TOP STORY: ఎవరు ఈ సిద్దిఖీ…?నెక్స్ట్ టార్గెట్ సల్మానేనా…?

ముంబయిలో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి సిద్దిఖీ హత్య బాలీవుడ్ లో టెన్షన్ రేపింది..? బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానేనా...? ఇది కేవలం ట్రైలరేనా...? అసలు సినిమా ముందుందా...? ఇంతకీ ఎవరీ బాబా సిద్దిఖీ... సల్మాన్ ఖాన్ తో అంత క్లోజ్ రిలేషన్స్ ఎలా ఏర్పడ్డాయి...?

  • Written By:
  • Publish Date - October 14, 2024 / 06:21 PM IST

ముంబయిలో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి సిద్దిఖీ హత్య బాలీవుడ్ లో టెన్షన్ రేపింది..? బిష్ణోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానేనా…? ఇది కేవలం ట్రైలరేనా…? అసలు సినిమా ముందుందా…? ఇంతకీ ఎవరీ బాబా సిద్దిఖీ… సల్మాన్ ఖాన్ తో అంత క్లోజ్ రిలేషన్స్ ఎలా ఏర్పడ్డాయి…?

ముంబయి, మాఫియా, మర్డర్స్ ఈ మూడు ఒకదానికొకటి రిలేటెడ్. ముంబయిలో హత్యలు మామూలే. కానీ ఈసారి చంపింది మాత్రం ఓ మాజీ మంత్రిని. అది కూడా సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన సిద్దిఖీని. దీంతో ఈ మర్డర్ పొలిటికల్ సర్కిల్స్ లోనే కాదు బాలీవుడ్ లోనూ ప్రకంపనలు రేపింది. భారీ భద్రతలో ఉండే సిద్దిఖీని లేపేసి సల్మాన్ ఖాన్ కు సవాల్ విసిరింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్. నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని వార్నింగ్ ఇచ్చింది. నిజానికి బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ను చాలాకాలంగా వెంటాడుతోంది. చంపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. గతంలో సల్లూభాయ్ అదృష్టం కాస్త బాగుండి రెండు, మూడుసార్లు హత్యాయత్నాల నుంచి బయటపడ్డాడు. సల్మాన్ ఇంటిపై కూడా కాల్పులు జరిపారు. అసలు సెక్యూరిటీ లేకుండా సల్మాన్ ఇంటినుంచి బయటకు కూడా రాలేనంత భయం కలిగించింది బిష్ణోయ్ గ్యాంగ్. సల్మాన్ తో క్లోజ్ గా ఉండే ఎవరైనా తమకు శత్రువులే అని ఇటీవలే బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఇప్పుడు సిద్దిఖీని చంపేసి సల్మాన్ కు సవాల్ విసిరింది.

సిద్దిఖీ కాస్త రఫ్ క్యారెక్టరే.. ముంబయిలో మాఫియా రాజ్యమేలుతున్న సమయంలో తన 17 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తరపున కార్పొరేటర్ గా గెలిచి బాంద్రా ఏరియాలో కీ లీడర్ గా ఎదిగారు. సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ కూడా కాంగ్రెస్ నేత కావడంతో ఆయనతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పట్నుంచే బాలీవుడ్ తో పరిచయాలు పెరిగాయి. సెటిల్ మెంట్ కింగ్ గా మారారు. ఆయనకు తెలియకుండా బాంద్రాలో ఏం జరగని స్టేజ్ కు ఎదిగారు. 1999లో తొలిసారి బాంద్రా వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004-2008 మధ్య విలాస్ రావ్ దేశ్ ముఖ్ సర్కార్ లో మంత్రిగా పనిచేశారు, 2014లో ఓడిపోయారు. అయినా కాంగ్రెస్ లో చక్రం తిప్పుతూ వచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో హఠాత్తుగా కాంగ్రెస్ ను వీడి ఎన్సీపీలో చేరారు. ఆయన కుమారుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు.

