PM Modi: ఎవరు ఎవరికి సమాధి తవ్వుతున్నారు మోదీజీ..!?

బీజేపీ దెబ్బకు చిన్నాచితకా పార్టీలే కాదు కాంగ్రెస్ లాంటి వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సైతం కనుమరుగైపోతోంది. మోదీ-అమిత్ షాలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరుండి సమాధి కడుతున్నారని అందరూ భావిస్తున్నారు. అలాంటిది తమకే కాంగ్రెస్ పార్టీ సమాధి కడుతోందని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉంది.

  • Written By:
  • Publish Date - March 13, 2023 / 02:04 PM IST

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఈసారి అధికారంకోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కర్నాటకపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మోదీ ఇప్పటికే రెండుసార్లు కర్నాటకలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ.. పనిలోపనిగా ఎన్నికల ర్యాలీల్లోనూ పాల్గొంటున్నారు.

తాజాగా కర్నాటకలో పర్యటించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తనకు కాంగ్రెస్ పార్టీ సమాధి తవ్వుతోందని సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని ఇలా మాట్లాడడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. కొంతకాలం క్రితం ప్రధాని మోది పార్లమెంటులో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ఇదే కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేంత వరకూ తాను నిద్రపోనని, తన హయాంలోనే ఆ పని చేస్తానని మోదీ శపథం చేశారు. ఇప్పుడు కర్నాటకలో ఏమో తనకే కాంగ్రెస్ పార్టీ సమాధి తవ్వుతోందని కామెంట్ చేసి ఆశ్చర్యానికి గురి చేశారు.

వాస్తవానికి కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీకి సమాధి తవ్వుతోంది బీజేపీ. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని కబ్జా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీని చీల్చి.. ఆ పార్టీని వీక్ చేస్తోంది. నయానో భయానో వారిని లొంగదీసుకుంటోంది బీజేపీ. దీంతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది. కాస్తోకూస్తో మిగిలిన రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలపై సీబీఐ, ఈడీ లాంటి వాటిని ప్రయోగించి భయపెడుతోంది. ఇలా కాంగ్రెస్ పార్టీని అన్ని రకాలుగా అణచివేసి.. ఆ పార్టీ నేతలను బెంబేలెత్తించి బీజేపీ లబ్ది పొందుతోందన్నది వాస్తవం.

కానీ మోదీ మాత్రం తనకు కాంగ్రెస్ పార్టీ సమాధి తవ్వుతోందని చెప్పి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేలా చేశారు. దేశంలో బీజేపీ బలపడేందుకు ఆ పార్టీ నేతలు ఎలాంటి ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారనేది అందరికీ తెలుసు. అధికారంలో ఉన్న పార్టీలను సైతం చీల్చి సీఎం కుర్చీలను లాక్కొంటోంది కమలం పార్టీ. ఆ పార్టీ దెబ్బకు చిన్నాచితకా పార్టీలే కాదు కాంగ్రెస్ లాంటి వందేళ్ల చరిత్ర కలిగిన పార్టీ సైతం కనుమరుగైపోతోంది. మోదీ-అమిత్ షాలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరుండి సమాధి కడుతున్నారని అందరూ భావిస్తున్నారు. అలాంటిది తమకే కాంగ్రెస్ పార్టీ సమాధి కడుతోందని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉంది.