TDP With BJP: తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు..? కేసీఆర్‌కు చెక్ పడినట్లేనా? బీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకిస్తోంది..?

ఇటీవలే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కచ్చితంగా రాజకీయాల కోసమే కలిసి ఉంటారని ఎవ్వరికైనా అర్థమైన విషయమే. అయితే.. ఏ అంశాలపై చర్చించారు అనేది తెలియాల్సి ఉంది. గత ఎన్నికలకు ముందు బీజేపీ-టీడీపీ మధ్య వైరం పెరిగింది.

  • Written By:
  • Publish Date - June 6, 2023 / 02:46 PM IST

TDP With BJP: తెలంగాణలో బీజేపీ-టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయా? ఇదే జరిగితే ఆ రెండు పార్టీలకు లాభమా.. నష్టమా..? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. కచ్చితంగా రాజకీయాల కోసమే కలిసి ఉంటారని ఎవ్వరికైనా అర్థమైన విషయమే. అయితే.. ఏ అంశాలపై చర్చించారు అనేది తెలియాల్సి ఉంది. గత ఎన్నికలకు ముందు బీజేపీ-టీడీపీ మధ్య వైరం పెరిగింది. మోదీని, బీజేపీని చంద్రబాబు అండ్ కో విమర్శించింది. ఇప్పుడు ఏపీలో జనసేన-బీజేపీ మద్య అవగాహన ఉంది. టీడీపీతో కలిసేందుకు జనసేన సిద్ధంగా ఉంది. అయితే, తమతో పొత్తుకు బీజేపీ కూడా కలిసి రావాలని రెండు పార్టీలు కోరుకుంటున్నాయి. ఈ విషయంలో ఇప్పటికిప్పుడే బీజేపీ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతాయి. అయితే, తెలంగాణలో పరిస్థితి భిన్నం. అక్కడ మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపే పార్టీలు తమ రాజకీయ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దీనిలో భాగంగా టీడీపీ-బీజేపీ కలిసి పనిచేస్తాయనే ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారేశారు. ఇవన్నీ ఒట్టి గాలివార్తలే అంటూ వ్యాఖ్యానించారు.
నిజంగానే పొత్తు లేదా?
టీడీపీ-బీజేపీ కలిసి తెలంగాణలో పోటీ చేసే అంశాన్ని ఇప్పుడే కొట్టిపారేయలేం. ఎందుకంటే ఎన్నికలకు ఇంకాస్త టైం ఉంది. ఆలోపు అనేక రాజకీయ సమీకరణాలపై స్పష్టత రావాలి. ఆ తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. పైగా తెలంగాణలో కలిసి పోటీ చేస్తే.. ఏపీలోనూ కలవాల్సి ఉంటుంది. కాబట్టి, రెండు రాష్ట్రాల పరంగా బీజేపీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి అంతగొప్పగా ఏం లేదు. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ క్యాడర్ నిరాశలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ బలపడుతోంది. దీంతో బీజేపీ తిరిగి పుంజుకోవాల్సిన అవసరం ఉంది. అలాగని ఒంటరిగా వెళ్తే లాభం లేదు. బీఆర్ఎస్‌తో కలవలేదు. కాంగ్రెస్‌తో ఛాన్సే లేదు. కమ్యూనిస్టులు కలిసి రావు. బీఎస్పీతో సిద్ధాంత పరంగా విబేధాలు. వీటన్నింటిమధ్యా బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ తెలుగుదేశం. ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. టీడీపీకి ఇక్కడి ఆంధ్రా ఓటర్లలో మంచి పట్టుంది. పైగా ఒక సామాజిక వర్గం అండ దొరుకుతుంది. ఇది కొన్ని చోట్ల బీజేపీకి కలిసొస్తుంది.

అయితే, ఇదే అంశం బీజేపీకి మైనస్‌గా మారే ఛాన్స్ ఉంది. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీతో పొత్తు అంటూ.. తెలంగాణ సెంటిమెంట్‌ను సాకుగా చూపి బీఆర్ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీలు బలపడతాయి. అలాగే ఆంధ్రా సెటిలర్ల ఓట్లలో చీలిక వచ్చి బీఆర్ఎస్‌కు లబ్ధి కలిగే అవకాశం ఉంది. ఆంధ్రా ఓటర్లపై బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది. బీజేపీ-టీడీపీ కలిస్తే కాంగ్రెస్‌కు పడే ఓట్లలో చీలికవచ్చి బీఆర్ఎస్‌కు లాభం కలుగుతుంది. ఈ పొత్తు ఒకరకంగా కేసీఆర్‌కు కలిసొచ్చేదే. అయితే, ఇది పూర్తిగా కేసీఆర్‌కు కలిసొస్తుందని చెప్పలేం. ఎందుకంటే బీజేపీకి, టీడీపీకి కొన్ని చోట్ల తటస్థ ఓటర్లున్నారు. వీళ్లంతా కలిస్తే కచ్చితంగా బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బే.అలాగే కేంద్రంలో చక్రం తిప్పగల సత్తా ఉన్న చంద్రబాబు, బీజేపీతో కలిస్తే కేసీఆర్‌కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. టీడీపీ, బీజేపీ కలిస్తే కేంద్రంలోనే కాదు.. రాష్ట్రంలోనూ టీడీపీ పలుకుబడి పెరుగుతుంది. కేసీఆర్‪కు వ్యతిరేకంగా పావులు కదపగల సత్తా చంద్రబాబుకు ఉంది. అందుకే ఈ కలయికను కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు.
బీఆర్ఎస్‌కు ఎందుకు వ్యతిరేకత?
జాతీయ పార్టీగా మారినప్పటికీ బీఆర్ఎస్‌కు జాతీయ భావం కరువైందేమో అనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ తెలంగాణలో పోటీ చేయడాన్ని బీఆర్ఎస్‌ వ్యతిరేకిస్తోంది. ఆంధ్రా పార్టీ అంటూ ముద్ర వేస్తోంది. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ అంటూ అనేక అంశాల్ని తెరమీదకు తెస్తోంది. అసలు జాతీయ పార్టీ అని చెప్పుకొని, అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తామని చెప్పి.. పక్క రాష్ట్రానికి చెందిన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తాం అంటే విమర్శించడం ఏంటో బీఆర్ఎస్ నేతలకే తెలియాలి. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయడానికి లేని సమస్య.. టీడీపీ తెలంగాణలో పోటీ చేస్తే మాత్రం ఎందుకు? తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తే ఆ పోటీ ప్రభావం బీఆర్ఎస్‌పై కచ్చితంగా ఉంటుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రా ఓటర్లు అధికం. ఖమ్మం జిల్లాలోనూ వీరి ప్రభావం ఎక్కువ. టీడీపీ పోటీ చేస్తే సెటిలర్ల ఓట్లను టీడీపీ భారీస్థాయిలో కొల్లగొడుతుంది. అందుకే టీడీపీ ఇక్కడ పోటీ చేయకూడదని బీఆర్ఎస్ కోరుకుంటోంది. ఈ లోపు టీడీపీని దెబ్బతీయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. తెలంగాణలో టీడీపీపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబుపై వీలున్నప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. అయితే.. నిజంగానే టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా అనేది కాలమే నిర్ణయిస్తుంది.