111 GO: 111 జీవో.. ఇప్పుడు తెలంగాణ మొత్తం పదేపదే తలుచుకుంటున్న పదం ఇదే. ఈ జీవోను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. హెచ్‌ఎండీఏ నిబంధనలే ఆ ప్రాంతాల్లోనూ వర్తిస్తాయి. ఈ విషయంపై మొన్న కేబినెట్ మీటింగ్ తర్వాత హరీష్ ఓ మాట అనేశారు. దీంతో అసలేంటీ 111జీవో.. రద్దు చేస్తే లాభం ఏంటి.. చేయకపోతే నష్టం ఏంటి.. అసలు లాభం ఎవరికి.. నష్టం ఎవరికి.. ఇలా రకరకాల చర్చ జరుగుతోంది. ఈ జీవో రద్దుతో ఇప్పటికిప్పుడు సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు. కోటీశ్వరుడిని మరింత కోటీశ్వరుడిగా చేయడం తప్ప అసలు ఈ జీవో వల్ల లాభం ఉందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయ్. 84 గ్రామాల్లో లక్షా 32వేల 6వందల ఎకరాల భూమి 111జీవో పరిధిలోకి వస్తుంది.
హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం.. 1996లో ఈ జీవోను అమల్లోకి తీసుకువచ్చారు. జీవో ప్రకారం ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. వ్యవసాయం తప్ప ఏ రంగానికి ఇక్కడ భూమి కేటాయింపు చేయకూడదు. ఐతే జీవో ఎత్తివేయాలని రెండు దశాబ్దాలుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లకు దీన్ని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.. అసలు రద్దు చేయడం వల్ల ఒరిగేది ఎవరికి.. లాభం ఎవరికి అన్నదే ఇక్కడ మ్యాటర్! ఎవరికి అంటే.. డబ్బున్నోడికే! జీవో ఏంటి.. అది ఉంచితే మీకు జరిగే నష్టమేంటి.. లేకుంటే లాభమేంటి అని ఆ 84 గ్రామాల్లోని జనాలను అడిగితే తెల్లమొహం వేస్తున్నారు. ఎందుకంటే ఆ లెక్కలు వారికి తెలియవు. జీవోను రద్దు చేస్తే ఒరిగేది ఏంటి అంటే.. చాలామంది గాల్లో దిక్కులు చూస్తుంటారు ఆ గ్రామాల్లో రైతులు బాగుపడతారు, సామాన్యుల బతుకులు మారతాయ్ అని కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నా.. ఆ పరిస్థితి లేదు అక్కడ.
డబ్బున్నోడు.. ఎక్కువ డబ్బు చూపించి.. ఆ రైతుల నుంచి భూములు ఎప్పుడో కొనుగోలు చేసేశారు కూడా! తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. 111జీవో పరిధిలో భారీగా పెట్టుబడులు పెట్టారు. సామాన్య రైతుల నుంచి భూములు కొనేశారు. ఈ జీవో రద్దు చేస్తారని.. రెండేళ్ల కిందే తెలుసు. వాళ్లంతా అప్పుడే జాగ్రత్త పడ్డారు. భారీగా కొనుగోళ్లు, పెట్టుబడులు జరిపారు. ఇప్పుడీ జీవో రద్దుతో భూముల ధరలకు లెక్కలు వస్తాయ్. అప్పుడు బాగుపడేది ఎవరు.. డబ్బున్నోళ్లు మాత్రమే! వంద కోట్లు ఉన్నోడు.. వేల కోట్లకు అధిపతి అవుతాడు తప్ప.. సగటు రైతుకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదనే చర్చ జరుగుతోంది. ఒక్కటి మాత్రం నిజం.. 111 జీవో పరిధిలో ఇప్పుడు రైతులు లేరు. ఉన్నా వాళ్లకు భూముల్లేవ్. రద్దుతో సామాన్యులకు ఒరిగేదేమీ లేదు. కేసీఆర్ ఒకరకంగా వీళ్లందరిని మోసం చేసినట్లే అన్నది మాత్రం క్లియర్.