కొడాలి నాని ఎక్కడ? రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి..! దేశం దాటేసాడా?

ఆయన నోరు తెరిస్తే బూతుల సునామీ... చంద్రబాబుని ఆయన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆయనే ఆ పార్టీ అధినేతకు మొదటి చాయిస్, సందర్భం ఏదైనా, ప్రదేశం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా... చంద్రబాబుని తిట్టాలంటే నాతో ఎవరూ పోటీ పడలేరని తన మాటలతోనే ప్రూవ్ చేయడం ఆయన శైలి.

  • Written By:
  • Publish Date - September 1, 2024 / 05:35 PM IST

ఆయన నోరు తెరిస్తే బూతుల సునామీ… చంద్రబాబుని ఆయన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆయనే ఆ పార్టీ అధినేతకు మొదటి చాయిస్, సందర్భం ఏదైనా, ప్రదేశం ఎక్కడైనా, సమయం ఎప్పుడైనా… చంద్రబాబుని తిట్టాలంటే నాతో ఎవరూ పోటీ పడలేరని తన మాటలతోనే ప్రూవ్ చేయడం ఆయన శైలి. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి… పక్కా మాస్ లీడర్. మీకు ఎవరో అర్ధమయ్యే ఉంటుంది కదా…? ఆయనే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానీ… ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాన్ని 20 ఏళ్ళ పాటు శాసించిన నాయకుడు.

కాని ఇప్పుడు ఆచూకీ లేకుండా తిరుగుతున్నారు నానీ. ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో, ఎప్పుడు బయటకు వస్తాడో ఏ ఒక్క సమాచారం కూడా ఆ పార్టీ కార్యకర్తలకు గాని ఆయన ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకు గాని తెలియదు. 2024 ఎన్నికలకు ముందు వరకు కొడాలి నానీ అంటే ఒక బ్రాండ్, కొడాలి నానీ అంటే ఒక సంచలనం. కాని ఇప్పుడు ఆ బ్రాండ్ ఏ మూలన దాక్కుంది అంటూ తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నో విమర్శలు చేస్తున్నా ఆయన మాత్రం కనపడటం లేదు. ఫర్నీచర్ విషయంలో జగన్ పై టీడీపీ ఆరోపణలు చేసినప్పుడు నానీ బయటకు వచ్చి మాట్లాడారు.

ముష్టి ఫర్నీచర్ అంటూ ఏం పీకలేరు అంటూ ఏదేదో మాట్లాడారు. కాని తర్వాత కొడాలి నానీ గురించి వార్తలే గాని మనిషి మాత్రం కనపడలేదు. వాలంటీర్లను గుడివాడలో బలవంతంగా రాజీనామా చేయించారు అంటూ ఆయనపై కేసు నమోదు అయింది. రాజీనామాలు చేసిన మాజీ వాలంటీర్లు ఆయనపై కేసు పెట్టారు. ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అలాగే గుడివాడలో ఆయన అక్రమాలు చేసారనే ఆరోపణల నేపధ్యంలో వాటిపై కూడా పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు అంటూ మాజీ మంత్రులను గురి పెడుతూ వస్తున్నారు.

పెద్దిరెడ్డి, కారుమూరి, ఆర్కే రోజా ఇలా ఒక్కొక్కరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. కొడాలి నానీ మీద రేషన్ బియ్యం అక్రమాల విచారణ కూడా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీని మీద మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి పెట్టారు. త్వరలోనే ముఖ్యమంత్రి కలిసి నివేదిక ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనితో ఇప్పుడు కొడాలి నానీలో ఆందోళన మొదలైందనే వార్తలు వినపడుతున్నాయి.

