NEGGEDEVARU – JAGGAMPETA : జగ్గంపేటలో నెగ్గేదెవరు ?

జగ్గంపేటలో వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ... ఈసారైనా గెలుస్తుందా ? పాత ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న పోరులో... ఎవరు పైచేయి సాధిస్తారు? వైసీపీ అభ్యర్థిపై టీడీపీ క్యాండిడేట్‌ రివెంజ్‌ తీర్చుకుంటారా ? పాత ప్రత్యర్థులు.. కొత్తగా తొడలు కొడుతున్నారు. మరి గెలుపు ఎవరిది.

 

 

 

జగ్గంపేటలో వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ… ఈసారైనా గెలుస్తుందా ? పాత ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న పోరులో… ఎవరు పైచేయి సాధిస్తారు? వైసీపీ అభ్యర్థిపై టీడీపీ క్యాండిడేట్‌ రివెంజ్‌ తీర్చుకుంటారా ? పాత ప్రత్యర్థులు.. కొత్తగా తొడలు కొడుతున్నారు. మరి గెలుపు ఎవరిది. జనసేన రెబెల్‌ చీల్చబోయే ఓట్ల మీదే.. ఇద్దరి నేతల భవిష్యత్ ఆధారపడి ఉందా.. అసలు జనం మనసు గెలుచుకుంది ఎవరు.. జగ్గంపేటలో నెగ్గేది ఎవరు ?

ఏపీలో పోలింగ్‌ ముగిసినా.. అభ్యర్థులకు టెన్షన్‌ తప్పడం లేదు. ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌కు, ఫలితాలకు ఎక్కువ గ్యాప్‌ రావడంతో… ఊపిరి బిగపట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు. తమ అనుచరులు, పార్టీ కార్యకర్తలతో గెలుపు లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో.. రాజకీయ లెక్కలు జోరుగా సాగుతున్నాయ్. ఇక్కడి నుంటి టీడీపీ తరఫున జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తుంటే.. వైసీపీ నుంచి మాజీ మంత్రి తోట నరసింహం బరిలో దిగారు. ఇద్దరూ పాత ప్రత్యర్థులే.. అయితే రెండు ఎన్నికల గ్యాప్ తర్వాత తిరిగి ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నారు. దీంతో రెండు వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత పాత శత్రువులు పోటీ పడటంతో… జగ్గంపేట నియోజకవర్గంపై ఇప్పుడు అందరి దృష్టి పడింది.

జ్యోతుల నెహ్రూ… జగ్గంపేట నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు, వైసీపీ తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తోట నరసింహం కాంగ్రెస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు. అయితే తోట నరసింహం గెలిచిన రెండుసార్లు కూడా జ్యోతుల నెహ్రూ మీదే కావడం అసలు చర్చకు కారణమైంది. ఆ రెండుసార్లు చాలా స్వల్ప ఓట్ల తేడాతో నరసింహం ఎమ్మెల్యేగా గెలిచి… వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2009లో ట్రయాంగిల్ ఫైట్‌లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన జ్యోతుల నెహ్రూ… రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. 2014లో టీడీపీ తరఫున కాకినాడ ఎంపీగా గెలిచిన తోట… 2019 ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దాదాపు రెండు ఎన్నికల విరామం తర్వాత పాత ప్రత్యర్థులు సై అంటే సై అంటున్నారు. ముచ్చటగా మూడోసారి ఇద్దరు నేతలు బరిలో నిలవడంతో ఫలితం ఎలా ఉండబోతుందని.. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. ఐతే తోట నరసింహానిదే విజయం అని ఆయన అనుచరులు అంటుంటే.. జ్యోతుల నెగ్గి తీరుతారని ఆయన వర్గం ధీమాగా కనిపిస్తోంది. దీంతో టెన్షన్ మరింత పెరుగుతోంది. జగ్గంపేటలో మొత్తం 2లక్షల 29వేల 863 ఓట్లు ఉన్నాయ్. ఈ ఎన్నికల్లో 83.65 శాతం పోలింగ్ నమోదయింది.

గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి పోలింగ్‌ తగ్గింది. ఐతే పోలింగ్ పర్సంటేజ్ పై రెండు పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. గతంలో మాదిరిగానే స్వల్ప మెజారిటీతో బయట పడతామని స్థానిక నేతల దగ్గర అభ్యర్థులు ప్రస్తావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ద్వితీయ శ్రేణి నేతలతో గ్రామాల్లో పోలింగ్‌ ఎలా జరిగిందని.. తమ పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో పోలయిన ఓట్లపై ఆరా తీస్తున్నారు. జనసేన నుంచి సీటు ఆశించి దక్కకపోవడంతో… పాఠంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆయన చీల్చే ఓట్లపై కూడా వైసీపీ అభ్యర్థి గట్టిగానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన సూర్యచంద్రకు 10వేల 649 ఓట్లు వచ్చాయ్‌ ఈసారి కూడా అలాగే వస్తే బయటపడిపోవచ్చని… సూర్యచంద్రకి వచ్చే ఓట్లు అన్నీ.. కూటమివే అని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. అటు టీడీపీ కూడా నియోజకవర్గంపై భారీగానే ఆశలు పెట్టుకుంది. తమకు అన్ని ఫ్యాక్టర్లు కలిసి వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. గతంలో జరిగిన పరిణామాలు వేరు… ఇప్పుడున్న పరిస్థితులు వేరు అని కేడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు జ్యోతుల నెహ్రూ.

గత ఎన్నికల్లో సూర్యచంద్రకు పడిన ఓట్లు పవన్ కల్యాణ్‌ను చూసి వేసినవని.. ఇప్పుడు సొంతంగా ఓట్లు వచ్చే పరిస్థితి లేదని క్లారిటీ ఇస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వర్గం… తోట నరసింహంకు సపోర్ట్ చేయలేదని దాని ప్రభావం ఉంటుందని టీడీప బావిస్తోంది. ఒకవేళ సూర్యచంద్ర కారణంగా టీడీపీకి మైనస్ జరిగితే… ఎమ్మెల్యే చంటిబాబుతో వైసీపీ కష్టాలు తప్పవని కొత్త ఈక్వేషన్స్ తెరమీదకు తీసుకొస్తున్నారు. దానికి వైసీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి. చంటిబాబు చేతులెత్తేయడం వల్లే తోట నరసింహంను పార్టీ బరిలోకి దించిందని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్లు గెలుపుపై కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నారు. అయితే ఎక్కడో తేడా కొడుతుందటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు రెండు పార్టీల నేతలు. మొత్తానికి జగ్గంపేటలో ఎన్నికల ఫలితాలు జంక్షన్ జామ్ అయ్యేలా చర్చలు జరుగుతున్నాయి. రెండు పార్టీలు గెలుపుపై ధీమాగానే ఉన్నప్పటికీ… ఏదో తేడా కొడుతుందంటూ ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. తమ ప్లస్సులు కౌంట్‌ చేసుకుంటూనే… అవతలి వారికి మైనస్ అయ్యే వాటిపై ఫోకస్ పెట్టారు. మరి ఎవరి లెక్కలు ఎక్కాలు వర్కౌట్ అవుతాయో చూడాలి.