TDP: ఊపు వస్తుందనుకున్న సమయంలో.. టీడీపీకి తగిలిన దెబ్బ మాములుది కాదు. చంద్రబాబు అరెస్ట్ కావడం.. లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం.. టీడీపీ శ్రేణులంతా చంద్రబాబు అరెస్ట్ మీదే ఫోకస్ చేయడం.. ఇలాంటి పరిణామాలతో సైకిల్ పార్టీ అసలు టార్గెట్ పక్కదారి పట్టినట్లు కనిపిస్తోంది. లెక్క తీసి కొడితే.. ఏపీలో ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉంది అంతే! ఇలాంటి సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులంతా.. పార్టీ బలోపేతం గురించి పట్టించుకోకుండా.. అధినేత గురించి కష్టపడటం.. ఎన్నికల్లో నెగిటివ్ ఫలితాలకు కారణం అయ్యే అవకాశం ఉంటుంది.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. రాష్ట్రంలో పార్టీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. లోకేశ్ ఢిల్లీకి పరిమితం అయ్యారు. అచ్చెన్నాయుడు పరిమితంగానే కనిపిస్తున్నారు. బ్రాహ్మణి, భువనేశ్వరి పార్టీలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఐతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో.. లోకేస్‌ను నిందితుడిగా చేర్చింది సీఐడీ. ఈ కేసులో లోకేశ్ అరెస్ట్ అవడం ఖాయం అంటూ ప్రచారం ఊపందుకుంది. నిజంగా అదే జరిగితే.. టీడీపీకి దిక్కెవరు అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. స్కిల్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత పార్టీ బాధ్యతలను లోకేశ్ మోస్తున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో సీఐడీ లోకేశ్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే.. పరిస్థితి ఏంటనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. టీడీపీ పగ్గాలు ఎవరు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాలను ముందే ఊహించే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించిందా అనే సందేహాలు వినిపిస్తున్నాయ్. మరోవైపు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు.. బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించి ఆమె నేతృత్వంలో పనిచేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్రాహ్మణి ఒక్కరికే ఈ పార్టీ బాధ్యతలు మోయగల సత్తా ఉందని పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. ఇలా తెలుగు తమ్ముళ్లను కొత్త కొత్త టెన్షన్లు వెంటాడుతున్నాయ్. చంద్రబాబు అరెస్ట్ తర్వాత సింపథీ ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే.. పార్టీ పరంగా సైకిల్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనిపిస్తున్నాయ్.