సిద్దిఖీ భారీ ఇఫ్తార్ విందులకు పెట్టింది పేరు. రంజాన్ సమయంలో ఆయన ఇచ్చే విందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్, పొలిటీషియన్స్ అంతా హాజరయ్యేవారు. సిద్దిఖీ మరణవార్త తెలిసి నటి శిల్పాశెట్టి బోరున ఏడ్చారట. బిగ్ బాస్ షూటింగ్ ను రద్దు చేసుకుని మరీ సల్మాన్ ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు బాలీవుడ్ లో ఎంత సత్సంబంధాలున్నాయో వీటినిబట్టి అర్థమవుతోంది. ఇలాంటి ఓ ఇఫ్తార్ విందులోనే సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లను కలిపి వారిమధ్య ఉన్న కోల్డ్ వార్ కు ముగింపు పలికారు సిద్దిఖీ.

సిద్దిఖీకి తనకు లైఫ్ త్రెట్ ఉందన్న విషయం తెలుసు. 15రోజుల క్రితమే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వై కేటగిరి భద్రత కల్పించారు. కానీ ఆ సెక్యూరిటీ కూడా ఆయన్ను కాపాడలేకపోయింది. శనివారం రాత్రి తన కొడుకు ఆఫీసు దగ్గర ఉన్న సమయంలో నలుగురు షూటర్స్ ఆయనపై తుపాకీ ఎక్కుపెట్టారు. పాయింట్ బ్లాంక్ లో గన్ పేల్చారు. మూడు తూటాలు బాడీలోకి దూసుకెళ్లి అక్కడికక్కడే చనిపోయారు. దసరా సందర్భంగా బాణాసంచా పేలుస్తుండటంతో ఆ సౌండ్ లో ఇదీ కలిసిపోయింది. సిద్దిఖీ మరణవార్త ముంబయిలో బాంబులా పేలింది.

సిద్దిఖీని తామే చంపామని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. పట్టుబడిన షార్ప్ షూటర్లు ఇద్దరు కూడా తమది బిష్ణోయ్ గ్యాంగేనని పోలీసులకు చెప్పారు. జనం కూడా అదే నమ్ముతున్నారు. ఎందుకంటే సల్మాన్ తో సిద్దిఖీకి ఉన్న స్నేహమే ఆయన్ను చంపేసిందని భావిస్తున్నారు. బిష్ణోయ్ గ్రూపు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును పరిశీలిస్తున్నారు పోలీసులు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ జైల్లో ఉన్నాడు. అయితే అమెరికాలో ఉన్న అతడి సోదరుడు ఈ గ్యాంగ్ ను రిమోట్ లో నడిపిస్తున్నాడు. వ్యాపార విబేధాలు కూడా ఈ హత్యకు కారణం కావొచన్న అనుమానాలున్నాయి. 2000-2004 మధ్య మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా ఉన్నారు సిద్దిఖీ, ఆ సమయంలోనే మురికివాడ పునరావాస ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. పదులు కాదు వందలు కాదు ఏకంగా 2వేల కోట్ల రూపాయల మేర స్కామ్ జరిగినట్లు చెబుతున్నారు. ఆ కేసులోనే ఈడీ ఆయనపై విచారణ జరుపుతోంది. 462కోట్ల రూపాయల ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఈ ప్రాజెక్టు విషయంలో భాగస్వాములతో వివాదాలున్నట్లు తెలుస్తోంది. అవి కూడా హత్యకు కారణం కావొచ్చని భావిస్తున్నారు. ఇక డీ గ్యాంగ్ కూడా కారణం కావొచ్చని మరికొందరు అనుమానిస్తున్నారు.

సిద్దిఖీని చంపింది ఎవరైనా సల్మాన్ ఖాన్ కు మాత్రం సవాల్ విసిరారు. నిజంగా అది బిష్ణోయ్ గ్యాంగ్ పనే అయితే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా సల్మాన్ ఖానే.