Rahul – BJP: బీజేపీ రాహుల్ జపం చేస్తోంది అందుకేనా..?

ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు కాంగ్రెస్ పార్టీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమనే నమ్మకం కావచ్చేమో..! విపక్షాలు మూడో కూటమి పేరుతో ఎగిరెగిరి పడుతున్నా కాంగ్రెస్ మాత్రం కిమ్మనడం లేదు.

  • Written By:
  • Publish Date - March 20, 2023 / 05:16 PM IST

రాహుల్ గాంధీ ఎక్కడుంటే అక్కడ బీజేపీ ఉంటుంది. రాహుల్ ను వీలైనంతగా వాడుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్నట్టుంది. రాహుల్ గాంధీ ఏం చేసినా, ఏం మాట్లాడినా దాన్ని చర్చనీయాంశంగా మార్చేస్తోంది బీజేపీ. రాహుల్ మాట్లాడిన దాంట్లో ఏదో ఒక అంశాన్ని లేవనెత్తి దాని ద్వారా రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తోంది. రాజకీయ పార్టీలు ఇలాంటివి చేయడం మామూలే. ప్రత్యర్థులు ఏ చిన్న తప్పు చేసినా దాన్ని సొమ్ము చేసుకునేందుకు ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నించడం సహజమే. అయితే రాహుల్ గాంధీ విషయంలో బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తోంది.

రాహుల్ గాంధీని పెద్ద హీరోను చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. రాహుల్ గాంధీని ఎంత గొప్పగా ప్రొజెక్ట్ చేస్తే.. తమ గెలుపు అంత సులువు అవుతుందని బీజేపీ నమ్ముతోందని ఆమె అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ఉన్నంతవరకూ కేంద్రంలో మోదీ గెలుపుకు ఢోకా ఉండదనేది మమత బెనర్జీ అంచనా. కాంగ్రెస్ పార్టీ ఈ విషయం గ్రహించనంత వరకూ ఆ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాలేదని మమత స్పష్టం చేశారు.

రాహుల్ ను అమాయకుడిగా ముద్ర వేయడం బీజేపీ స్ట్రాటజీ. పప్పు అను ఇన్నాళ్లూ సంబోధిస్తూ వస్తోంది. తాజాగా లండన్లో రాహుల్ చేసిన కామెంట్స్ ను పట్టుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రాహుల్ అడిగే వాటికి సమాధానం చెప్పకుండా అతడిపైనే రివర్స్ అటాక్ చేసి డిఫన్స్ లో పడేయడం బీజేపీ స్ట్రాటజీ. ఇప్పుడు బీజేపీకి మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్ తదితరులు కూడా తోడయ్యారు. బీజేపీని అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ మాత్రం ఈ పార్టీలను ఏమాత్రం ఖాతరు చేయట్లేదు. తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు కాంగ్రెస్ పార్టీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమనే నమ్మకం కావచ్చేమో..! విపక్షాలు మూడో కూటమి పేరుతో ఎగిరెగిరి పడుతున్నా కాంగ్రెస్ మాత్రం కిమ్మనడం లేదు.