Telangana BJP: తెలంగాణ బీజేపీలో సీఎం అభ్యర్థి అతనేనా..?

బీఆర్ఎస్‌ విషయంలో క్లారిటీ ఉన్నా.. కాంగ్రెస్‌, బీజేపీ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం తెలంగాణలో బీజేపీ సీఎం ఫేస్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

  • Written By:
  • Publish Date - August 17, 2023 / 01:58 PM IST

Telangana BJP: తెలంగాణలో ఎన్నికల హడావుడి పీక్స్‌కు చేరింది. పార్టీలన్నీ అధికారం మీద ధీమాగా ఉన్నాయి. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ కాస్త స్లో అయినట్లు కనిపించినా.. అమిత్ షా ఎంట్రీతో తగ్గేదే లే అంటోంది. క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆర్భాటం లేకుండా పనికానిచ్చేస్తోంది కమలం పార్టీ. ఇదంతా ఎలా ఉన్నా.. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అనే చర్చ జనాలతో పాటు రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్‌ విషయంలో క్లారిటీ ఉన్నా.. కాంగ్రెస్‌, బీజేపీ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరు అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

కాంగ్రెస్ సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ మాత్రం తెలంగాణలో బీజేపీ సీఎం ఫేస్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల్లో అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే మూడు నెలల్లో జనాలను ఆకర్షించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరై ఉంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. బీఆర్ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ను ఢీకొట్టగల, సమర్థవంతమైన అభ్యర్థి బీజేపీలో ఉన్నారా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. బీజేపీలో బలమైన నాయకులు చాలామందే ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి కీలక ప్రకటన రావాల్సి ఉంది. అలా చేస్తేనే జనాల్లో కూడా పార్టీకి మైలేజ్ వస్తుంది. సెప్టెంబర్‌లో యాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సెప్టెంబర్ 17 నుంచి బస్సు యాత్రలను చేపట్టనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు.

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఆగస్టు 27నాటికి స్పష్టత వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా బహిరంగ సభకు హాజరుకావడం, రాష్ట్ర పార్టీ నేతలతో చర్చలు జరిపే అవకాశం వల్ల సీఎం ముఖంపై పార్టీ నుంచి కీలక ప్రకటన రానుందని తెలుస్తోంది. పార్టీలో అంతమంది కీలక నేతలు ఉన్నా.. ఒక్క వ్యక్తికి సంబంధించిన నాయకత్వం గురించి కూడా బీజేపీలో చర్చ జరుగుతూ ఉంది. తాము అనుసరించాల్సిన నాయకుడు ఎవరనే విషయంపై కూడా బీజేపీ కార్యకర్తల్లో ఒక క్లారిటీ రావాలని బీజేపీ నేతలు అంటున్నారు.