Buggana Rajendranath Reddy: బుగ్గన ఏమయ్యారు…? అప్పులపైనా వాళ్లే సమాధానం చెప్పాలా…!?

ఇప్పటికైనా బుగ్గన మౌనం వీడి ఏపీ అప్పులపై స్పందిస్తే బాగుంటుంది. 10లక్షల కోట్లు ఏమయ్యాయన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఆయన చెబితేనే సరిగ్గా ఉంటుంది. వాళ్లూ వీళ్ల కన్నా ఆయన సమాధానమే ముఖ్యం. మరి ఇంతకీ బుగ్గన దీనిపై స్పందిస్తారా...? మనకెందుకొచ్చిందిలే అని ఊరుకుంటారా...? లేక వైసీపీ పెద్దల ఆదేశాలతో తూతూ మంత్రంగా స్పందించి సైడైపోతారా...?

  • Written By:
  • Publish Date - July 29, 2023 / 12:33 PM IST

ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కనిపించడం లేదు. నిజమే.. కొంతకాలంగా ఆయన మీడియాతో దూరాన్ని మెయింటైన్ చేస్తున్నారు. రాష్ట్ర అప్పులపై ప్రతిపక్షాల విమర్శలకు కూడా ఆర్థిక మంత్రి కాకుండా వేరేవాళ్లు సమాధానం చెబుతున్నారు… ఇంతకీ అసలు బుగ్గన ఏమయ్యారు….? ఎందుకు మౌనవ్రతం పాటిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అప్పులు 10లక్షల కోట్ల రూపాయలు… ఇదీ ప్రతిపక్షాల విమర్శ. మా హయంలో కంటే నాలుగైదు రెట్లు ఎక్కువ అప్పులు తెచ్చారు… అయినా అభివృద్ధి శూన్యం అన్నది టీడీపీ వాదన. ఇన్ని లక్షల కోట్లు ఏమయ్యాయో తేల్చాలన్నది బీజేపీ ప్రశ్న. రాష్ట్రాల అభివృద్ధి కోసం అప్పులు చేయడం సహజమే. అది టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరైనా సరే అప్పు చేయకుండా ప్రభుత్వం నడవదు. కానీ ఈసారి ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తెచ్చేసారన్న విమర్శలున్నాయి. ఈ అంశం ప్రజల్లోకి కూడా వెళ్లిపోయింది. అప్పు పుట్టకపోతే ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది.

ఓ రకంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రి కంటే అప్పుల మంత్రి అయిపోయారు. ఆర్థిక వ్యవహారాలు చూడటం కంటే ఎక్కడ అప్పు దొరుకుతుందా అన్నది చూడటం ఆయన పనైపోయింది. నెలలో సగం రోజులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. కానీ గత కొన్ని రోజులుగా ఆయన మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా ఆయన నోరు మెదపడం లేదు. ఇటీవల రాష్ట్రంలో పెట్టుబడుల సాధన కోసం విదేశాలకు వెళ్లొచ్చారు. ఆ తర్వాత కూడా ఆయన ప్రెస్‌మీట్ పెట్టలేదు. ఏం చేసిందీ చెప్పలేదు. అప్పులపై విపక్షాలు ఇంత గగ్గోలు పెడుతున్నా ఆయన వాటిని ఖండించడానికైనా మీడియా ముందుకు రావడం లేదు. మీడియా ముందుకొచ్చి మాట్లాడితే తర్వాతెప్పుడైనా దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుందని మంత్రి భయపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తలకు మించి అప్పులు తెచ్చామని, ఆ లెక్కలన్నీ చెప్పుకోవడం కంటే సైలెంట్‌గా ఉంటేనే బెటరని ఆయన భావిస్తున్నారంటున్నారు. అప్పులు పుట్టడం కూడా కష్టంగానే ఉందని ఇప్పుడు మీడియా ముందుకొచ్చి అభాసుపాలు కావడం కంటే మౌనంగానే ఉండాలని ఆయన డిసైడైనట్లు చెబుతున్నారు.

ఎంత అప్పు చేస్తున్నాం, దేనికెంత ఖర్చు పెడుతున్నాం అన్నది ఆర్థికమంత్రి కంటే ఇంకెవరికీ ఎక్కువ తెలిసుండదు. ఆయన చెప్పినంత స్పష్టంగా ఇంకెవరూ చెప్పలేరు కూడా. కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉంటున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అప్పులపై చేసిన విమర్శలను మంత్రి అమర్‌నాథ్ ఖండించారు. నిబంధనల మేరకే అప్పులు చేస్తున్నాం… చంద్రబాబు మాయలో పడొద్దంటూ పొలిటికల్ విమర్శలు చేశారు కానీ అప్పులపై మాత్రం స్పష్టత ఇవ్వలేకపోయారు. అవసరమైతే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. మరి నిజంగా చర్చంటూ జరిగితే ఎవరొస్తారు అమర్‌నాథా లేక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డా…? తొలిసారి మంత్రైన అమర్‌నాథ్‌కు ఆర్థిక శాఖ గురించి ఎంత తెలుసో మనకు తెలియదు. అసలు ఆయనతో అప్పులపై విమర్శలను ఖండించడం ఏంటో అర్థం కాదు. మరికొంత మంది సీనియర్లు కూడా అప్పులపై విపక్షాల విమర్శలను కొట్టి పారేస్తున్నా అది రాజకీయ ఎదురుదాడిలాగానే కనిపిస్తోంది కానీ పక్కా లెక్కలతో అథంటిక్‌గా చెప్పే పరిస్థితి లేదు.

ఇప్పటికైనా బుగ్గన మౌనం వీడి ఏపీ అప్పులపై స్పందిస్తే బాగుంటుంది. 10లక్షల కోట్లు ఏమయ్యాయన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఆయన చెబితేనే సరిగ్గా ఉంటుంది. వాళ్లూ వీళ్ల కన్నా ఆయన సమాధానమే ముఖ్యం. మరి ఇంతకీ బుగ్గన దీనిపై స్పందిస్తారా…? మనకెందుకొచ్చిందిలే అని ఊరుకుంటారా…? లేక వైసీపీ పెద్దల ఆదేశాలతో తూతూ మంత్రంగా స్పందించి సైడైపోతారా…?