ధేశ పారిశ్రామిక సామ్రాజ్యంలో ఓ శకం ముగిసింది. టాటా వ్యాపార సామ్రాజ్య పునాదుల్ని పటిష్ఠం చేసిన రతన్ టాటా అస్తమించారు. మరి టాటా సామ్రాజ్య వారసుడెవరు..? లక్షల కోట్ల విలువైన ఆ సంస్థను నడపబోయేది ఎవరు…? రతన్ టాటా తన వారసుడ్ని ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారా…?
టాటా గ్రూప్ విలువ అక్షరాలా 30లక్షల కోట్లు. ఇన్నాళ్లూ తన నాయకత్వం, దార్శనికత్వంతో ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపారు రతన్ టాటా. ఇప్పుడాయన మరణంతో టాటా గ్రూప్ తదుపరి నాయకుడెవరనేదానిపై చర్చ మొదలైంది. రతన్ బతికున్నప్పుడు తన వారుసుడ్ని ప్రకటించలేదు. గతంలో టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ ఛైర్మన్లుగా ఒకరే ఉండేవారు. కానీ రతన్ టాటా దాన్లో మార్పులు చేశారు. ప్రస్తుతం ప్రస్తుతం టాటా సన్స్ నాయకత్వ బాధ్యతలు ఎన్. చంద్రశేఖరన్ చేతుల్లో ఉన్నాయి. అంతకుముందు ఆయన టీసీఎస్ ఛైర్మన్ గా ఉన్నారు. అంతకుముందు సైరన్ మిస్త్రీ టాటా సన్స్ ఛైర్మన్ గా ఉన్నారు. కానీ కొన్ని కారణాలతో ఆయన్ను తప్పించారు.
రతన్ టాటా వారసుడిగా రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన తెలుగు కుర్రాడు శంతన్ పేరు కూడా కొందరు చెబుతున్నారు. అయితే శంతను రతన్ టాటాకు సహయకారిగా ఉన్నారు. టాటా గ్రూప్ లో కూడా ముఖ్యమైన పోస్టులోనే ఉన్నారు కానీ శంతను సమర్ధుడైనప్పటికీ టాటా గ్రూపు పగ్గాలు ఆయనకు దక్కే అవకాశాలు లేవు. అలాగే టీవీఎస్ గ్రూప్ అధిపతి వేణు శ్రీనివాసన్, రక్షణశాఖ మాజీ కార్యదర్శి విజయ్ సింగ్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కానీ వారికి కూడా అవకాశం లేనట్లు తెలుస్తోంది. సాధారణంగా టాటా గ్రూపు నాయకత్వాన్ని టాటాలు లేదా పార్సీ కమ్యూనిటికీ చెందిన వారికే అప్పగించడం వారసత్వంగా వస్తోంది.
టాటా గ్రూప్ బాధ్యతలు రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ టాటా పేరు తదుపరి నాయకుడిగా ప్రముఖంగా వినిపిస్తోంది. రతన్ టాటా తండ్రి నావల్ టాటాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుమారుడు రతన్, రెండో భార్య కుమారుడు నోయల్. రతన్ టాటా అవివాహితులు. దీంతో వారసత్వం కోసం నోయల్ టాటా కుటంబం ముందు వరుసలో ఉంది. ఇక నోయల్ టాటా భార్య ఆలూ మిస్త్రీ,.. పల్లోంజీ మిస్త్రీ కుమార్తె. పల్లోంజీ గ్రూపుకు టాటా సన్స్ లో వాటాలున్నాయి. రెండు కుటుంబాలతో అనుబంధం ఆయన్ను టాటా గ్రూప్ సారథ్య బాధ్యతలకు చేరువ చేస్తోంది. ఆయనకు టాటా సంస్థల్లో 40ఏళ్ల అనుభం ఉంది. పలు సంస్థల్లో ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. టాటా గ్రూప్ రీటైల్ విభాగం ట్రెంట్ బాధ్యతలు ఆయనే చూస్తున్నారు. టాటా అంతర్జాతీయ వ్యవహారాలు కూడా తనే చూస్తారు. గ్రూపులో ఆయనకు చాలా మంది పేరుంది. అలాగే చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు.
మెహర్ జీ పల్లోంజీ గ్రూప్ డైరెక్టర్ మెహ్లీ మిస్త్రీ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన రతన్ టాటాకు అత్యంత సన్నిహితులు. దివంగత సైరన్ మిస్త్రీకి కజిన్. వ్యాపార సవాళ్లను ఎదుర్కోవడంలో ఆయన అందెవేసిన చేయి. ఇక నోయల్ టాటా పిల్లల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆయన పెద్ద కుమార్తె లెహ్ టాటా, రెండో కుమార్తె మాయా టాటా, కొడుకు నెవల్ టాటా పేర్లు కూడా బిజినెస్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. అయితే వీరికి అంత అనుభవం లేదు. దీంతో నోయల్ టాటాకే వారసత్వం దక్కే అవకాశాలున్నాయి.
రతన్ టాటా వారసుడ్ని డిసైడ్ చేయాల్సింది ట్రస్టీలే. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్టులకు టాటా సన్స్ లో 66శాతం వాటా ఉంది. దీంతో గ్రూపు నాయకుడ్ని ఎంపిక చేయాల్సిన బాధ్యత ఈ ట్రస్టుల డైరెక్టర్లపైనే ఉంది. 13మంది ట్రస్టీలు త్వరలో సమావేశమై నిర్ణయం తీసుకుంటారు. ముందుగా తాత్కాలికంగా ఓ పేరు ప్రకటించి తర్వాత పూర్తిస్థాయి నాయకుడిని ప్రకటించే అవకాశం ఉంది. రతన్ టాటా వారసుడ్ని ప్రకడించడం అంత ఆశామాషీ కాదు. ఆ గ్రూపును నడపడం అంటే దానిపై ఆధారపడిన కొన్ని లక్షల కుటుంబాలను కాపాడటమే. అందుకే చాలా తర్జనభర్జనల తర్వాతే కొత్త నాయకుడి పేరు ప్రకటించే అవకాశం ఉంది.