ఈమధ్య వార్తల్లో లేని నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఒక్కసారిగా సంచలనం రేపాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూనే…. సీఎంకు బర్త్డే విషెస్ చెప్పని టాలీవుడ్ యాక్టర్స్ అందరిని ఆట ఆడుకున్నాడు. సీఎం కేవలం సినిమా టికెట్లు రేట్లు తగ్గించడానికి మాత్రమే పనికొస్తాడా….? అవసరానికి ఆయన్ని వాడుకొని కనీసం పుట్టినరోజు విషెస్ కూడా చెప్పరా అంటూ పరోక్షంగా చిరంజీవి, నాగార్జునలను ఎక్స్ లో ఉతికి ఆరేసాడు. అసలు బండ్ల కామెంట్స్ వెనక ఏం జరిగింది? ఎందుకు బండ్ల చెలరేగిపోయాడు ?
గ్రీన్కో సంస్థ అధినేత, మల్టీ బిలినియర్ చలమల శెట్టి అనిల్ గోపి 50వ పుట్టినరోజు మాల్దీవ్స్ లో ఘనంగా చేసుకున్నాడు. ఈ పుట్టినరోజు వేడుకలకి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. సెలబ్రిటీలకు పార్టీలు ఇవ్వడం…. విదేశాలకు తిప్పడం అనిల్ గోపి కి కొత్త ఏమీ కాదు. ముఖ్యంగా రామ్ చరణ్ కు గోపి ఒక మెంటార్లా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. సినిమా వాళ్ళంతా అనిల్ గోపి బర్త్డే మాల్దీస్ లో సెలబ్రేట్ చేసుకున్నారనే విషయం టాలీవుడ్ లో గుప్పు మంది.
అయితే నవంబర్ 8న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు. తన బర్త్డే రోజు ఆయన మూసీ నది ఒడ్డున పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు సినీ నిర్మాత బండ్ల గణేష్ ఎక్స్ లో రేవంత్ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్పారు. అంతటితో ఊరుకోలేదు. టికెట్లు రేట్లు తగ్గించుకోవడానికి ముఖ్యమంత్రి పనికి వస్తాడా? ఆయన పుట్టినరోజుకు విషెస్ చెప్పాలన్న జ్ఞానం లేదా అంటూ చిరంజీవి ,నాగార్జున తో పాటు టాలీవుడ్ హీరోలు అందరినీ కడిగిపారేశాడు, కొత్త వివాదానికి తెర తీశాడు. పుట్టినరోజు కి శుభాకాంక్షలు చెప్పకపోతే ఎవరు ఫీల్ అవ్వరు. కానీ పలానా వాడు చెప్పలేదు చూశావా… ఎంత విశ్వాసఘాతకు డో అని ఎవరైనా గుర్తు చేస్తే మాత్రం… ఎవరికైనా కాలుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చి టాలీవుడ్ హీరోలకు కొత్త తలనొప్పి సృష్టించాడు బండ్ల.
నిజానికి టాలీవుడ్ పెద్ద హీరోలు అందరూ బండ్ల గణేష్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు. అతనికి నిర్మాతగా సినిమాలు ఇవ్వడానికి ఎవరూ ధైర్యం చేయట్లేదు. గణేష్ నిర్మాతగా 2015 లో జూనియర్ ఎన్టీఆర్ తో టెంపర్ తీశారు. అదే ఆయనకి చివరి సినిమా. తీసిన ఎనిమిది సినిమాలు టాప్ హీరోలతోనే. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సన్నిహితుడని చెప్పుకుంటూ చాన్నాళ్లు తిరిగినప్పటికీ ఐదేళ్లుగా గణేష్ ని పవన్ పూర్తిగా దూరంగా పెట్టాడు. పవన్ కళ్యాణ్ ని గణేష్ ఇటీవల చూసింది కూడా లేదు. బండ్ల గణేష్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్యాప్ సృష్టించారని టాలీవుడ్ టాక్. అందుకే త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ చాలాసార్లు గణేష్ కామెంట్స్ చేశారు. వివాదాలు సృష్టించడం, ఎక్కడ ఎలా పడితే అలా మాట్లాడడం… ప్రతి నిమిషం పాపులారిటీ కోసం పాకులాడటంతో టాలీవుడ్ లో టాప్ హీరోలందరూ గణేష్ కి దూరమైపోయారు. తొమ్మిదేళ్లుగా ఒక్క సినిమా తీయలేకపోయాడు అంటే గణేష్ ని ఇండస్ట్రీ ఎంత దూరంగా పెట్టిందో తెలుస్తోంది.
సినిమా లు లేకపోవడంతో కాంగ్రెస్ లో యాక్టివ్ గా తిరుగుతున్నాడు గణేష్. 2018, 2023 లో కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా కూడా ప్రయత్నించి సాధించలేకపోయాడు. ఇప్పుడు కనీసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశిస్తున్నాడు బండ్ల. ముఖ్యమంత్రి రేవంత్ కి సాధ్యమైనంత వరకు దగ్గరగా ఉండడానికి అన్ని రకాలుగా పులిహార కలుపుతూనే ఉన్నాడు. అప్పుడప్పుడు వివాదాస్పద స్టేట్మెంట్లతోనూ, ట్వీట్స్ తోను ఇలా రచ్చ రేపుతూ వార్తల్లో ఉంటున్నాడు . నిజానికి రేవంత్ బర్త్ డే కి చిరంజీవి, పవన్ కళ్యాణ్ మహేష్ బాబుల పిఆర్ టీం రెగ్యులర్ ట్వీట్స్ చేసింది. రేవంత్ కి నేరుగా ఫోన్ చేసి మాట్లాడు ఉండకపోవచ్చు. ఏది ఏమైనా బండ్ల గణేష్ ట్విట్ ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద గందరగోళం లేపింది.
కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ కి ఇచ్చే అవార్డులను గద్దర్ అవార్డ్స్ పేరుతో ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీతో పెద్దగా సంబంధం లేని గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడాన్ని టాలీవుడ్ లో చాలామంది వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి గద్దర్ అవార్డ్స్ ప్రకటన అయితే చేశారు కానీ ఇప్పటివరకు మళ్లీ అది కార్యరూపం దాల్చలేదు. ఏదేమైనా బండ్ల గణేష్ వివాదాస్పద స్టేట్మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ని, కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గాన్ని కదిలించింది. టాలీవుడ్ హీరోలకు అంత బలుపు ఎందుకు…. ముఖ్యమంత్రి బర్త్ డే కి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పరా? ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాదులో, ప్రతి అవసరానికి హీరోలు ,నిర్మాతలు ప్రభుత్వం దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. సీఎంతో పనులు చేయించుకుంటారు. పెద్ద సినిమాలు రిలీజ్ అయితే ఆరు షోలు వేయించుకుంటారు. టికెట్ల రేట్లు పెంచుకుంటారు. ఇన్ని చేసిన సీఎం కి బర్త్డే విషెస్ చెప్పరా? అనే చర్చకు గణేష్. తన రాజకీయ ఉనికి కోసం బండ్ల గణేష్ వేపిన రచ్చ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి… తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ ని బయటపెట్టింది. బండ్లని టాలీవుడ్ లో చాలామంది కసితీరా తిట్టుకుంటున్నారు. తన పదవుల కోసం హీరోలను నిర్మాతలను దర్శకత్వం అందరినీ ఇరికించేశాడని నెత్తి… నోరు కొట్టుకుంటున్నారు. దట్ ఈజ్ బండ్ల.