అంతర్గత విచారణ అనంతరం ఏ క్షణమైనా నానీని అరెస్ట్ చేయవచ్చని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే ఎన్ని జరుగుతున్నా నానీ బయటకు రావడం లేదు. సొంత నియోజకవర్గంలో… గుడ్లవల్లేరు కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారం పెద్ద దుమారం రేపింది. అయినా సరే నానీ మీడియా ముందు కనపడి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో గాని, ప్రభుత్వ నిర్ణయాల విషయంలో గాని నానీ నుంచి ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా లేదు. దీనితో నానీ అసలు దేశంలో ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సందర్భం లేకుండా అయినా తిట్టే సామర్ధ్యం ఉన్న నానీ… ఎన్నో సందర్భాలు వచ్చినా తిట్టే ప్రయత్నం చేయడం లేదు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో కలిసి ఆయన అమెరికా వెళ్ళిపోయి ఉండవచ్చని అంటున్నాయి రాజకీయ వర్గాలు. నానీని అరెస్ట్ చేస్తే ఆయనకు జరిగే ట్రీట్మెంట్ కాస్త భయంకరంగా ఉండే అవకాశం ఉందని పలువురు ఘాటు వ్యాఖ్యలే చేసారు. నానీకి బెయిల్ కూడా రాని కేసుల్లో జైల్లో పెట్టె అవకాశం ఉందనే ప్రచారం సైతం జరిగింది. అందుకే నానీ భయపడి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఇక తన రాజకీయ జీవితంపై కూడా నానీకి పెద్ద ఆశలు ఏమీ లేవు. గతంలోనే ఆయన తాను చివరిసారి పోటీ చేస్తున్నా అంటూ మాట్లాడారు.

ఎలాగో రాజకీయాల్లో కూడా ఆసక్తి లేకపోవడంతో నానీ పూర్తిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి ఉండవచ్చనే ప్రచారం సైతం జరుగుతోంది.. అటు అనారోగ్య సమస్యలు కూడా నానీని వెంటాడుతున్నాయని సమాచారం. అనారోగ్య సమస్యల కారణంగా ఆయన పంజాబ్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స తీసుకోవడానికి మొహాలిలో ఉంటున్నారనే వార్తలు సైతం వస్తున్నాయి. ఒకవైపు రాజకీయాల మీద ఆసక్తి లేకపోవడం, మరో వైపు అనారోగ్య సమస్యలు, ఇంకో వైపు కేసుల భయంతో నానీ ఎవరికి కనపడటం లేదని కథనాలు వస్తున్నాయి.

కూతుళ్ళ భవిష్యత్తు మీద ఇప్పుడు ఫోకస్ చేసారని, త్వరలోనే సినీ పరిశ్రమకు చెందిన ఒక వ్యక్తితో తన కుమార్తె వివాహం చేస్తారని కూడా గుడివాడ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇక కుటుంబ సభ్యుల ఒత్తిడి కూడా నానీ మీద ఉంది. గతంలో కుటుంబం అభ్యంతరం చెప్పినా నానీపై ఉన్న ఒత్తిడి కారణంగా విమర్శలు చేయాల్సిన పరిస్థితి. అప్పుడంటే ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన విమర్శలు చేసినా చెల్లింది. ఇప్పుడు విమర్శలు చేస్తే మాత్రం కచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే. అప్పుడు కుటుంబంపై ఒత్తిడి బాగా పెరిగే అవకాశం ఉంది.

ఇప్పుడున్న పరిస్థితిలో నానీని వైసీపీ ఎంత వరకు కాపాడుకుంటుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్ రావడానికే దాదాపు 2 నెలలు పట్టింది. కొందరు నేతలను అదుపులోకి తీసుకునే అవకాశం కనపడుతోంది. ఒకవైపు పార్టీ నేతలు జారిపోతున్నారు. ఈ సమయంలో జగన్ కు నేతలను కేసుల నుంచి కాపాడుకోవడం అనేది అగ్ని పరీక్ష అవుతుంది. అందుకే ఇవన్నీ ఆలోచించుకునే నానీ సైలెంట్ గా దేశం గాని రాష్ట్రం గాని దాటారని సమాచారం.

నియోజకవర్గ నేతలతో కూడా నానీ మాట్లాడటం లేదని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడు నానీ గనుక బయటకు రాకపోతే గుడివాడలో వైసీపీ దాదాపుగా చచ్చిపోయినట్టే అవుతుంది. పార్టీకి ఆయన తర్వాత బలమైన నేత ఎవరూ నియోజకవర్గంలో లేరు. ఇప్పుడు టీడీపీ గుడివాడను ఎలా అయినా వదులుకోవద్దనే పట్టుదలతో ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాగా వేయాలని కష్టపడి పని చేస్తున్నారు. నానీ మినహా వైసీపీకి అక్కడ ప్రత్యామ్నాయం కనపడటం లేదు. ఇక వైసీపీ నేతలు కూడా ఆ పార్టీకి ఎంత వరకు అంటిపెట్టుకుని ఉంటారనేది చెప్పలేని పరిస్థితి. మరి నానీ భవిష్యత్తులో అయినా కనపడతారా లేక పార్టీకి రాజకీయాలకు, తనను ఆదరించిన గుడివాడ ప్రజలకు దూరంగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.