్ వచ్చింది. దీంతో అసలు ఆయనకు ఏమైందన్న ప్రశ్న పార్టీ కేడర్ ను వేధిస్తోంది. దానికి తోడు ఇప్పుడు మంత్రి కొండా సురేఖ కొత్త అనుమానాలు రేపారు.
రాష్ట్రంలో రాజకీయం రగులుతోంది. హైడ్రా మంటలు అంటుకున్నాయి. ఇక రైతు రుణమాఫీపైనా అధికార, విపక్షాల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ సమయంలో కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. హైడ్రాను వ్యతిరేకిస్తూ ఒక్క మాట మాట్లాడలేదు. పోనీ మీడియా ముందుకు రాకపోయినా ఒక్క ప్రకటనైనా విడుదల చేయాల్సింది. అదీ లేదు. అసలు కేడర్ కు ఎలా ముందుకెళ్లాలో దిశానిర్దేశం కూడా చేయలేదు. మొత్తం కేటీఆర్ నడుపుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాత్రమే ఆయన అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ నేతలెవరకీ కేసీఆర్ టచ్ లో లేరని పార్టీ వర్గాలు అంటున్నాయి. సాధారణంగా హైడ్రా లాంటి మంచి అవకాశం వచ్చినప్పుడు పార్టీలు అందిపుచ్చుకుంటాయి. ప్రభుత్వాన్ని ఏకిపారేస్తాయి. అలాంటిది కేసీఆర్ మౌనమే ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. నిజానికి తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్. అసలు స్పందించాల్సి ఆయనే. అసలు నేనంటూ లేను అన్నట్లు వ్యవహరిస్తున్నారు కేసీఆర్.
పదవీకాంక్షతో కేసీఆర్ ను కేటీఆర్ ఏదో చేసి ఉంటారంటూ కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. అసలే కేసీఆర్ కనిపించక అయోమయంలో ఉన్న కేడర్ కు మరిన్ని అనుమానాలు రేపారు కొండా సురేఖ. గత కొన్ని రోజులుగా కొండా సురేఖ ఎపిసోడ్ రాజకీయ రాద్ధాంతానికి కారణమైంది. కేటీఆర్ పై దారుణమైన కామెంట్లు చేశారు. హీరోయిన్లను వివాదంలోకి లాగారు. తన కుటుంబంపై, తన కొడుకుపై ఇంత దారుణంగా మాట్లాడిన తర్వాత కూడా కేసీఆర్ బయటకు రాకపోవడం, దాన్ని ఖండించకపోవడం విచిత్రంగానే ఉంది.
పార్టీని ఏకతాటిపై నడపాలంటే తాను యాక్టివ్ గా ఉండాలని కేసీఆర్ కు తెలుసు. తాను సైడ్ అయితే పార్టీ వర్గాలు విడిపోతుందని కూడా ఆయనకు ఎప్పుడో అర్థమైంది. ఇప్పటికే పార్టీలో నేతల మధ్య కనిపించని దూరం ఉంది. తాను జోక్యం చేసుకోకపోతే అది మరింత పెరుగుతుందని పార్టీని ముంచేస్తుందని కూడా కేసీఆర్ కు తెలుసు. అయినా మౌనముద్ర పాటిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓటమిని కేసీఆర్ ఊహించలేదు. ఆ షాక్ నుంచి బయటపడటానికి చాలాసమయమే పట్టింది. ఆ వెంటనే కవిత అరెస్ట్ ఆయన్ను మరింత కుంగతీసింది. పులిలా బతికిన ఆయన కూతురి బెయిల్ కోసం బీజేపీని బతిమాలుకోవాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని పణంగా పెట్టాల్సి వచ్చింది. కమలం గెలుపు కోసం కారును షెడ్ కు పంపారు. పులిలా ఇంత బతుకు బతికి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం ఆయన్ను మానసికంగా మరింత దెబ్బతీసింది. దీంతో కేసీఆర్ ప్రజలకు మొహం చూపించడానికి ఇష్టం పడటం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను వేధిస్తున్నాయంటున్నారు. త్వరలో తన ప్రతిపక్ష నేత హోదాను కూడా కొడుక్కు కట్టబెట్టి పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారని కూడా మరికొందరు చెబుతున్నారు. కేటీఆర్ ఇప్పటికే పార్టీ వ్యవహారాలు మొత్తం తానే చక్కబెడుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ కేవలం రాజకీయ వ్యూహాలకే పరమితమవుతారని పూర్తిగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే కేసీఆర్ ను నమ్మడానికి లేదు. పనైపోయిందని అందరూ అనుకున్న ప్రతిసారీ మళ్లీ ఫీనిక్స్ లా పుట్టుకొచ్చారు. ఉద్యమ సమయం నుంచి ఆయన వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ప్రస్తుతానికి తన టైమ్ సరిగా లేదు కాబట్టి మౌనంగా ఉండి ఉండొచ్చు. పరిస్థితి ఏ మాత్రం మారినా మళ్లీ మొత్తం తన కంట్రోల్ లోకి తీసుకున్నా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. మరి కొన్ని నెలల్లో కేసీఆర్ వ్యూహమేంటన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.