ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకూ చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. వచ్చే ఏడాది మేలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానంగా వైసీపీ, టీడీపీల మధ్యే పోరు ఉంటుంది. అయితే జనసేన కూడా కాస్తో కూస్తో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక బీజేపీ పరిస్థితి ఇక్కడ అంతంతమాత్రమే. కనీసం డిపాజిట్లు కూడా దక్కుతాయనే నమ్మకం లేదు. అయితే ఇక్కడ మూడు పార్టీలూ బీజేపీకి అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ బిందాస్ గా ఉంది. కాదనకుండా అందరూ మద్దతు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లు.. అధికారం లేకపోయినా ఏపీలో ఉన్నంత స్ట్రాంగ్ గా బీజేపీ మరే రాష్ట్రంలోనూ లేదు.
కానీ ఎన్నికల వేళ పార్టీలన్నీ పోటీ చేయడం కామన్. అలాగే బీజేపీ కూడా పోటీ చేస్తుంది. అయితే అది ఒంటరిగానా.. లేకుంటే పొత్తులు పెట్టుకుంటుందా.. అనేది ఇప్పుడే చెప్పలేం. ఇప్పటికైతే జనసేన – బీజేపీ కలిసి పని చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీని కూడా రమ్మని పిలుస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ససేమిరా అంటోంది. చంద్రబాబుతో కలిసి పని చేసేందుకు బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. పైగా ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. చంద్రబాబు తమతో మంచిగా ఉన్నా.. ఆయన్ను కాదని జగన్ వైపే మొగ్గు చూపుతోంది బీజేపీ అధిష్టానం. ఇందుకు అనేక కారణాలున్నాయి.
ప్రతిరాష్ట్రంలోనూ పాగా వేయాలనేది బీజేపీ ప్లాన్. ఒకవేళ ఏపీలో టీడీపీ-జనసేనతో కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తే బీజేపీ వైసీపీకి దూరమవుతుంది. అధికారంలోకి వస్తే సరి. లేకుంటే కేడర్ కూడా పెద్దగా పుంజుకునే అవకాశం ఉండదు. అదే ఒంటరిగా వెళ్తే చాలా ప్రయోజనాలున్నాయి. కేంద్రంలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీజేపీ గట్టిగా నమ్ముతోంది. ఇలాంటప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తారు. అప్పుడు టీడీపీ కేడర్ ను తమవైపు తిప్పుకోవచ్చు. టీడీపీని తొక్కేయొచ్చు. ఎలాగూ జగన్ తను చెప్పినట్టు వింటారు కాబట్టి సమస్య కూడా లేదు. పైగా పార్టీ బలోపేతానికి వీలవుతుంది.
అలా కాకుండా చంద్రబాబుతో వెళ్తే పార్టీకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. పైగా చంద్రబాబు అధికారంలోకి వస్తే బీజేపీకి వ్యతిరేకంగా మళ్లీ కుట్రలు చేయడనే నమ్మకం కమలం పార్టీ నేతలకు లేదు. చంద్రబాబుకు చనువిస్తే చంకనెక్కేస్తాడనే భయం బీజేపీకి ఉంది. అవసరమైతే కేంద్రంలో విపక్షాలన్నింటినీ ఏకం చేసి బీజేపీ వ్యతిరేకంగా కట్టగట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గతంలో ఇలాగే బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు చంద్రబాబు. అందుకే చంద్రబాబును బీజేపీ అధిష్టానం అస్సలు నమ్మట్లేదు. ఏపీలో జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, టీడీపీని నిర్వీర్యం చేసేయాలని బీజేపీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. మరి బీజేపీ ఆశలు నెరవేరుతాయా..?