Haryana: హర్యానా.. మరో మణిపూర్‌గా మారుతుందా ? చిచ్చు పెట్టి చలికాచుకుంటున్నారా ?

మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన సమయంలో మత ఘర్షణలు హర్యానా రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. నిప్పు లేనిదే పొగరాదంటారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తరహా విధ్వంసం తెరపైకి వస్తోంది. ఓట్లను పోలరైజ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా..?

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 02:25 PM IST

Haryana: మణిపూర్ చిచ్చు ఇంకా చల్లారనేలేదు. ఈశాన్య రాష్ట్రానికైన గాయం ఇంకా మాననేలేదు. మహిళలను నగ్నంగా ఊరేగించిన కిరాతకులకు శిక్ష పడనేలేదు. ఈలోపే మరో రాష్ట్రంలో మత అగ్గి రాజుకుంది. అది కూడా బీజేపీ పాలిత రాష్ట్రం కావడం కాకతాళీయమేమీ కాదు. అక్కడా ఇక్కడా ఉన్నది డబుల్ ఇంజన్ సర్కారే. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన సమయంలో మత ఘర్షణలు హర్యానా రాష్ట్రాన్ని చుట్టుముట్టాయి. నిప్పు లేనిదే పొగరాదంటారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తరహా విధ్వంసం తెరపైకి వస్తోంది. ఓట్లను పోలరైజ్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా..? రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి అందులో ఎవరైనా చలి కాచుకుంటున్నారా..? ఇంతకీ హర్యానాలో ఏం జరుగుతోంది..? మత ఘర్షణలకు బాధ్యులెవరు..?
అసలు సోమవారం ఏం జరిగింది..?
హర్యానాలోని నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఓ ఊరేంగిపు చేపట్టింది. దాని పేరు బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్ర. ఉదయం నుంచి రాత్రి వరకు జిల్లాలోని వివిధ దేవాలయాలను టచ్ చేస్తూ ఈ యాత్ర సాగాలి. ఉదయం పది గంటల సమయంలో పెద్ద ఎత్తున విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఒక్క చోట చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కొంతమంది నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అంతే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఆధ్యాత్మికంగా సాగాల్సిన యాత్ర మత ఘర్షణలకు దారి తీసింది. గంటలు గడిచే కొద్దీ ఈ చిచ్చు జిల్లా మొత్తం వ్యాపించింది. హర్యానా ప్రభుత్వం వెంటనే ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సాయంత్రం 6 దాటే సరికి సరిహద్దుల్లో ఉన్న గుర్‌గ్రామ్‌కు కూడా ఘర్షణలు వ్యాపించాయి. హర్యానాలోని సమస్యాత్మక ప్రాంతాలతో పాటు గుర్‌గ్రామ్, ఫరీదాబాద్‌లలో 144 సెక్షన్ విధించారు. పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు.
ఘర్షణలకు ముందే పథకం వేశారా..?
హర్యానాలో మత ఘర్షణలు పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు వర్గాల మధ్య భారీగా మారణాయుధాలు గుర్తించినట్టు పోలీసులు చెబుతున్నారు. విశ్వహిందూ పరిషత్ యాత్ర ప్రారంభించాలనుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఆవుల అక్రమ రవాణాను అడ్డుకునే వ్యక్తిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే బజరంగ్ దళ్ నేత మోను మనేశ్వర్ సర్క్యులేట్ చేసిన వీడియో ఉద్రిక్తతలకు దారితీసింది. బ్రిజ్ మండల్ జలాభిషేక్ యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని ఆయన పిలుపిచ్చారు. ఇద్దరు ముస్లింలను హత్య చేసినట్టు ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీంతో ఏదో జరగబోతోందన్న సంకేతాలు రాష్ట్ర యంత్రాంగానికి అందినా.. ఘర్షణలను నివారించలేకపోయారు. రెండు వర్గాలు రాళ్లు, మారణాయుధాలతో విరుచుకుపడినా పోలీసులు ఘర్షణలను అడ్డుకోలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మత ఘర్షణల మరణాలకు బాధ్యులెవరు..?
హర్యానా మత ఘర్షణల్లో ముస్లిం మత పెద్దతో పాటు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల వ్యవధిలోనే భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మసీదులకు నిప్పు పెట్టారు. మత ఘర్షణలకు బాధ్యులను చేస్తూ ఇప్పటి వరకు పోలీసులు 116 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. హర్యానాలో చోటుచేసుకున్న పరిణామాలపై హిందుత్వ సంస్థలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టాయి. నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. హర్యానాలో ఈ ఘర్షణలు ఎప్పటికి సద్దుమణుగుతాయో కూడా చెప్పలేని పరిస్థితి. మత చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ది పొందేందుకు కొంతమంది ఎంచుకున్న మార్గం ప్రాణాలు తీస్తోంది.
మణిపూర్.. హర్యానా.. నెక్ట్స్ ఢిల్లీనా..?
నిప్పు ఎవరో రాజేస్తారు. ఫలితం ఇంకెవరో అనుభవిస్తారు. మణిపూర్, హర్యానాలో చోటుచేసుకుంటున్నపరిణామాలను గమనిస్తే వీటి వెనుక రహస్య రాజకీయ ఎజెండా ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఈశాన్య రాష్ట్రంలో గిరిజన తెగల మధ్య వివాదం రాజుకుంటే.. హర్యానాలో మత ఘర్షణలు చెలరేగాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ మొత్తం ఇవి వ్యాపించాయి. ఢిల్లీ నడిబొడ్డుకు కూడా వ్యాపిస్తే.. అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. రాజకీయాలకు అతీతంగా సమస్యలను అర్థం చేసుకోకపోతే.. రాష్ట్రాలు తగలబడుతూనే ఉంటాయి. అందులో చలికాచుకునేది ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.