BJP: నార్త్‌లో బీజేపీ దూకుడు.. తెలంగాణలో స్లీప్ మోడ్.. ఎందుకు..?

బీఆర్ఎస్‌తో పోలిస్తే పార్టీ క్యాడర్ అంతగా లేని బీజేపీ మాత్రం స్లో మోడ్‌లోకి వెళ్లడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిణామం కేసీఆర్ అండ్ టీమ్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుందని, కారు పార్టీపై ఒత్తిడిని తగ్గిస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 08:50 PM IST

BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించినప్పటి నుంచి కమలదళం స్లో మోడ్ లోకి వెళ్లింది. ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలను కూడా తగ్గించేసింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తుకు సంబంధించిన వార్తలు కూడా పెద్దగా వినిపించడం లేదు. బండి సంజయ్ చేతి నుంచి తెలంగాణ పార్టీ పగ్గాలను లాక్కొని కిషన్ రెడ్డికి అప్పగించడం, ఆ తర్వాత కమలదళం దూకుడును తగ్గించడం దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో ఒక భాగమై ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఓ వైపు గులాబీ బాస్ కేసీఆర్ నాలుగు నెలల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, గ్రౌండ్‌లో తమకు ప్రతికూలంగా ఉన్నవాళ్లను దారికి తెచ్చుకునే పనిలో బిజీగా ఉన్నారు.

బీఆర్ఎస్‌తో పోలిస్తే పార్టీ క్యాడర్ అంతగా లేని బీజేపీ మాత్రం స్లో మోడ్‌లోకి వెళ్లడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ పరిణామం కేసీఆర్ అండ్ టీమ్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతుందని, కారు పార్టీపై ఒత్తిడిని తగ్గిస్తుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు బీజేపీని వదిలేసి కాంగ్రెస్ టార్గెట్‌గా బీఆర్ఎస్ పార్టీ విమర్శనాస్త్రాలను సంధిస్తోందని అంటున్నారు. సెప్టెంబరు నెలాఖరుకల్లా కూడా బీజేపీ అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ కాకపోవచ్చని మీడియాలో కథనాలు వస్తున్నాయి. బండి సంజయ్ ఉన్న టైంలో చేరికలపై బీజేపీ ఎంతో ఫోకస్ చేసింది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా ఘాటైన విమర్శలను సంధించింది. కానీ, ఇప్పుడు అంతా ‘స్లో అండ్ సాఫ్ట్’ గా మారిపోయిందనే ఒపీనియన్ రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈవిధమైన సాఫ్ట్ కార్నర్ పరమార్ధమేంటో అంతుచిక్కడం లేదని అంటున్నారు.
రాజస్థాన్‌లో దూకుడు.. తెలంగాణలో స్లో
మరోవైపు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో బీజేపీ దూకుడుగా పోతోంది. అక్కడ పార్టీ ఆధ్వర్యంలో వరుస బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. స్వయంగా ప్రధాని మోడీ కనీసం నెలకు ఒకసారైన రాజస్థాన్‌లోని జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా నెలకు రెండు సార్లైనా రాజస్థాన్‌ను విజిట్ చేస్తున్నారు. తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ఇంకో విధంగా ఉండబట్టే.. ఇక్కడ స్లోగా వ్యవహరిస్తున్నారనే అంచనాలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్‌ను ప్రధాన శత్రువుగా పరిగణిస్తూ.. ఇండియా కూటమితో దూరాన్ని పాటిస్తున్నందు వల్లే బీఆర్ఎస్‌కు ఈ విధంగా అన్ని రకాలుగా లైన్ క్లియర్ అవుతోందని పలువురు పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
బండి సంజయ్, అరవింద్ నో చెప్పారా..?
తెలంగాణ బీజేపీలో కీలక నేతలందరూ అసెంబ్లీ బరిలో దిగితే ఫలితాలు బాగుంటాయని పార్టీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఐదుగురు బీజేపీ ఎంపీలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే ఛాన్స్ ఉందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో అమిత్ షా ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన మీటింగ్‌లో ఎంపీలు, జాతీయ నాయకులు అందరూ పోటీ చేయాల్సిందేనని తీర్మానం చేసినట్టు సమాచారం. అయితే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న బండి సంజయ్.. తిరిగి కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికే ఆసక్తి చూపుతున్నారట. నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా లోక్‌సభ ఎన్నికల బరిలోనే ఉంటానని తేల్చి చెప్పారట.